Samalkot Dasara Utsavas : సామర్లకోటలో అక్టోబర్ 3 నుంచి 12 వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు-10 రోజుల్లో 11 అలంకరణలు
Samalkot Dasara Utsavas : సామర్లకోట పంచారామ క్షేత్రంలో అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు బాలా త్రిపుర సుందరీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. 10 రోజులు పాటు అమ్మవారికి 11 అలంకారాలు చేయనున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Samalkot Dasara Utsavas : కాకినాడ జిల్లా సామర్లకోట పంచారామ క్షేత్రంలో అక్టోబర్ 3 (గురువారం) నుంచి అక్టోబర్ 12 (శనివారం) వరకు బాలా త్రిపుర సుందరీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 10 రోజుల పాటు అమ్మవారిని 11 రకాలుగా అలంకరిస్తారు. వేలాది మంది భక్తులు ఆయా రోజుల్లో అమ్మవారిని దర్శించుకుంటారు.
పంచారామ క్షేత్రాల్లో ఒకటైనా సామర్ల కోట పంచారామ క్షేత్రంలో శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి సమేత శ్రీ చాళుక్య కుమారాదామ భీమేశ్వరస్వామి వారి దేవస్థానంలో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా అక్టోబర్ 3న ఉదయం 8.25 గంటలకు విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనము ఆచార్యులు, రక్షాబంధనము, కలశస్థాపన జరుగుతుంది. ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి దుర్గాసప్తశతి పారాయణ, బాలా పరమేశ్వరీ మంత్రజపం నిర్వహిస్తారు.
ఈ పూజల్లో పాల్గొనే భక్తులకు ఫీజు రూ.500 ఉంటుంది. అలాగే పూజా సామాగ్రి కూడా భక్తులే తీసుకెళ్లాల్సి ఉంటుంది. శరన్నవరాత్రి సందర్భంగా రూ.200 చెల్లించిన వారికి గోత్రనామాలతో ప్రతిరోజూ సాయంత్రం కుంకుమార్చన చేస్తారు. కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, సామర్లకోట మున్సిపల్ ఛైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి పాల్గొంటారు.
అమ్మవారికి ఏ రోజు...ఏ అలంకరణ
- అక్టోబర్ 3 (గురువారం)- బాలా త్రిపురసుందరీ అలంకారం,
- అక్టోబర్ 4 (శుక్రవారం)- అన్నపూర్ణ అలంకారం,
- అక్టోబర్ 5 (శనివారం)- గాయత్రీదేవి అలంకారం
- అక్టోబర్ 6 (ఆదివారం) - లలితాదేవి అలంకారం
- అక్టోబర్ 7 (సోమవారం)- కామక్షీ అలంకారం
- అక్టోబర్ 8 (మంగళవారం)- మహలక్ష్మీ అలంకారం
- అక్టోబర్ 9 (బుధవారం) - సరస్వతి అలంకారం
- అక్టోబర్ 10 (గురువారం) - విజయదుర్గ అలంకారం
- అక్టోబర్ 11 (శుక్రవారం) - మహిషాసురమర్దని అలంకారం
- అక్టోబర్ 12 (శనివారం) - రాజరాజేశ్వరి అలంకారం
ఆయా రోజుల్లో అమ్మవారు ఆయా అలంకరణలోనే భక్తులకు కనిపిస్తారు. అలాగే అక్టోబర్ 12 (శనివారం) సాయంత్రం 4 గంటలకు వెండి చీర అలంకారం చేస్తారు. మధ్యాహ్నం 2.45 గంటలకు శమీపూజ అనంతరం గ్రామోత్సవం నిర్వహిస్తారు. అలాగే స్వామివారి నిత్యాభిషేకం పథకం శాశ్వత పూజలకు భక్తులు రూ.2,116లు చెల్లిస్తే, దానిపై వచ్చిన వడ్డీతో ఏడాదికి ఒకసారి భక్తులు కోరిన రోజున స్వామివారికి అభిషేకం జరుపుతారు.
స్వామివారి దేవస్థానంలో రూ.400 చెల్లించిన వారి పేరు మీద రెండు కేజీల పులిహోర ప్రసాదం పంచిపెడతారు. కార్తీకమాసం నెల రోజులు సామూహిక అభిషేకంలో గోత్రనామములకు రూ.500 చెల్లించాలిన వారి పేరున గోత్రనామములు చదువుతారు. వసంత నవరాత్రులు 9 రోజులు, దేవి నవరాత్రులు 9 రోజులు రూ.200 చెల్లించిన వారి పేరున 9 రోజులు గోత్రనామములు చదువుతారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం