TDP Mlas Anarchy: చంద్రబాబు చెప్పినా తీరు మార్చుకోని ఎమ్మెల్యేలు, నియోజక వర్గాల్లో అరాచకాలు
TDP Mlas Anarchy: ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నాం, ఐదేళ్లు అడ్డే లేదన్నట్టు కొందరు ప్రజా ప్రతినిధులు వ్యవహార శైలి ఉంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపుల కోసం కాక రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పని చేయాలని సిఎం పదేపదే చెబుతున్నా కొందరిలో మార్పు రావట్లేదు.
TDP Mlas Anarchy: కక్ష సాధింపులకు, గుండాగిరి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టలేదని రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోడానికి ప్రజా ప్రతినిధులు ప్రాధాన్యత ఇవ్వాలని కూటమి బాధ్యులు చెబుతుంటే క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి.
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే విషయంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మంత్రులతో, ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టమైన సూచనలు చేశారు. గతంలో వైసీపీ పాలన తరహాలో దాడులు, దౌర్జన్యాలు ఉండకూడదని ప్రజా ప్రతినిధులకు సూచించారు.
మొదటి కేబినెట్ సమావేశంలోనూ మంత్రులందరికీ అదే మాట మరోసారి చెప్పారు. ఎన్డీఏ కూటమిని ప్రజలు భారీ ఆశలు, అంచనాలతో గెలిపించారని, బాధ్యతా యుతంగా, జాగ్రత్తగా పనిచేయాలని సూచించారు.
గత పాలకుల తప్పులు కళ్లారా చూశామని, ప్రజలు విసిగిపోయారు కాబట్టి మనకు చక్కని తీర్పిచ్చారని చంద్రబాబు పలు మార్లు ప్రస్తావించారు. తాజాగా కలెక్టర్ల సదస్సులో కూడా వైసీపీ హింసాత్మక చర్యల్ని, విధ్వంసక పాలనను గుర్తు చేశారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు సేవకులు మాత్రమేనని పాలకులు కాదని ఎవరి మీద అజమాయిషీ చేయకూడదంటూ చంద్రబాబు పార్టీనేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు.
ఎవరిని తిట్టినా, దురుసుగా మాట్లాడినా, దాడులు చేసినా సోషల్ మీడియా చూస్తూ ఊరుకోదని అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచించారు.కలెక్టర్లను సైతం ప్రజలతో మమేకం కావాలని, వారిని దూషించడం, అసభ్యంగా మాట్లాడటం చేయొద్దని హెచ్చరించారు.
ఏపీలో టీడీపీ గెలుపు వెనుక కార్యకర్తల కష్టంతో పాటు వైసీపీ వైఫల్యాలు, సామాన్యుల్లో గూడుకట్టుకున్న అక్రోశం బలంగా పనిచేశాయి. కానీ, టీడీపీ అధికారంలోకి వచ్చిన నెలన్నరలోనే కొందరు మంత్రులు, నేతల వైఖరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ప్రతి అంశాన్ని చంద్రబాబు, నారా లోకేష్ డీల్ చేసే పరిస్థితులు లేకపోవడంతో నియోజక వర్గాల్లో నేతల తీరుపై విమర్శలు మొదలయ్యాయి.
ఐదేళ్ల పాటు నరకం అనుభవించి అధికారంలోకి వచ్చిన కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కొంతమంది నెలరోజుల్లోనే దాదాగిరి మొదలుపెట్టారు. వైసీపీ నేతలు నడిచిన బాటలోనే నడుస్తున్నారు. వైసీపీ వాళ్లు టీడీపీ వాళ్లను టార్గెట్ చేసి అక్రమాలు, దౌర్జన్యాలకు దిగుతున్నారు.
కొన్ని చోట్ల టీడీపీ నేతలు ఇప్పుడు అవతల ఉన్నది టీడీపీ మనుషులైనా సరే లెక్క చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ మరో పదేళ్లో, పదిహేనేళ్లో అధికారంలో ఉండాలనే అకాంక్ష కూటమి నేతల్లో ఉంది. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఈ తరహా హింసాత్మక వ్యవహారాలు మానుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
ఇవి కొన్ని ఉదాహరణలు..
- ఉత్తరాంధ్రలో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి గెలిచి, కీలకమైన శాఖకు సారథ్యం వహిస్తున్న మహిళా ప్రజాప్రతినిధి అనుచరులు పేట్రెగిపోతున్నారు. ఇటీవల మంత్రి అనుచరులు అన్నవరం హైవేకి దగ్గర్లో ఉన్న ఏ1 రెస్టారెంట్ మేనేజర్‌పై దౌర్జన్యానికి దిగి, ఆయన్ను కొట్టి అక్కడ ఉన్న ఫర్నీచర్ విరగ్గొట్టి అధికార జులుం ప్రదర్శించారు. ఇదంతా సీసీటీవీలో రికార్డు అయింది. రెస్టారెంట్ నిర్వాహకులు కూడా టీడీపీ అభిమానులు కావడంతో ఆ వీడియో మంత్రివద్దకు చేరి అక్కడే ఆగిపోయింది.
- ఉమ్మడి విశాఖలోని కీలక నియోజకవర్గం నుంచి గెలిచిన ప్రస్తుతం శాసనసభలో కీలక స్థానంలో ఉన్న ఎమ్మెల్యే అనుచరులు, సర్పంచులపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాల్లో సదరు నాయకుడికి నేరుగా ప్రమేయం లేకున్నా ఆయన పేరుతో హడావుడి చేస్తున్న వారిని కట్టడి చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఉచిత ఇసుక టీడీపీ ఎన్నికల హామీ కాగా, నియోజక వర్గంలో ఇసుకను తమ గుప్పిట్లో ఉంచుకుని జనాలకు చుక్కలు చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
- విశాఖలో జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యే అక్రమ గ్రావెల్ తవ్వకాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్త రాసిన ఓ పత్రికా విలేఖరిని ఇంటికి పిలిచి వార్నింగ్ ఇవ్వడంతో ఆ పత్రిక రిపోర్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజక వర్గంలో ఉన్న ఫార్మా కంపెనీలతో పెట్టిన మీటింగ్ కి కంపెనీల యజమానులు కాకుండా వారి ప్రతినిధులు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, యజమానులే రావాలంటూ హుకుం జారీ చేసి మీటింగ్ వాయిదా వేశారని ఆరోపణలు వచ్చాయి.
- గుంటూరు జిల్లా నుంచి గెలిచిన మాజీ మంత్రి పాత పంథాలోనే మళ్లీ సాగుతున్నారు. నియోజక వర్గంలో ఉన్న టీడీపీ నేతలకు చెందిన 4 బార్లను దక్కించుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే ఒత్తిళ్లు, హెచ్చరికలను తట్టుకోలేక వారు తమ బార్లను మూసి ఉంచుతున్నట్టు తెలుస్తోంది.
- నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో గ్రానైట్ లారీల నుంచి ఆక్రమ వసూళ్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యేలు చేసిన తరహాలోనే టీడీపీ నేతలు కూడా గ్రానైట్ లారీల నుంచి మామూళ్లు వసూళ్లు చేస్తున్నారు. గతంలో ఉన్న దళారులనే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు.
- పల్నాడు జిల్లాకు చెందిన విద్యా వంతుడైన ఎమ్మెల్యే అనుచరులు రొంపిచర్లలో జూలై 2వ తేదీ రాత్రి 6 గ్రానైట్ లారీలు నిలిపివేసి డబ్బు డిమాండ్ చేశారు. దీంతో మరో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడుకున్న తర్వాత ఆపిన గ్రానైట్ లారీలను విడిచిపెట్టారు.
- ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలో మైనింగ్ జరిగే ప్రాంతాలను ప్రజాప్రతినిధులు కాసులు కురిపిస్తున్నాయి. పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల పేరుతో గ్రానైట్ లారీల నుంచి ఒక్కో లారీకి రూ.38,000 వసూలు చేస్తున్నారు. మాజీ మహిళా మంత్రికి వసూలు చేసిన వ్యక్తులే, ప్రస్తుతం మంత్రికి కూడా ఈ వసూళ్లు చేస్తున్నారు.
- బాపట్ల జిల్లాలో సముద్ర తీర నియోజక వర్గంలో గెలిచిన ఎమ్మెల్యేఆ ప్రాంతంలోని రిసార్ట్ యజమానులతో బేరసారాలు సాగిస్తున్నారు. ఇదే ప్రాంతంలోని కృష‌్ణా జిల్లా సరిహద్దుల్లో ఉన్న గుంటూరు జిల్లా ఎమ్మెల్యే అనుచరులు హద్దు దాటుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ కార్యకర్తలపై దాడులతో పాటు, భూములపై దౌర్జన్యాలు చేస్తున్నారు. బహిరంగంగా కోళ్ల పందేలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
- విజయవాడలో వివాదాస్పద వైఖరితో గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్యే దందా ప్రారంభించారు. ప్రత్యర్థుల ఇళ్ల కూల్చివేతలు, బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే తరపున ఆయన తనయులు రంగంలోకి దిగి సెటిల్మెంట్లు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.