Pocharam Srinivas: 74ఏళ్ళ వయస్సులో పోచారం శ్రీనివాస్ పోటాపోటీ ప్రచారం
Pocharam Srinivas: 74ఏళ్ల వయసులో పోచారం శ్రీనివాస రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి రోజు 10-12గ్రామాలు చుట్టేస్తున్నారు.
Pocharam Srinivas: బాన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 74 యేండ్ల వయస్సులో సైతం ప్రతిపక్ష అభ్యర్థుల కంటే ఎక్కువ గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
రోజువారి ప్రచారంలో కనీసం 10 నుంచి గరిష్టంగా 12 గ్రామాల్లో ప్రచారం చేపడుతున్నారు. వయోభారం లెక్కచేయకుండా యువకుల మాదిరిగా దూసుకెళ్తున్నారు. ఓ వైపు గ్రామాల్లో, తండాల్లో ప్రచారం చేస్తూనే మరోవైపు చేరికలతో బిజీబిజీగా గడుపుతున్నారు.
10 ఫిబ్రవరి 1949లో జన్మించిన శ్రీనివాసరెడ్డి.. తన రాజకీయ ప్రస్థానం.... కోపరేటివ్ సొసైటీ ఛైర్మన్‌గా ప్రారంభించారు. 1977లో దేశాయిపేట్ పీఎసీఎస్ నుంచి ఛైర్మన్‌గా గెలుపొందారు. టీడీపీ ప్రభుత్వ హయంలో రెండు పర్యాయాలు మంత్రిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014 ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.
మొదటి మంత్రివర్గంలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. కేసీఆర్ ఆయనను లక్ష్మిపుత్రుడుగా అభివర్ణించేవారు. 2018 ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆయనకు స్పీకర్ బాధ్యతలు అప్పగించారు. 2009 నుంచి వరుసగా ఎన్నికల్లో గెలుపొందుతున్నారు.
వయో భారం రీత్యా గత ఎన్నికలే తనకు చివరివని ప్రకటించారు. కానీ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈసారి కూడా బరిలో నిలిచారు. అయితే విపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించే సరికి మెజార్టీ గ్రామాల్లో ప్రచారం పూర్తి చేశారు. సీఎం కేసీఆర్‌తో తొలి విడత ప్రచారంలలోనే బాన్సువాడలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతున్న ప్రచారం రాత్రి 9 గంటల వరకు సాగుతోంది.
రిపోర్టింగ్ : ఎం. భాస్కర్, నిజామాబాద్