Leopard attack : పులి దాడిలో మహిళకు తీవ్ర గాయాలు.. మంత్రి కొండా సురేఖ దిగ్భ్రాంతి
Leopard attack : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను పులులు భయపెడుతున్నాయి. ఇటీవల పులిదాడిలో ఓ మహిళ మృతిచెందింది. తాజాగా చిరుతపులి మరో మహిళపై దాడిచేసి గాయపర్చింది. ఈ ఘటన బజార్‌హత్నూర్ మండలం దేద్రా గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. ఈ ఘటనపై మంత్రి సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం దేద్రా గ్రామంలో శనివారం తెల్లవారుజామున చిరుతపులి దాడిలో ఒక మహిళ గాయపడింది. అడవి సమీపంలో ఉన్న పశువుల కొట్టం దగ్గరికి మహిళ వ్యక్తిగత అవసరాల కోసం వెళ్లింది. ఈ సమయంలో ఒక్కసారిగా చిరుతపులి దాడి చేసింది.
బాధితురాలిని భీమా బాయిగా గుర్తించారు. పులి దాడి చేసిన సమయంలో భీమాబాయి కేకలు వేసింది. వెంటనే స్థానికులు ఆమెను రక్షించారు. అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఆమెను ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అటవీ శాఖ ఆమె చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించింది. ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూనే ఉంది.
పశువులను వేటాడేందుకు చిరుతపులి గ్రామంలోకి ప్రవేశించిందని, కానీ భీమాబాయిని చూసి దాడి చేసిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని అడవుల్లో దాదాపు 13 చిరుతపులులు ఉన్నాయి. ఇవి తరచుగా పశువులను వేటాడుతున్నాయని అంటున్నారు.
ఇటీవల ఈ ప్రాంతంలో పులుల దాడులు దడ పుట్టిస్తున్నాయి. నవంబర్ 29న, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి కోస్తుండగా 21 ఏళ్ల మోర్లే లక్ష్మి అనే మహిళ పులి దాడిలో మరణించింది. మరుసటి రోజు సమీపంలోని గ్రామంలో రౌతు సురేష్ అనే రైతుపై కూడా అదే పులి దాడి చేసింది.
కొండా సురేఖ దిగ్భ్రాంతి..
భీమా బాయిపై చిరుతపులి దాడి ఘటన పట్ల మంత్రి కొండా సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పిసిసిఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్‌తో మాట్లాడారు. సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్‌లోకి చిరుతపులి ప్రవేశించి.. పశువుల కోసం తిరుగుతుందని అటవీ శాఖ అధికారులు మంత్రికి వివరించారు. పశువుల మంద వద్దకు వస్తున్నప్పుడు ఆ మహిళ కదలికలపై భయపడి చిరుత దాడి చేసినట్టు వివరించారు. గాయపడిన మహిళకు రిమ్స్‌లో తక్షణ వైద్య సహాయం అందించామని చెప్పారు.
ఆమె పరిస్థితి మెరుగుపడుతోందని.. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. బాధితురాలికి ఇప్పటికే ఆర్థిక సహాయం అందించినట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మంత్రికి వివరించారు.