Kakinada Port Rice : కాకినాడ పోర్టులో మళ్లీ బియ్యం కలకలం, కస్టమ్స్ కు పట్టుబడ్డ 142 కంటైనర్లు
Kakinada Port Rice : "సీజ్ ద షిప్" ఫలించేటట్లు కనిపించటం లేదు. మళ్లీ కాకినాడ పోర్టులో 142 కంటైనర్లలో తరలిస్తున్న బియ్యాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీంతో కాకినాడ డీప్ వాటర్ పోర్టులో మరోసారి రైస్ అక్రమ రవాణా వెలుగు చూసింది.
Kakinada Port Rice : "సీజ్ ద షిప్" అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు రాష్ట్రంలో ప్రాచుర్యం లభించింది కానీ, ఆచరణలో మాత్రం షిప్ సీజ్ కాలేదు. బియ్యం అక్రమ రవాణా ఆగలేదని స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే ఆదివారం కాకినాడ పోర్టులో దాదాపు 142 కంటైనర్లతో తరలిస్తున్న బియ్యాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సమాచారం అందుకున్న కాకినాడ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఇతర అధికారులు కంటైనర్లను పరిశీలించేందుకు కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లోని కేఎస్పీఎల్ కంటైనర్ యార్డ్‌కి వెళ్లారు. ఆయా కంటైనర్లలోని బియ్యం శాంపిల్స్‌ను తీసుకుని, అవి రేషన్ బియ్యమా? లేక మామూలు బియ్యమా? తనిఖీ చేసేందుకు ల్యాబ్‌కు పంపించారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడం జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు కారణం లేకపోలేదు. జనసేన అధినేత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాకినాడ వచ్చినప్పుడల్లా అప్పటి స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఉద్దేశించి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని విమర్శలు చేసేవారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం వ్యవహారాన్ని బయటపెడతామని హెచ్చరించేవారు. అనుకున్న విధంగానే అధికారంలోకి వచ్చిన తరువాత బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సివిల్ సప్లై మంత్రిత్వ శాఖను కూడా జనసేనే తీసుకుంది.
కాకినాడకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ రెండు మూడు పర్యటనలు చేశారు. బియ్యం అక్రమ రవాణాపై ఆరా తీశారు. ఒక సమావేశానికి ఏకంగా తన పార్టీకి చెందిన సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కూడా వెంటబెట్టుకుని తీసుకొచ్చారు. బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు అధికారులకు సూచనలు చేశారు. అయితే ఆ సూచనలు సూచనలుగానే మిగిలిపోయాయి. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఎగుమతి ఆగడం లేదు.
నవంబర్ 27న కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్‌లో 640 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ పోర్టులోకి వెళ్లి పరిశీలించారు. ఆయన అధికారికంగానే 640 టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవంబర్ 29న కాకినాడ వచ్చారు. ఆయనతో పాటు సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కూడా తీసుకొచ్చారు. సౌత్ ఆఫ్రికాకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ పనమా షిప్‌ను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
దీంతో "సీజ్ ద షిప్" అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. అంతేతప్ప ఆ షిప్ మాత్రం సీజ్ కాలేదు. ఆ షిప్‌ను సీజ్ చేయడానికి చాలా సాంకేతిక అంశాలు అడ్డంకిగా ఉన్నాయి. ఆ షిప్‌ను రాష్ట్ర అధికారులు సీజ్ చేయలేరు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే యాంకరేజ్ పోర్టులో ఉన్న షిప్‌ను సీజ్ చేయడం జాతీయ, అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉంది. సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. దీంతో "సీజ్ ద షిప్" కేవలం వ్యాఖ్యలానే మిగిలిపోయింది.
పోనీ పవన్ కళ్యాణ్ పర్యటన తరువాత రేషన్ బియ్యం అక్రమ రవాణా ఏమైనా ఆగిపోయిందా? అంటే అదిలేదు. బియ్యం ఎగుమతి అవుతూనే ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బియ్యం కాకినాడ పోర్టు నుంచే ఎగుమతి అవుతాయి. పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి వచ్చిన బియ్యం కూడా కాకినాడ పోర్టు నుంచే ఎగుమతి అవుతాయి. ప్రధానంగా ఆఫ్రికన్ దేశాలకు ఇక్కడ నుంచి బియ్యం వెళ్తాయి. కనుక బియ్యమైనా, రేషన్ బియ్యమైనా దేశం నలుమూల నుంచి కాకినాడ పోర్టుకు వస్తాయి.
దేశంలో దాదాపు 98 శాతం బియ్యం ఎగుమతి కాకినాడ పోర్టు నుంచే ఎగుమతి అవుతాయి. ఎందుకంటే కాకినాడ పోర్టుకు వ్యవసాయి ఉత్పత్తులను ఎగుమతి చేసే ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలోనే దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు కాకినాడ పోర్టు నుంచే బియ్యం ఎగుమతి చేస్తారు. రాష్ట్రంలో ఒక రోజుకు దాదాపు 1,500 లారీల బియ్యం ఎగుమతి అవుతుంది. కాకినాడ పోర్టులో ఇటీవలి జరిగిన పరిణామాల నేపథ్యంలో గుంటూరు, ఇతర ప్రాంతాల నుంచి బియ్యం చెన్నై పోర్టుకు పంపిస్తున్నారు. అక్కడ నుంచి ఎగుమతి చేసేందుకు వ్యాపారులు సిద్ధపడుతున్నారు.
మరోవైపు ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై ‘సిట్’ ఏర్పాటు చేసింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను సిట్ అధిపతిగా నియమించింది. ఈ బృందంలో సీఐడీ ఎస్పీ బి.ఉమా మహేశ్వర్‌తో పాటు మరో నలుగురు డీఎస్పీలు ఉంటారు. అక్రమ రవాణా చేస్తూ దొరికిన వాహనాలు సీజ్ చేస్తారు. వాహనం డ్రైవర్‌కి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తారు. వ్యాపారం చేసే వారికి పదేళ్ల జైలు శిక్ష, రూ. 1,00,000 జరిమానా విధిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం