Ajay Arasada: డైరెక్టర్సే నాకు గురువులు.. ఓటీటీ సిరీస్ వికటకవి మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ కామెంట్స్
Music Director Ajay Arasada Comments On Directors: వికటకవి ఓటీటీ వెబ్ సిరీస్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. డైరెక్టర్సే తనకు గురువులు అని, వాళ్లకు కావాల్సింది ఇవ్వడమే తన మొదటి ప్రయారిటీ అని సంగీత దర్శకుడు అజయ్ అరసాడా అన్నారు.
Music Director Ajay Arasada About Directors: "మా ఇంట్లో అత్త, అక్కలు వీణ వాయిస్తూ ఉండేవారు. అది చిన్నప్పటి నుంచి గమనించేవాడిని. అలా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అలా నిశితంగా గమనించటంతోనే సంగీతాన్ని నేర్చుకుంటూ వచ్చాను" అని చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ.
జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్
అజయ్ అరసాడ సంగీతం అందించిన పీరియాడిక్ వెబ్ సిరీస్ వికటకవి నవంబర్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే, ఆయన ఆయ్ వంటి సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించారు. ఇక వికటకవి ఓటీటీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ సందర్భంగా స్పెషల్ చిట్ చాట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.
ఆయ్ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?
- నేను సంగీతాన్నందించిన మిస్సింగ్ మూవీలో ఓ బీజీఎమ్ బిట్ విన్న నిర్మాత బన్నీవాస్‌గారికి అది బాగా నచ్చింది. ఆయన ఆ సినిమాకు సంబంధించి ఓ ఈవెంట్‌కు వచ్చినప్పుడు ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తప్పకుండా కలిసి పని చేద్దామని ఆ సందర్భంలో బన్నీవాస్‌గారు చెప్పారు. అన్నట్లుగానే ఆయ్ సినిమాకు వర్క్ చేసే అవకాశాన్ని కల్పించారు.
- అయితే ముందుగా అమ్మలాలో రామ్ భజన సాంగ్‌తో పాటు ఓ ఐటమ్ సాంగ్‌కు సంగీతాన్ని ఇవ్వమని బన్నీవాస్ గారు చెప్పారు. నేను కూడా ఆ రెండు పాటలు కంపోజ్ చేసిచ్చాను. వారికి అవి బాగా నచ్చేశాయి. దాంతో మిగిలిన పాటలతో పాటు బీజీఎమ్ వర్క్ కూడా చేయమని అన్నారు. అలా ఆయ్ సినిమాకు వర్క్ చేశాను. ఆయ్ వంటి కామెడీ మూవీకి బీజీఎమ్ చేయటం మామూలు విషయం కాదు. అయితే సినిమా హిట్ అయినప్పుడు పడ్డ కష్టమంతా మరచిపోయాను.
పీరియాడిక్ సిరీస్ వికటకవి వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ?
- డైరెక్టర్ ప్రదీప్ మద్దాలికి ఏం కావాలనే దానిపై పక్కా క్లారిటీ ఉంది. అందువల్ల నేను వికటకవి సిరీస్‌కు వర్క్ చేసేటప్పుడు ఎక్కువగా కష్టపడలేదు. డైరెక్టర్సే నాకు గురువులు. అందువల్ల డైరెక్టర్ ప్రదీప్ మద్దాలికి కావాల్సిన ఔట్‌పుట్ ఇస్తూ వెళ్లానంతే. ఆయ్ సినిమాకు వర్క్ చేసేటప్పుడే వికటకవి సిరీస్‌లో మూడు ఎపిసోడ్స్‌కు మ్యూజిక్ చేశాను.
- ఆయ్ రిలీజ్ తర్వాత మరో మూడు ఎపిసోడ్స్‌ను కంప్లీట్ చేశాను. వికటకవికి వర్క్ చేయటం ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. నేను డైరెక్టర్స్ టెక్నిషియన్.. వాళ్లకి కావాల్సిన ఔట్‌పుట్ ఇవ్వటమే నా ప్రయారిటీ.. అది ఏ జోనర్ సినిమా అయినా, సిరీస్ అయినా మ్యూజిక్ చేయటానికి సిద్ధమే.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్?
- ప్రస్తుతం త్రీ రోజెస్ సీజన్ 2తో పాటు ఆహా ఓటీటీలో మరో రెండు వెబ్ సిరీస్‌లకు వర్క్ చేస్తున్నాను. కొన్ని సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వాటి వివరాలను తెలియజేస్తాను.