AP Aadhaar Camps: ఏపీలో రేపటి నుంచి అంగన్‌వాడీల్లో ఆధార్ క్యాంపులు,రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్లల్లో ఆధార్ లేని చిన్నారులు
AP Aadhaar Camps: ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీల్లో రేపటి నుంచి ఆధార్ నమోదు కోసం ప్రత్యేక క్యాంపులను నిర్వహించ నున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12లక్షల మంది చిన్నారులకు ఆధార్ కార్డులు లేకపోవడాన్ని గుర్తించిన ప్రభుత్వం చిన్నారులకు ఆధార్ కార్డుల జారీకి ప్రత్యేక క్యాంపుల్ని నిర్వహిస్తోంది.
AP Aadhaar Camps: ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో చిన్నారులకు ఆధార్ కార్డులు లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపుల్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో డిసెంబర్ 3, 4 వారాల్లో ఇందుకోసం స్పెషల్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ కార్డులు లేని చిన్నారులు అందరికి నమోదు చేసేందుకు డిసెంబర్ 17 నుంచి రెండు వారాల పాటు ప్రత్యేక క్యాంపుల్ని నిర్వహించాలని నిర్ణయించారు.
ఏపీలో ఆధార్ నమోదు కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపులతో పూర్తి స్థాయి ఫలితాలు రాకపోవడంతో మరికొన్ని రోజుల పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో క్యాంపులను కొనసాగించాలని నిర్ణయించారు. ఈ ఏడాది నవంబర్‌లో నిర్వహించిన క్యాంపుల్లో కొందరి వివరాలను నమోదు చేశారు. ఈ క్యాంపుల తర్వాత కూడా మరో 12లక్షల మందికి ఆధార్ కార్డులు లేవని తెలియడంతో పూర్తి స్థాయిలో ఆధార్ నమోదు పూర్తి చేయాలని నిర్ణయించారు.
రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపుల నిర్వహణ
డిసెంబర్ 17వ తేదీ మంగళవారం నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపుల్ని సచివాలయాల పరిధిలో నిర్వహిస్తారు. డిసెంబర్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మరోసారి అంగన్ వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరిని ఆధార్ పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నవంబర్‌లో నిర్వహించిన క్యాంపుల్లో కేవలం 64,441మందిని మాత్రమే నమోదు చేశారు. ఇంకా దాదాపు 11లక్షల మంది ఆధార్‌కు దూరంగా ఉన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఆధార్ నమోదు క్యాంపుల్ని అంగన్ వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తారు.
ఆధార్ నమోదు క్యాంపుల కోసం ప్రత్యేక క్యాంపుల్ని నిర్వహిస్తున్నందున సిబ్బందికి అదనపు విధుల విషయంలో మినహాయిపు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పుడే పుట్టిన వారి నుంచి ఆరేళ్ల లోపు వయసున్న ప్రతి ఒక్కరిని ఆధార్ నమోదు చేయాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పంచాయితీ సెక్రటరీ గ్రేడ్ 6, డిజిటల్ అసిస్టెంట్లను ఆధార్ క్యాంపులకు కేటాయించాలని సూచించారు.
జిల్లాల వారీగా చూస్తే కర్నూలులో 10694, ప్రకాశంలో 82369, అనంతపురంలో 75287, అల్లూరి సీతారామజు జిల్లాలో 72259, తిరుపతిలో 63,381, ఎస్సీఎస్సార్ నెల్లూరులో 62,847, పల్నాడులో 52,407, తూర్పు గోదావరిలో 49,189, ఏలూరులో 43,524, శ్రీ సత్యసాయిలో 43,355, శ్రీకాకుళంలో 38,321, వైఎస్సార్ జిల్లాలో 38,547, ఎన్టీఆర్ జిల్లాలో 36,577, గుంటూరులో 36,321, నంద్యాలలో 34,660, అనకాపల్లిలో 31,422, కృష్ణాలో 31,421, బాపట్లలో 31,386, అన్నమయ్యలో 28,528, కోనసీమలో 27,452, పార్వతీపురంలో 26,139, చిత్తూరులో 27,859, విజయనగరంలో 25,666, పశ్చిమలో 25,423, విశాఖలో 18,990మంది ఆధార్ కార్డులు లేవని గుర్తించారు.