Kakinada House Issue : కాకినాడ జిల్లాలో దారుణం-ఇంటి నిర్మాణంలో ఇరువర్గాలు కత్తులతో దాడి, ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
Kakinada House Issue : కాకినాడ జిల్లాలో ఇరువర్గాల ఘర్షణలో ముగ్గురు మృతి చెందారు. ఇంటి స్థలం విషయంలో తలెత్తిన ఘర్షణ...కత్తులతో దాడికి దారితీసింది. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
Kakinada House Issue : కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి స్థలం విషయంలో చెలరేగిన వివాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. 20 మంది కత్తులు,కర్రలతో ప్రత్యర్థి కుటుంబంపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సామర్లకోట మండలం వేట్లపాలం గ్రామంలో ఆదివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని ఎస్సీపేట చెరువు సమీపంలో కరాదాల పండు ఇల్లు నిర్మించుకుంటున్నారు. అయితే అదే ప్రాంతంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుకు బచ్చల చక్రయ్య కుటుంబం ప్రయత్నించింది. ఈ ఇంటి స్థలం విషయంలో కరాదాల, బచ్చల కుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది.
ఆదివారం ఈ ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో కత్తులు, కర్రలతో ఇరువర్గాలు దాడి చేసుకున్నాయి. దాడిలో కరాదాల ప్రకాశ్‌రావు(50) అక్కడికక్కడే మృతి చెందగా, చంద్రరావు(60), ఏసు అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన బచ్చల చిన్నసుబ్బారావు, కరాదాల పండు, బాబీలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘర్షణ విషయం తెలుసుకున్న సామర్లకోట పోలీసులు...గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఘటనా స్థలంలో కత్తులు, కర్రలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పరిశీలించారు.
పెళ్లికి ఒప్పుకోలేదని బాలిక తండ్రి హత్య
ఏలూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలికపై ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధించాడు. బాలికను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. అందుకు బాలిక తండ్రి నిరాకరించాడు. దీంతో ఆయనపై కక్ష పెట్టుకుని పథకం ప్రకారం బాలిక తండ్రిని హత్య చేశాడు. అనంతరం అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపురం రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏలూరు నగరంలోని రామకృష్ణాపురం రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి 39వ పిల్లర్ ప్రాంతంలో వెంకటకనకరాజు, నాగమణి దంపతులు నివాసం ఉండేవారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కనకరాజు ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాగమణి ఎనిమిదేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది. వీరి పెద్ద కుమార్తె (12)ను ఏలూరు రూరల్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన నాని అనే యువకుడు ప్రేమపేరుతో వేధిస్తున్నాడు.
ఆ బాలికతో పెళ్లి చేయమని కనకరాజును సైతం వేధిస్తూ ఉండేవాడు. అందుకు కనకరాజు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో కనకరాజు, నానికి పలుమార్లు గొడవ కూడా జరిగింది. భార్య మృతి చెందడంతో ముగ్గురు కుమార్తెలను తీసుకుని కనకరాజు ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో ఉంటున్నాడు. తాపీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నారాయణపురం నుంచి కనకరాజు శుక్రవారం రామకృష్ణాపురం ప్రాంతానికి వచ్చాడు. గతంలో తాను నివాసం ఉంటున్న పిల్లర్ నెంబర్ 29 వద్దకు వచ్చి పక్కనే నివాసం ఉంటున్న నాగిరెడ్డి గంగలక్ష్మిని పలకరించాడు. ఈ రోజుకు ఇక్కడే ఉంటానని చెప్పాడు. శుక్రవారం రాత్రి కనకరాజు అక్కడే పడుకున్నాడు.
కనకరాజు ఏలూరు వచ్చిన విషయం తెలుసుకున్న నాని… అక్కడకు వచ్చాడు. కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయమని కనకరాజును నాని అడిగాడు. అందుకు కనకరాజు నిరాకరించాడు. దీంతో మళ్లీ వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో శనివారం తెల్లవారుజామున కనకరాజుపై నాని తనతో తెచ్చుకున్న పదునైన చాకుతో దాడి చేశాడు. గొంతుపై పలుమార్లు పొడవడంతో కనకరాజుకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో నానికి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.