Ashwin Duck Out: వందో టెస్టులో అశ్విన్ డకౌట్.. ఈ చెత్త రికార్డు మూటగట్టుకున్న క్రికెటర్లు వీళ్లే
Ashwin Duck Out: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన 100వ టెస్టులో డకౌటయ్యాడు. అయితే గతంలో ఇలా తాము ఆడుతున్న వందో టెస్టుల్లో డకౌటైన క్రికెటర్లు చాలా మందే ఉన్నారు.
Ashwin Duck Out: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాను ఆడుతున్న 100వ టెస్టులో డకౌట్ అయిన చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇంగ్లండ్ తో ధర్మశాలలో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ ఒక్క పరుగు కూడా చేయలేదు. అయితే అశ్విన్ లాగే గతంలో ఇలా తాము ఆడుతున్న మైల్ స్టోన్ 100వ టెస్టులో పలువురు ఇతర క్రికెటర్లు కూడా డకౌటయ్యారు.
అశ్విన్ డకౌట్ రికార్డు
రవిచంద్రన్ అశ్విన్ తన 100వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో బౌలింగ్ లో 4 వికెట్లతో రాణించాడు. అయితే బ్యాటింగ్ లో మాత్రం నిరాశ పరిచాడు. అశ్విన్ 5 బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ కు చేరాడు. మామూలుగా అయితే అతని డకౌట్ కు పెద్దగా ప్రాధాన్యత ఉండేదికాదు. కానీ ఇది అతనికి 100వ టెస్టు కావడం గమనార్హం.
ఇంగ్లండ్ యువ స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ బౌలింగ్ లో అశ్విన్ క్లీన్ బౌల్డయ్యాడు. టీమిండియా 8వ వికెట్ గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో గిల్, రోహిత్ సెంచరీలు.. యశస్వి, పడిక్కల్, సర్ఫరాజ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. అయితే అశ్విన్ మాత్రం డకౌటై నిరాశ పరిచాడు. టీమ్ స్కోరు 428 పరుగుల దగ్గర అశ్విన్ 8వ వికెట్ గా వెనుదిరిగాడు.
అశ్విన్ కంటే ముందు ఏడుగురు
అయితే అశ్విన్ కంటే ముందు టెస్టుల్లో ఈ చెత్త రికార్డు మూటగట్టుకున్న ప్లేయర్స్ ఏడుగురు ఉన్నారు. తమ 100వ టెస్టులో డకౌటైన క్రికెటర్లలో అశ్విన్ ది 8వ స్థానం. అతని కంటే ముందు దిలీప్ వెంగ్‌సర్కార్, అలన్ బోర్డర్, కౌర్ట్నీ వాల్ష్, మార్క్ టేలర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, అలిస్టర్ కుక్, బ్రెండన్ మెకల్లమ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. వీళ్లలో వాల్ష్, అశ్విన్ మాత్రమే బౌలర్లు కాగా.. మిగతా వాళ్లంతా స్పెషలిస్టు బ్యాటర్లే.
37 ఏళ్ల అశ్విన్ ఇండియా తరఫున 100 టెస్టులు ఆడిన 14వ భారత ప్లేయర్ గా నిలిచాడు. అతని కంటే ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లి, ఇషాంత్ శర్మ, హర్భజన్ సింగ్, చెతేశ్వర్ పుజారా, వీరేంద్ర సెహ్వాగ్ ఈ లిస్టులో ఉన్నారు.
ఇండియా తరఫునే కాదు ప్రపంచంలోనే అత్యధికంగా సచిన్ టెండూల్కర్ 200 టెస్టులు ఆడాడు. ఇక అశ్విన్ విషయానికి వస్తే ఇప్పటి వరకూ అతడు మొత్తంగా 511 వికెట్లు తీసుకున్నాడు. 23.83 సగటుతో అతడు ఈ ఘనత సాధించాడు. 100వ టెస్టు తొలి ఇన్నింగ్స్ లోనూ అతడు 4 వికెట్లు తీయడం విశేషం. ఇండియా తరఫున అనిల్ కుంబ్లే (619 వికెట్లు) టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయి అందుకున్న రెండో స్పిన్నర్ గా అశ్విన్ కు పేరుంది. ఈ 500 వికెట్ల మైలురాయిని కూడా ఇంగ్లండ్ తో సిరీస్ లోనే అతడు అందుకున్నాడు.