Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేను, ఆ ప్రచారమంతా ఊహాగానాలే-కేంద్ర మంత్రి బండి సంజయ్
Bandi Sanjay : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో తాను లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగిస్తారని వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారమంతా ఊహాగానాలేనని కొట్టిపారేశారు.
Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులోనే తాను లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ నాయకత్వం తనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పెద్ద బాధ్యతలను అప్పగించిందన్నారు. ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు తాను చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నానని చెప్పారు. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగిస్తారని వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారమంతా ఊహాగానాలేనని కొట్టిపారేశారు. పార్టీ నాయకత్వం అసలు రాష్ట్ర అధ్యక్ష పదవిపై దృష్టి సారించనేలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్ష నియామకం విషయంలో బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని, అందరూ దానికి కట్టుబడి ఉండాలని కోరారు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఐజేయూ) కరీంనగర్ జిల్లా ఎన్నికల్లో ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులు కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ కి అభినందనలు తెలిపిన బండి సంజయ్, జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అద్యక్ష పదవి రేసులో ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ బీజేపీలో పోలింగ్ అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్ష నియామకం వరకు సమిష్టి నిర్ణయాల మేరకే జరుగుతాయని తెలిపారు. ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంకా జిల్లా, రాష్ట్ర అధ్యక్ష నియామకాల అంశమే చర్చకు రాలేదు. నాపై అభిమానంతో కొందరు ప్రచారం చేస్తున్నారు. పార్టీ నాయకత్వం నాకు హోంశాఖ సహాయ మంత్రిగా పెద్ద బాధ్యతలు అప్పగించింది. సమర్ధవంతంగా నిర్వర్తించి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నా. అంతే తప్ప నేను రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులోనే లేను. జరుగుతున్న ప్రచారమంతా ఊహగానాలేనని స్పష్టం చేశారు.
కుట్ర పూరితంగా ప్రచారం...
మీడియా ఇలాంటి వార్తలు రాయడంవల్ల కొందరు కావాలనే నాకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు నేను అధ్యక్ష రేసులోనే లేను. హైకమాండ్ ఆ నిర్ణయం కూడా తీసుకోలేదు. దయచేసి మీడియా, సోషల్ మీడియా మిత్రులకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా...ఇలాంటి కథనాలతో పార్టీకి నష్టం జరిగే ప్రమాదముంది. అట్లాగే వ్యక్తిగతంగా నాకు కూడా నష్టం జరిగే అవకాశముంది. దయచేసి ఇకపై అలాంటి కథనాలు రాయొద్దని కోరుతున్నా. రాష్ట్ర అధ్యక్ష నియామకం విషయంలో బీజేపీ హైకమాండ్ తీసుకునే నిర్ణయమే ఫైనల్. ప్రతి ఒక్కరూ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరుతున్నానని తెలిపారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం..
కరీంనగర్ లో సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసి తమ సమస్యలను విన్నవిస్తూ వినతి పత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 19,600 మంది ఉద్యోగులు సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ పద్దతిన దాదాపు 20 ఏళ్లుగా పనిచేస్తున్నారని, కనీస వేతనాలను అమలు చేయడం లేదని వాపోయారు. హెల్త్ కార్డులకు నోచుకోలేదని, ఉద్యోగులు చనిపోతే కనీసం ఆర్దిక సాయం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయడంతోపాటు తమ సమస్యలను పరిష్కరిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్ష హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినా నేటికీ అమలు చేయడం లేదని పేర్కొన్నారు.
సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం తెలిపిన బండి సంజయ్, సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు సహా వివిధ వర్గాల ప్రజలకు గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమలు అమలయ్యేదాకా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. అందుకోసం సంక్రాంతి తరువాత ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని తెలిపారు. సర్వశిక్షా అభియాన్ కార్యక్రమాల అమలు కోసం కేంద్రం 60 శాతం నిధులను ఎప్పటికప్పుడు మంజూరు చేస్తోందని, రాష్ట్రం వాటా విడుదల చేయడం లేదని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లిస్తున్నారని విమర్శించారు.
రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం