Yoga poses for BP Control: బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‍లో ఉండేందుకు తోడ్పడే 5 యోగాసనాలు ఇవే
Yoga poses for Blood Pressure Control: బ్లడ్ ప్రెజర్ నియంత్రణలో ఉండేందుకు కొన్ని రకాల యోగాసనాలు ఉపయోగపడతాయి. హైపర్ టెన్షన్‍ను తగ్గించగలవు. ఆ ఐదు ఆసనాలు ఏవో.. ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
ప్రస్తుతం బ్లడ్ ప్రెజర్ (రక్తపోటు) సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. అధిక బీపీ ఇతర ఆరోగ్య సమస్యకు దారితీస్తుంది. అందుకే ఇది అదుపులో ఉండేందుకు మందులు వాడడంతో పాటు ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే, బీపీ ఉన్న వారు యోగా చేయడం కూడా చాలా మంచిది. కొన్ని ఆసనాలు బ్లడ్ ప్రెజర్ తగ్గేందుకు తోడ్పడతాయి. హైపర్ టెన్షన్ అదుపులో ఉండేందుకు సహకరిస్తాయి. ఆ యోగాసనాలు ఏవంటే..
విపరీత కరణి ఆసనం
‘విపరీత కరణి’ యోగాసనం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. శరీరమంతా రిలాక్స్ అయినట్టుగా ఉంటుంది. దీనివల్ల ఈ ఆసనం వేస్తే బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉండేందుకు తోడ్పడుతుంది. ముందుగా నేలకు వీపును ఆనించి.. ఆ తర్వాత గోడను సపోర్ట్‌గా చేసుకొని రెండు కాళ్లపైకి ఎత్తాలి. నడుమును కూడా కాస్త పైకి ఎత్తి దాని కింద రెండు చేతులు సపోర్టుగా పెట్టాలి.
సుఖాసనం
హై బ్లడ్ ప్రెజర్ తగ్గేందుకు సుఖాసనం ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల మెదడు ప్రశాంతం మారుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఈ ఆసనం వేయడం కూడా చాలా సులభం. ముందుగా నేలపై ప్రశాంతంగా కూర్చోవాలి. వెన్నుముకను నిటారుగా ఉంచాలి. ఆ తర్వాత కళ్లు మూసుకొని.. శ్వాసపై ధ్యాస ఉంచాలి. శ్వాసను గాఢంగా తీసుకుంటూ వదలాలి.
బాలాసనం
బాలాసనం వల్ల కూడా బీపీ కంట్రోల్ అవుతుంది. శరీరానికి టెన్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీంతో అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. ఈ ఆసనం కోసం ముందుగా మోకాళ్లపై కూర్చోవాలి. ఆ తర్వాత ముందుకు వంగి రెండు చేతులను చాపాలి. అరచేతులతో పాటు తలను నేలకు ఆనించాలి. పిల్లలు బోర్లా నిద్రించినట్టుగా ఈ ఆసనం ఉంటుంది.
పశ్చిమోత్తానాసనం
పశ్చిమోత్తనాసనం వల్ల కూడా శరీరంలో రక్తప్రసరణ చాలా మెరుగవుతుంది. బాడీ రిలాక్స్ అవుతుంది. బీపీ కంట్రోల్‍లో ఉండేందుకు ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఆ ఆసనం వేసేందుకు ముందుగా నేలపై కూర్చొని రెండు కాళ్లను ముందుకు చాపాలి. ఆ తర్వాత ముందుకు వంగి కాలి వేళ్లను రెండు చేతులతో పట్టుకోవాలి. ముఖాన్ని మోకాళ్లకు ఆనించాలి.
జాను శీర్షాసనం
జాను శీర్షాసనం ఆందోళన, ఒత్తిడిని తగ్గించగలదు. దీంతో బీపీ అదుపులో ఉండేలా సహకరిస్తుంది. మెదడును రిలాక్స్ చేస్తుంది. కింద కూర్చొని ముందుగా ఓ కాలు ముందుకు చాపాలి. రెండు చేతులతో ఆ కాలి పాదాన్ని పట్టుకోవాలి. తల మోకాలి మీదుగా ఉండాలి. ఐదుసార్ల తర్వాత మరో కాలిని ముందుకు చాపి ఈ ఆసనం వేయాలి. నేలపై పడుకొని శ్వాసమీద ధ్యాస పెట్టే శవాసనం కూడా బీపీ ఉన్న వారికి మేలు చేస్తుంది.
ప్రతీ రోజు యోగా చేయడం వల్ల పూర్తి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అవసరానికి తగ్గట్టుగా ఆసనాలను వేయాలి. రెగ్యులర్‌గా ధ్యానం కూడా చేయాలి. దీనివల్ల శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా చాలా మంచిది.