ISPL T10: రామ్‍చరణ్‍తో కలిసి స్టెప్స్ వేసిన సచిన్‍.. సూర్య, అక్షయ్ కూడా: వీడియో వైరల్-sachin tendulkar ram charan suriya akshay kumar dances for naatu naatu song at ispl t10 inauguration event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ispl T10: రామ్‍చరణ్‍తో కలిసి స్టెప్స్ వేసిన సచిన్‍.. సూర్య, అక్షయ్ కూడా: వీడియో వైరల్

ISPL T10: రామ్‍చరణ్‍తో కలిసి స్టెప్స్ వేసిన సచిన్‍.. సూర్య, అక్షయ్ కూడా: వీడియో వైరల్

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 06, 2024 05:58 PM IST

ISPL T10 - Sachin Tendulkar, Ram Charan: నాటు నాటు పాటకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారిం

ISPL T10: సచిన్‍తో కలిసి స్పెప్స్ వేసిన రామ్‍చరణ్
ISPL T10: సచిన్‍తో కలిసి స్పెప్స్ వేసిన రామ్‍చరణ్

ISPL T10 Inaugural Event: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట మోత మోగుతూనే ఉంది. ఏ ఈవెంట్ అయినా ఈ ఆస్కార్ విన్నింగ్ సాంగ్ హవా కనిపిస్తూనే ఉంది. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హాజరైతే ఇక ఆ ఈవెంట్‍లో ఈ సాంగ్ మస్ట్ అనేలా మారిపోయింది. నేడు (మార్చి 6) ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) టీ10 క్రికెట్ టోర్నీ ప్రారంభ వేడుకలోనూ నాటు నాటు సాంగ్ ప్రత్యేకంగా నిలిచింది. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, రామ్‍చరణ్ ఈ పాటకు కలిసి స్టెప్ వేశారు. ఆ వివరాలివే..

ఐఎస్‍పీఎల్ టోర్నీ ప్రారంభ వేడుక ముంబై నగరం థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో నేడు జరిగింది. ఈ టోర్నీలో రామ్‍చరణ్ సహా కొందరు సినీ స్టార్లకు జట్లు ఉన్నాయి. ఈ ప్రారంభ ఈవెంట్‍కు సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు.

ఈ ఈవెంట్‍లో నాటు నాటు పాటకు సచిన్ టెండూల్కర్, రామ్‍చరణ్, తమిళ స్టార్ సూర్య, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కలిసి స్టెప్స్ వేశారు. ఒకరి చేయి ఒకరు పట్టుకొని డ్యాన్స్ చేశారు. సినీ హీరోలతో సచిన్ కూడా జోష్‍గా కాలు కదిపారు. ఉత్సాహంగా డ్యాన్స్ ఆడారు. ఈ స్టార్లు డ్యాన్స్ చేయడంతో స్టేడియం హోరెత్తిపోయింది.

నాటు నాటు పాటకు సచిన్, రామ్‍చరణ్, సూర్య, అక్షయ్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఐఎస్‍పీఎస్‍లో జట్లు సినీ స్టార్లవే..

ది ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) క్రికెట్ టోర్నీ 10 ఓవర్ల ఫార్మాట్‍లో జరగనుంది. ఈ లీగ్‍లో ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు రామ్‍చరణ్ యజమానిగా ఉన్నారు. మజ్హీ ముంబై జట్టుకు బాలీవుడ్ దిగ్గజ యాక్టర్ అమితాబ్ బచ్చన్, శ్రీనగర్ కే వీర్ టీమ్‍కు అక్షయ్ కుమార్, బెంగళూరు స్ట్రైకర్స్ టీమ్‍కు హృతిక్ రోషన్, చెన్నై సింగమ్స్ టీమ్‍కు తమిళ హీరో సూర్య ఓనర్లుగా ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కలిసి టైగర్స్ ఆఫ్ కోల్‍కతా జట్టును సొంతం చేసుకున్నారు. మొత్తంగా ఈ టోర్నీలో ఆరు జట్లు తలపడుతున్నాయి.

ఐఎస్‍పీఎల్ టోర్నీ నేటి (మార్చి 6) నుంచి మార్చి 15వ తేదీ వరకు జరగనుంది. ముంబైలో థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలోనే మ్యాచ్‍లు అన్నీ జరగనున్నాయి. నేడు మజ్హి ముంబై, శ్రీనగర్ కే వీర్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

చరణ్, సూర్య కౌగిలింత

ఈ ఈవెంట్‍లో రామ్‍చరణ్, సూర్య ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. కౌగిలించుకున్నారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సినిమాల విషయానికి వస్తే.. రామ్‍చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ చేస్తున్నారు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి రామ్‍చరణ్ పుట్టిన రోజైన మార్చి 27న జరగండి పాట రానుందని తెలుస్తోంది. గేమ్ చేంజర్ చిత్రంలో కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవల అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‍తో కలిసి నాటు నాటు పాటకు డ్యాన్స్ వేశారు రామ్‍చరణ్. ఆ వీడియో కూడా వైరల్ అయింది.

Whats_app_banner