Group Exercise: కలిసి చేస్తే ఎన్నో ప్రయోజనాలు.. గ్రూప్ ఎక్సర్‌సైజ్‍‍తో లాభాలు ఇవే-key benefits with group exercise motivation boost to mental health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Group Exercise: కలిసి చేస్తే ఎన్నో ప్రయోజనాలు.. గ్రూప్ ఎక్సర్‌సైజ్‍‍తో లాభాలు ఇవే

Group Exercise: కలిసి చేస్తే ఎన్నో ప్రయోజనాలు.. గ్రూప్ ఎక్సర్‌సైజ్‍‍తో లాభాలు ఇవే

Group Exercise: వ్యాయామం ఇతరులతో కలిసి చేస్తే అదనపు ప్రయోజనాలు ఉంటాయి. గ్రూప్ ఎక్సర్‌సైజ్ ట్రెండ్ ఇటీవల పెరుగుతోంది. ఈ గ్రూప్ ఎక్సర్‌సైజ్ వల్ల కలిగే లాభాలు ఏంటో ఇక్కడ చూడండి.

Group Exercise: కలిసి చేస్తే ఎన్నో ప్రయోజనాలు.. గ్రూప్ ఎక్సర్‌సైజ్‍‍తో లాభాలు ఇవే

ప్రతీ రోజు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్‍గా ఉండొచ్చు. చాలా వ్యాధుల రిస్క్ కూడా తగ్గుతుంది. అయితే, ఒంటరిగా కాకుండా గ్రూప్‍గా వర్కౌట్స్ చేస్తే అదనపు ప్రయోజనాలు ఉంటాయి. స్నేహితులతో పాటు మీకు ఇష్టమైన వారితో కలిసి ఓ బృందంగా చేస్తే ఎక్సర్‌సైజ్ మరింత ఉల్లాసంగా సాగడంతో పాటు మరిన్ని లాభాలు ఉంటాయి. గ్రూప్ ఎక్సర్‌సైజ్‍ వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏవంటే..

మోటివేషన్ పెరుగుతుంది

గ్రూప్‍గా వర్కౌట్స్ చేయడం వల్ల స్ఫూర్తి పెరుగుతుంది. లక్ష్యానికి అనుగుణంగా ఎక్సర్‌సైజ్ చేయాలనే పట్టుదల అధికం అవుతుంది. ఎప్పుడైనా బద్దకంగా అనిపించి వర్కౌట్ వద్దనుకుంటే.. గ్రూప్‍లోని ఎవరో ఒకరు మోటివేట్ చేస్తారు. వ్యాయామానికి రావాలని పిలుస్తారు. దీంతో ఎక్సర్‌సైజ్‍కు వెళ్లాలని అనిపిస్తుంది. దీంతో రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేసే అవకాశం పెరుగుతుంది. చుట్టు అందరూ వర్కౌట్స్ చేస్తుంటే మోటివేషన్ అధికం అవుతుంది.

పరిచయాలు, బంధాలు పెరుగుతాయి

గ్రూప్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల మీ బృందంలోని ఇతరులతో పరిచయాలు మరింత బలోపేతం అవుతాయి. కొత్తవారు కూడా పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. ఒకరి ఫిట్‍నెస్ గోల్స్ మరొకరు పంచుకునే వీలు ఉంటుంది. సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. అలా గ్రూప్‍లో స్నేహ బంధాలు పెరిగే అవకాశం ఉంటుంది. కనెక్షన్లు, కమ్యూనిటీ తయారవుతుంది. వ్యక్తిగత జీవితంలోనూ ఇది చాలా తోడ్పడుతుంది.

ఇన్‍స్ట్రక్టర్‌ను నియమించుకోవచ్చు

కొందరు ఓ గ్రూప్‍గా మారి ఎక్సర్‌సైజ్ చేస్తే.. తమకు మార్గదర్శకం చేసేందుకు ఓ ఫిట్‍నెస్ ఇన్‍స్ట్రక్టర్‌ను నియమించుకోవచ్చు. ఒంటరిగా వ్యాయామం చేస్తే ఒక్కొక్కరు ఇన్‍స్ట్రక్టర్‌ను పెట్టుకోవడం కష్టమైన విషయమే. అయితే, గ్రూప్‍గా అయితే సులువవుతుంది. అందరూ కలిసి వ్యాయామం చేయడం వల్ల త్వరగా వర్కౌట్స్ అలవాటు అవుతాయి.

మానసిక ఆరోగ్యానికి కూడా మేలు

గ్రూప్‍గా ఇతరులతో కలిసి వర్కౌట్స్ చేస్తే ఎక్కువగా సంతోషంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల ఒత్తిడిగా, ఆందోళనగా, అలసటగా అనిపించదు. ఇతరులతో కలిసి చేసినప్పుడు శారీరక వ్యాయామాలను చాలా మంది ఇష్టపడతారు. స్నేహితులతో కలిసి ఎక్సర్‌సైజ్ చేసే సమయంలో ఫన్‍గానూ ఉంటుంది. సరాదాగా ఒకరినొకరు చాలెంజ్ చేసుకుంటూ వర్కౌట్స్ సాగించవచ్చు. ఇవన్నీ ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఇలా మానసిక ఆరోగ్యానికి కూడా గ్రూప్ ఎక్సర్‌సైజ్ తోడ్పడుతుంది.

గ్రూప్‍గా సాధారణ వర్కౌట్స్ చేయవచ్చు. సైక్లింగ్, డ్యాన్సింగ్ వర్కౌట్స్, యోగా, మెడిటేషన్, సర్క్యూట్ ట్రైనింగ్, జుంబా, ఎరోబిక్స్ ఇలా వివిధ రకాలు కూడా చేయవచ్చు. అలాగే, గ్రూప్‍లో ఉన్న కొందరి ఫిట్‍నెస్ గోల్స్, వారి శారీరక పరిస్థితి, పరిమితులు వేరుగా ఉండొచ్చు. అందుకే అందరూ కొన్నిసార్లు ఒకేరకమైన వర్కౌట్స్ కూడా చేయలేకపోవచ్చు. గ్రూప్‍గా ఉన్నప్పుడు ఎదుటి వారి నిర్ణయాలకు గౌరవం ఇవ్వాలి. ముఖ్యంగా ఫిట్‍నెస్‍లో ప్రోగ్రెస్ సహా ఇతర విషయాల్లోనూ ఇతరులతో ఎప్పటికీ పోల్చుకోకూడదు.