Alcohol in Winter: చలికాలంలో వెచ్చదనం కోసం మందు తెగ తాగేస్తున్నారా? ఈ నిజం తెలుసుకోండి-are you drinking alcohol for warmth in winter know these things ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Alcohol In Winter: చలికాలంలో వెచ్చదనం కోసం మందు తెగ తాగేస్తున్నారా? ఈ నిజం తెలుసుకోండి

Alcohol in Winter: చలికాలంలో వెచ్చదనం కోసం మందు తెగ తాగేస్తున్నారా? ఈ నిజం తెలుసుకోండి

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 03, 2024 08:31 AM IST

Alcohol in Winter: చలికాలంలో కొందరు ఆల్కహాల్ ఎక్కువగా తాగుతుంటారు. శరీరంలో వెచ్చదనం కోసమని ఎక్కువగా సేవిస్తుంటారు. అలాంటి వారు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో ఇక్కడ చూడండి.

Alcohol in Winter: చలికాలంలో వెచ్చదనం కోసం మందు తెగ తాగేస్తున్నారా? ఈ నిజం తెలుసుకోండి (Photo: Pexels)
Alcohol in Winter: చలికాలంలో వెచ్చదనం కోసం మందు తెగ తాగేస్తున్నారా? ఈ నిజం తెలుసుకోండి (Photo: Pexels)

శీతాకాలంలో చల్లటి వాతావణం నుంచి ఉపశమనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు చలికాలంలో వెచ్చదనం కోసం అంటూ మందు (ఆల్కహాల్) ఎక్కువగా తాగుతుంటారు. సాధారణంగా తీసుకునే దాని కంటే ఈ కాలంలో అతిగా సేవిస్తుంటారు. వెచ్చదనం కోసం ఇదే మార్గం అని ఆలోచిస్తారు. అయితే, చలికాలంలో మందు ఎక్కువగా తాగే వారు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. దాని ప్రభావం ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి.

వెచ్చదనం చాలా తక్కువ సేపే..

చలికాలంలో శరీరాన్ని వెచ్చగా చేస్తుందని, చల్లటి వాతావరణంలో ఉపశమనంగా ఉంటుందని కొందరు మందు తాగేస్తుంటారు. అయితే, శరీరానికి ఆల్కహాల్ చాలా తక్కువ సమయం వరకే కాస్త వెచ్చగా ఉంచగలదు. ఈ ఎఫెక్ట్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. తాగిన కాసేపు శరీరం వెచ్చగా ఉన్నట్టు ఫీల్ అవుతుంది. ఆల్కహాల్ వల్ల రక్తనాళాల్లో వచ్చే కదలికల వల్లే చర్మానికి ఆ మాత్రం హీట్‍గా ఉంటుంది. అయితే, కాసేపటికే బాడీ చాలా చల్లబడిపోతుంది. శరీరంలో వేడి తగ్గిపోయేలా ఆల్కహాల్ చేస్తుంది. బాడీ వణుకు వచ్చేలా చేస్తుంది. అందుకే శరీర వెచ్చదనం కోసం ఆల్కహాల్ పెద్దగా ఉపయోగపడదు. వెచ్చదనం కోసమైతే దీని బదులు హెర్బల్ టీలు చాలా మేలు.

అలవాటు తీవ్రమయ్యే ప్రమాదం

వెచ్చదనం కోసం చలికాలంలో మందు ఎక్కువగా తాగితే.. ఇది కొనసాగే రిస్క్ ఉంటుంది. ఆ తర్వాత కూడా అదే రేంజ్‍లో అతిగా తాగే అలవాటు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే చలికాలంలో ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి. లేకపోతే మద్యానికి బానిసయ్యే రిస్క్ ఉంటుంది.

ఆరోగ్యానికి చాలా చేటు

అతిగా మద్యం తాగితే ఆరోగ్యానికి అనేక రకాలుగా చేటు జరుగుతుంది. సుదీర్ఘ కాలిక వ్యాధుల రిస్క్ పెరుగుతుంది. చాలా విధాలుగా ఆరోగ్యానికి దెబ్బపడుతుంది.

క్యాన్సర్ ప్రమాదం: ఆల్కహాల్‍లోని ప్రమాదకరమైన పదార్థాలు ఆరోగ్యానికి తీవ్రంగా దెబ్బ తీస్తాయి. ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారికి చాలా రకాల క్యాన్సర్ల రిస్క్ పెరుగుతుంది. పేగు, ఛాతి సహా మరిన్ని క్యాన్సర్ల ప్రమాదం ఎక్కువవుతుంది.

కాలేయానికి దెబ్బ: మద్యం ఎక్కువగా సేవిస్తే కాలేయం పనితీరు ఘోరంగా దెబ్బ తింటుంది. ఫ్యాటీ లివర్, స్టియాటోసిస్ సహా అనేక రకాల సమస్యలు వస్తాయి. లివర్ డ్యామేజ్ అవుతుంది. దీంతో ఓవరాల్ ఆరోగ్యం పాడవుతుంది.

రోగ నిరోధక శక్తి డౌన్: మద్యం ఎక్కువగా తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. తరచూ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. చలికాలంలో ఈ రిస్క్ మరింత అధికం.

మరిన్ని దుష్ప్రభావాలు: మద్యం ఎక్కువగా తాగితే ప్యాంక్రియాస్ దెబ్బ తింటుంది. గుండె, మెదడుపై తీవ్రమైన దుష్ప్రభావం పడుతుంది. బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. బరువు అధికమయ్యే అవకాశం ఉంటుంది. మందు తాగితే ప్రవర్తన మారిపోతుంది. మానసిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి అన్ని రకాలుగా చేటు జరుగుతుంది. అందుకే ఒకవేళ తీసుకున్నా ఎప్పుడో ఒకసారి అది కూడా డాక్టర్ల సూచన తీసుకొని పరిమిత మేర ఆల్కహాల్ తీసుకోవాలి. అసలు తాగకుండా పూర్తిగా మద్యం మానేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.

Whats_app_banner