Virat Kohli: ఇక నువ్వు మారవు.. రిటైర్ అయిపో.. విరాట్ కోహ్లిపై మండిపడుతున్న అభిమానులు, మాజీ క్రికెటర్లు
Virat Kohli: విరాట్ కోహ్లి ఇక రిటైర్ అయిపో అంటూ సోషల్ మీడియాలో అభిమానులు, అటు గవాస్కర్ లాంటి మాజీ క్రికెటర్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులోనూ అతడు ఔటైన విధానం ఆగ్రహానికి గురి చేస్తోంది.
Virat Kohli: విరాట్ కోహ్లి తీరు మారలేదు. ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్న బంతిని వేటాడి వికెట్ పారేసుకునే తన బలహీనతను బ్రిస్బేన్ లో జరుగుతున్న మూడో టెస్టులోనూ కొనసాగించాడు. టీమ్ అప్పటికే త్వరగా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఆడాల్సిన కోహ్లి.. ఇలా ఔటవడం అభిమానులు, మాజీ క్రికెటర్లను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. కోహ్లి రిటైరవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తుండటం గమనార్హం.
విరాట్ కోహ్లి.. ఇక నువ్వు మారవా?
ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టులోనూ టీమిండియా కష్టాల్లో పడింది. టాపార్డర్ వైఫల్యం.. కోహ్లి బాధ్యతారాహిత్యమైన షాట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పైచేయి సాధించేలా చేసింది. దీంతో ఎక్స్ లో రిటైర్ (#Retire) అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. విరాట్ కోహ్లితోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైరవ్వాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
మూడో రోజు లంచ్ కు ముందు హేజిల్‌వుడ్ బౌలింగ్ లో ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్న బంతిని వేటాడబోయి విరాట్ కోహ్లి.. వికెట్ కీపర్ కేరీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అతడు ఇలా ఔటవడం ఇదే తొలిసారి కాదు. చాలా రోజులుగా విరాట్ బలహీనత ఇదే. దానిని అతడు అధిగమించకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి టెస్టుల్లో నుంచి రిటైర్ కావాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఈ టెస్టులో అతడు కేవలం 3 పరుగులకే ఔటయ్యాడు.
గవాస్కర్, మంజ్రేకర్ ఆగ్రహం
విరాట్ కోహ్లి ఔటైన తీరుపై అటు మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్ లాంటి వాళ్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్న బంతిని ఆడాల్సిన అవసరం ఏముందంటూ గవాస్కర్ మండిపడ్డాడు. ఈ మ్యాచ్ లో కామెంటరీ చేస్తున్న అతడు.. విరాట్ ఔటవగానే తన అసహనం వ్యక్తం చేశాడు.
"ఆ బంతి నాలుగో స్టంప్ పై పడి ఉంటే అర్థం చేసుకునేవాడిని. కానీ చాలా దూరంగా ఉంది. ఏడో, ఎనిమిదో స్టంప్ దగ్గర పడింది. అసలు దానిని ఆడాల్సిన అవసరం లేదు. అతడు చాలా నిరాశ చెంది ఉంటాడు. కోహ్లి కాస్త ఓపిక పట్టి ఉంటే.. రాహుల్ తో కలిసి అలాగే ఆడుతూ ఉంటేవాడు" అని గవాస్కర్ అన్నాడు. రెండో టెస్టులోనూ కోహ్లి ఇలా ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్న బంతిని ఆడి వికెట్ పారేసుకున్నాడు.
2004లో సచిన్ టెండూల్కర్ ఇలాగే ఇబ్బంది పడుతున్న సమయంలో ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్న బంతిని ఆడకుండా ఎలా తనను తాను నిగ్రహించుకున్నాడో చూసి నేర్చుకోవాలని పలువురు కోహ్లికి సూచిస్తున్నారు. అటు మరో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా కోహ్లి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతని పేరు ప్రస్తావించకుండా టీమ్ లో కొందరు బ్యాటర్లు పదే పదే ఒకే తప్పును రిపీట్ చేస్తున్నారని, ఈ విషయంలో బీసీసీఐ ఆలోచించి బ్యాటింగ్ కోచ్ పాత్రను పరిశీలించాల్సిన అవసరం ఉందని అతడు స్పష్టం చేశాడు.