Dates for Weight Loss: బరువు తగ్గేందుకు ఖర్జూరాలు ఉపయోగపడతాయా? రోజులో ఎన్ని, ఎప్పుడెప్పుడు తింటే మేలు?
Dates for Weight Loss: ఖర్జూరాలు ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి. బరువు తగ్గేందుకు కూడా తోడ్పడతాయి. వెయిట్ లాస్‍కు ఖర్జూరాలు ఎలా ఉపయోగపడతాయో.. రోజులో ఎన్ని తినాలో ఇక్కడ చూడండి.
ఖర్జూరాల్లో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, విటమిన్ బీ6, ఐరన్, మెగ్నిషియం సహా చాలా ముఖ్యమైన పోషకాలను ఇవి కలిగి ఉంటాయి. అందుకే ఖర్జూరాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా కొన్ని రకాలుగా ఇవి ఉపయోగపడతాయి. వెయిట్ లాస్ అయ్యేందుకు తోడ్పడతాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
అతిగా తినకుండా..
ఖర్జూరాల్లో డైయెటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల ఇవి తింటే కడుపు నిండిన ఫీలింగ్ చాలాసేపు ఉంటుంది. తరచూ ఏదో ఒకటి తినాలని అనిపించదు. అనారోగ్యకరమైన స్నాక్స్ తినకుండా ఉండొచ్చు. దీని వల్ల బరువు తగ్గే ప్రయత్నానికి ఖర్జూరాలు సహకరిస్తాయి. జీర్ణక్రియను కూడా ఫైబర్ మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ కూడా ఖర్జూరాల్లో ఉంటాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు.. కణాలు డ్యామేజ్ కాకుండా చేయగలదు.
నేచురల్ షుగర్‌గా..
ఖర్జూరాలు నేచురల్ షుగర్ సోర్స్‌గా ఉంటుంది. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరగకుండా ఇది నియంత్రించగలదు. తీపి పదార్థాలు తినాలనే ఆశను ఖర్జూరాలు అదుపు చేయగలవు. ఖర్జూరాలు తింటే స్వీట్స్ తీసుకోవాలనే తపన తగ్గుతుంది. దీంట్లో గ్లెసెమిక్ ఇండెక్స్ కూడా స్వల్పంగా ఉంటుంది. వీటి వల్ల బరువు తగ్గే జర్నీలో ఖర్జూరాలు ఉపయోపడతాయి.
100 గ్రాముల ఖర్జూరాల్లో సుమారుగా 656 మిల్లీగ్రాముల (ఎంజీ) పొటాషియం, 54ఎంజీ మెగ్నిషియం, 0.9 ఎంజీ ఐరన్ ఉంటాయి. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‍లో ఉండేందుకు పొటాషియం తోడ్పడుతుంది. కండరాలు, నరాల పనితీరుకు మెగ్నిషియం మెరుగుపరుస్తుంది. రక్తంలో ఆక్సిజన్ పెరిగేందుకు ఐరన్ ఉపయోగపడుతుంది. మొత్తంగా జీవక్రియను ఖర్జూరాలు మెరుగుపరుస్తాయి. అందుకే బరువు తగ్గేందుకు ఖర్జూరాలు ఉపయోగపడతాయి.
రోజులో ఎన్ని తింటే మేలు
బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారు రోజులో 3 నుంచి 4 ఖర్జూరాలు తినడం మంచిది. విటమిన్లు సహా పోషకాలు ఖర్జూరాల్లో మెండుగా ఉంటాయి. శక్తిని కూడా ఇవి ఇవ్వగలవు. అయితే, వెయిట్ లాస్ లక్ష్యంగా పెట్టుకున్న వారు రోజులో 4 కంటే ఎక్కువ ఖర్జూరాలు తినకూడదు. పరిమితి మేర తీసుకోవాలి. ఎక్కువగా తింటే బరువు పెరిగే రిస్క్ కూడా ఉంటుంది.
ఎప్పుడు తినాలి?
బరువు తగ్గేందుకు ప్రయత్నించే వారు ఉదయం వర్కౌట్లకు ముందు ఖర్జూరాలు తింటే మేలు. వీటితో రోజును మొదలుపెడితే కావాల్సిన ఎనర్జీ లభిస్తుంది. సాయంత్రం వేళ స్నాక్‍గానూ ఖర్జూరాలను తీసుకోవచ్చు. హెల్దీ స్నాక్‍గా ఇది ఉంటుంది.