Shaitan Collection: హారర్ సినిమాల్లో నంబర్ వన్ - ఫస్ట్ డే కుమ్మేసిన అజయ్ దేవ్‌గణ్, మాధవన్ సైతాన్ మూవీ
Shaitan Collection: అజయ్ దేవ్‌గణ్ హీరోగా మాధవన్ విలన్‌గా నటించిన సైతాన్ మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద కుమ్మేసింది. బాలీవుడ్ సినీ చరిత్రలో తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హారర్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.
Shaitan Collection: అజయ్ దేవ్‌గణ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన సైతాన్ మూవీ తొలిరోజే బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. బాలీవుడ్‌లో సినీ చరిత్రలో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన హారర్ సినిమాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. తొలి రోజు వరల్డ్ వైడ్‌గా సైతాన్ మూవీ 14.50 కోట్ల వసూళ్లను రాబట్టింది.
గతంలో బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హారర్ మూవీగా రాజ్ 3 పేరిట రికార్డ్ ఉంది. ఇమ్రాన్ హష్మీ, బిపాసబసు హీరోహీరోయిన్లుగా 2012లో రిలీజైన ఈ మూవీ 10.33 కోట్ల వసూళ్లను రాబట్టింది. 12 ఏళ్ల రికార్డును సైతాన్ బద్దలు కొట్టింది. శని, ఆదివారాల్లో సైతాన్ భారీగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. ఫస్ట్ వీకెండ్‌లోనే యాభై కోట్ల కలెక్షన్స్ దాటుతుందని అంటున్నారు.
గుజరాతీ రీమేక్...
సూపర్ నాచురల్ హారర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి వికాస్ భల్ దర్శకత్వం వహించాడు. అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో మాధవన్ విలన్‌గా కనిపించాడు. సూపర్ నాచురల్ పవర్స్ కలిగిన వ్యక్తిగా నెగెటివ్ షేడ్స్‌లో మాధవన్ తన విలనిజంతో ఆడియెన్స్‌ను భయపెట్టాడు.
అజయ్ దేవగణ్, జ్యోతిక నటనతో ట్విస్టులు, హారర్ ఎలిమెంట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ భార్యగా జ్యోతిక నటించింది. సైతాన్ మూవీతో దాదాపు 25 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది జ్యోతిక. గుజరాతీ భాషలో తెరకెక్కిన వశ్ మూవీ సైతాన్ మూవీ రూపొందింది.
సైతాన్ కథ ఇదే....
కబీర్ (అజయ్ దేవ్‌గణ్), జ్యోతి(జ్యోతిక) తమ కూతురు జాన్వీతో కలిసి ఓ విలేజ్‌కు హాలీడే ట్రిప్ కోసం వెళతారు. ఓ ఆప్తుడిగా కబీర్‌కు పరిచయం అవుతాడు వన్‌రాజ్ (మాధవన్). అతడి ఎంట్రీతో కబీర్ ఫ్యామిలీ కష్టాల్లో పడుతుంది. తన మాయలు, మంత్రాలతో కబీర్ ఫ్యామిలీని వన్‌రాజ్ ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు?
వన్‌రాజ్ బారి నుంచి తన కుటుంబాన్ని కబీర్ ఎలా కాపాడుకున్నాడన్నదే ఈ మూవీ కథ. హీరోగా నటిస్తూనే ఈ సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరించారు అజయ్ దేవ్‌గణ్.అజయ్ దేవ్‌గణ్ సైతాన్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే భారీ మొత్తానికి ఓటీటీ హక్కులు అమ్ముడుపోయినట్లు చెబుతోన్నారు.
25 కోట్ల రెమ్యునరేషన్...
సైతాన్ సినిమా కోసం అజయ్ దేవగణ్ 25 కోట్ల రెమ్యునరేషన్‌ను స్వీకరించినట్లు సమాచారం. విలన్ పాత్ర కోసం మాధవన్ 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు చెబుతోన్నారు. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన జ్యోతిక ఐదు కోట్ల రెమ్యునరేషన్ స్వీకరించినట్లు తెలిసింది.సైతాన్‌తో బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన జ్యోతిక ప్రస్తుతం హిందీలో శ్రీ, డబ్బా కార్టెల్ సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సైతాన్ తర్వాత మైదాన్...
సైతాన్ తర్వాత మైదాన్‌తో అజయ్ దేవ్‌గణ్ బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఫుట్‌బాల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 11న రిలీజ్ అవుతోంది. సింగం అగైన్, రైడ్ 2తో పాటు మరో రెండు సినిమాల్లో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తున్నాడు.