Zakir Hussain: ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్.. ఈ తబలా విద్వాంసుడు సాధించిన ఘనతలివే
Zakir Hussain hospitalised: జాకీర్ హుస్సేన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. 12 ఏళ్ల వయసులోనే కచేరీలు ఇచ్చిన జాకీర్ హుస్సేన్.. ప్రస్తుతం అమెరికాలో ఉండగా..?
తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ తీవ్ర అస్వస్థతకు గురై అమెరికాలోని ఓ ఆస్పత్రిలో చేరి.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. హృదయ సంబంధిత అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజుల నుంచి బాధపడుతున్న జాకీర్ హుస్సేన్.. వారం క్రితం తీవ్ర అస్వస్థతకి గురై ఆసుపత్రిలో చేరినట్లు ఆయన స్నేహితుడు ఫ్లాటిస్ట్ రాకేశ్ చౌరాసియా వెల్లడించారు. 73ఏళ్ల ఈ సంగీత విద్వాంసుడుకి రక్తపోటు ఇటీవల పెరిగినట్లు ఆయన స్నేహితుడు తెలిపారు.
ఐసీయూలో చికిత్స
గత వారం రోజులుగా గుండె సంబంధిత సమస్య పెరగడంతో.. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరగా ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు ఫ్లాటిస్ట్ రాకేశ్ వెల్లడించారు. జాకీర్ హుస్సేన్ అరోగ్య పరిస్థితిపై తామంతా ఆందోళనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
ముంబయిలో జననం
జాకీర్ హుస్సేన్ ఇండియాలోనే అత్యంత ప్రసిద్ధ తబలా వాద్యకారుడు. ఆయన పద్మభూషణ్, పద్మశ్రీతో పాటు సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకున్నారు. మార్చి 9, 1951న ముంబైలోని మాహిమ్‌లో తబలా విద్వాంసుడు అల్లా రఖా, బావి బేగం దంపతులకు జన్మించిన జాకీర్ హుస్సేన్‌కు చాలా చిన్న వయసులోనే తబలా వాయించడంపై మక్కువ పెంచుకున్నారు.
3 ఏళ్ల వయసులోనే మృదంగం
కేవలం 3 సంవత్సరాల వయసులోనే తన తండ్రి నుండి మృదంగం వాయించడం నేర్చుకున్న జాకీర్ హుస్సేన్.. 12 సంవత్సరాల వయసులో కచేరీలలో ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించారు. 2024లో జరిగిన 66వ గ్రామీ అవార్డ్స్‌లో ఒకే రాత్రిలో మూడు ట్రోఫీలు గెలిచిన తొలి భారతీయుడిగా జాకీర్ హుస్సేన్ చరిత్ర సృష్టించారు.
టాపిక్