Game Changer: రామ్‍చరణ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. గేమ్ చేంజర్ ఫస్ట్ సాంగ్ వచ్చేది ఆరోజే!
Game Changer Jaragandi Song: గేమ్ చేంజర్ సినిమా నుంచి ఎట్టకేలకు ఓ అప్‍డేట్ వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా నుంచి ‘జరగండి’ అనే పాట రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ డేట్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాలివే..
Game Changer Movie: గేమ్ చేంజర్ మూవీ టీమ్‍పై మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ అభిమానులు చాలా గుర్రుగా ఉన్నారు. ఈ చిత్రం నుంచి అప్‍డేట్లు ఇస్తుండకపోవటంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత చరణ్ చేస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా ఇంకా స్పష్టత రాలేదు. గతేడాది దీపావళికే జరగండి పాట తీసుకొస్తామని చెప్పిన మూవీ టీమ్.. దాన్ని కూడా వాయిదా వేసింది. దీంతో చెర్రీ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయితే, ఎట్టకేలకు గేమ్ చేంజర్ సినిమా నుంచి జరగండి పాటను రిలీజ్ చేసేందుకు డేట్ ఖరారు చేసినట్టు సమాచారం బయటికి వచ్చింది.
రామ్‍చరణ్ పుట్టిన రోజునే!
గేమ్ చేంజర్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‍గా ‘జరగండి’ పాటను తీసుకొచ్చేందుకు టీమ్ సిద్ధమైంది. రామ్‍చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27న జరగండి సాంగ్ రిలీజ్ కానుందని సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయంపై మూవీ టీమ్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
మార్చి 27న జరగండి లిరికల్ వీడియో సాంగ్‍తోనే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ గురించి కూడా మూవీ టీమ్ సమాచారం వెల్లడించే అవకాశం ఉంది. కనీసం ఏ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్న అంశాన్నైనా చెప్పే ఛాన్స్ అధికంగా ఉంది. మొత్తంగా, రామ్‍చరణ్ పుట్టిన రోజున అభిమానులకు కానుకగా జరగండి పాట రావడం దాదాపు ఖరారైంది.
గేమ్ చేంజర్ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో జరగండి పాటకు సంబంధించి కొంత ఆడియో సోషల్ మీడియాలో లీకైంది. ఆ పాటపై చెర్రీ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. అయితే, అది ఫైనల్ వెర్షన్ కాదని మూవీ టీమ్ అప్పట్లో క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ పాటను దీపావళికి రిలీజ్ చేస్తామని అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. హడావుడి చేసింది. అయితే, చివరికి దీపావళికి ఈ పాటను తీసుకురాలేదు. అనివార్య కారణాల వల్ల పాటను రిలీజ్ చేయలేకున్నామని వెల్లడించింది.
అయితే, జరగండి పాటకు సింగర్‌ను మార్చడం కారణంగానే దీపావళికి రాలేదని రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఇది జరిగిన నాలుగు నెలలకు ఇప్పుడు జరగండి పాట రానుంది.
గేమ్ చేంజర్ సినిమాలో ఐఏఎస్ అధికారిగా రామ్‍చరణ్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి కథను కార్తీక్ సుబ్బరాజు అందించగా.. శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. 2021లోనే ఈ మూవీ షూటింగ్ మొదలైనా.. ఇప్పటికీ ఇంకా కొనసాగుతోంది. శంకర్.. ఇండియన్ 2 మూవీ కూడా చేస్తుడటంతో గేమ్ చేంజర్ ఆలస్యమైంది. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మూవీ టీమ్ భావిస్తోంది.
గేమ్ చేంజర్ మూవీలో రామ్‍చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అంజలి, ఎస్‍జే సూర్య, జయరాం, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నాజర్, శుభలేఖ సుధాకర్, నవీన్‍చంద్ర, రాజీవ్ కనకాల కీలకపాత్రలు చేస్తున్నారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.