Monday Motivation: క్షమించడం అలవాటు చేసుకో.. ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా?
Monday Motivation: క్షమాగుణం అనేది అత్యంత విలువైనది. పంతాలకు పోకుండా క్షమించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది.
క్షమించడం అనేది అందరూ అనుకునేంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా జీవితంలో ఎవరైనా మోసం చేసినా, దగ్గర అనుకున్న ఉన్న వారే తీవ్రంగా బాధపెట్టినా, వ్యక్తిగత దూషణ చేసినా అలాంటి వారిపై చాలా కోపం వస్తుంది. పంతం పెరిగిపోయి ప్రతీకారం తీర్చుకోవాలనే భావన రగులుతుంది. ఇలాంటి సమయాల్లో అందుకు కారణమైన వారిని క్షమించడం అనేది చాలా కష్టమైన విషయంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు వారిని నేరుగా ఏమీ చేయలేకపోయినా.. కనీసం మనసులో అయినా కసిగా ఉంటారు. అయితే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పంతం పెంచుకోకుండా.. ఎదుటి వారిని వీలైనంత క్షమిస్తే కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి.
తప్పు చేసిన వ్యక్తి క్షమాపణ అడగపోయినా.. మనసులో వారిపై ప్రతీకారం పెంచుకోకూడదు. వారిని క్షమించేశానని అనుకోవాలి. ముఖ్యంగా చిన్నచిన్న విషయాలకు ఎట్టిపరిస్థితుల్లో పంతాలు అధికం చేసుకోకూడదు. క్షమాగుణం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవంటే..
మానసిక ప్రశాంతత
మనల్ని బాధ పెట్టిన వారిని క్షమించడం ద్వారా మనకే మానసిక ప్రశాంతత దక్కుతుంది. క్షమించేస్తే వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే కసి మనసులో ఉండదు. ఏం చేసైనా బదులు తీర్చుకోవాలని ఆలోచనలు నిత్యం మదిలో ఉండవు. జరిగిందేదో జరిపోయిందనే భావన కలుగుతుంది. భవిష్యత్తులో ఏం చేయాలో, ఎలా జాగ్రత్త పడాలో క్లారిటీగా ఆలోచించే అవకాశం ఉంటుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.
నిశితంగా ఆలోచించొచ్చు
ఏదైనా మనసును బాధించే ఘటన జరిగితే ఎదుటి వ్యక్తిపై ప్రతీకారంగా పెంచుకోకుండా.. వారిని క్షమించే ధోరణిని అనుసరిస్తే పరిష్కారాలు దొరుకుతాయి. సమస్య గురించి నిశితింగా ఆలోచించేలా అవకాశం ఉంటుంది. అసలు తప్పు ఎవరిది, సమస్య అంత తీవ్రమైనదా.. కసి పెంచుకోవాల్సిన అవసరం ఉందా అనేవి ఆలోచించొచ్చు. ఒకవేళ ఆ వివాదం ఎంత తీవ్రమైనది కాదనిపిస్తే సులువుగా ఎదుటి వ్యక్తిని క్షమించేందుకు మనసు అంగీకరిస్తుంది.
బంధాలు నిలుస్తాయి
జీవిత భాగస్వామితోనో, బంధువులతోనో, స్నేహితులతోనో తీవ్రంగా గొడవలు అయిన సమయంలో మనసులో మరింత ఎక్కువ బాధ అనిపిస్తుంది. వారిలో ఎవరైనా వేదనకు గురి చేస్తే అది మరింత దెబ్బగా అనిపిస్తుంది. దీంతో ఎలాగైనా బదులు తీర్చుకోవాలనే ఆలోచనలు కూడా కొన్నిసార్లు వస్తాయి. అయితే, ఇలాంటి సందర్భాల్లో సమస్య తీవ్రతను విశ్లేషించుకొని వారిని క్షమించడం వల్ల బంధాలు నిలుస్తాయి. ముఖ్యంగా అప్పటికప్పుడు వచ్చే ఆవేశాల వల్ల కలిగే గొడవల వల్ల విడిపోవడం లాంటివి జరగకుండా ఉంటాయి. వివాదాలు తలెత్తినప్పుడు ఒకరినొకరు క్షమించుకోవడం వల్ల ఏ బంధమైనా బలంగా కొనసాగుతుంది.
క్షమాగుణం వల్ల మనలో పాజిటివ్ ఫీలింగ్ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గినట్టుగా అనిపిస్తుంది. ప్రతీకారం అనే భారాన్ని మనసులో నుంచి దించేసి హాయిగా ఉన్నట్టు భావన కలుగుతుంది.
శారీరక ఆరోగ్యానికి..
ఎదుటి వారిపై పగ లాంటివి పెంచుకుంటే శరీరంలో ఒత్తిడి, ఆందోళన విపరీతంగా పెరుగుతాయి. ఇది శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. బ్లడ్ ప్రెజర్ పెరిగి.. గుండె ఇది చేటుగా మారుతుంది. ఒత్తిడి అనేది చాలా అవయవాలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. జీవనశైలిలో కూడా మార్పులు రావొచ్చు. అందుకే వీలైనంత మేర ఎదుటి వారిని క్షమించేస్తే ఆరోగ్యానికి కూడా మంచిది.