Ranbir Alia Home: రూ.250 కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకున్న సెలబ్రిటీ కపుల్.. అస్సలు టేస్ట్ లేదా అంటూ నెటిజన్ల క్లాస్
Ranbir Alia Home: బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ రూ.250 కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకుంటున్నారు. అయితే ఈ ఇల్లు చూసి మీకు అస్సలు టేస్ట్ లేదంటూ ఇంటర్నెట్ లో అభిమానులు క్లాస్ పీకుతున్నారు.
Ranbir Alia Home: ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.250 కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకుంటే అది ఏ రేంజ్ లో ఉండాలి? కానీ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కట్టుకునే ఇల్లు చూస్తే అసలు అలా అనిపించడం లేదని నెటిజన్లు అంటున్నారు. ముంబైలోని బాంద్రా ఏరియాలో కొన్నేళ్లుగా జరుగుతున్న నిర్మాణం మొత్తానికి పూర్తయింది. ఈ ఇంటి వీడియో బయటకు రాగా.. ఈ ఇంటికి అంత ఖర్చు పెట్టారా అంటూ ప్రశ్నిస్తున్నారు.
అయితే ఈ ఇంటి కోసం రూ.250 కోట్లు పెట్టారా అంటూ ఈ వీడియోలు చూస్తున్న అభిమానులు అంటున్నారు. ఆరు అంతస్తుల ఈ భవనం బయటి నుంచి చూడటానికి చాలా సాధారణంగా అనిపిస్తోంది. రణ్‌బీర్ తాత కృష్ణ రాజ్ కపూర్ పేరునే ఈ బిల్డింగ్ కు పెట్టారు. అయితే ఇంత ఖర్చు పెట్టినా ఆలియా, రణ్‌బీర్ లకు టేస్ట్ లేదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇదేం ఇల్లు అంటున్న ఫ్యాన్స్
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఎంతో ముచ్చటపడి, భారీగా ఖర్చు పెట్టి కట్టుకున్న ఇంటిని చూసిన అభిమానులు షాక్ తింటున్నారు. ఇది మరీ ఆఫీస్ క్యాబిన్స్ లా కనిపిస్తోందని ఒకరు.. ఆర్కిటెక్ట్ మరీ ఇంత చెత్త ఎలివేషన్ ఇచ్చాడేంటని మరొకరు.. ఓ అపార్ట్‌మెంట్ బిల్డింగ్ లా కనిపిస్తుందని ఇంకొకరు కామెంట్స్ చేశారు.
ఇక కొందరైతే ఈ ఇల్లును యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటితో పోలుస్తున్నారు. సడెన్ గా చూసి ఈ ఇల్లు ఎల్విష్ యాదవ్ దేమో అనుకున్నానంటూ కొందరు కామెంట్ చేయడం విశేషం. కొన్నాళ్ల కిందట ఎల్విష్ తాను కొత్తగా కట్టుకున్న ఇంటిని చూపిస్తూ ఓ వీడియో చేశారు. అది కూడా ఇప్పుడు రణ్‌బీర్, ఆలియా కట్టుకున్న ఇంటిలాగే అనిపిస్తోంది.
ముంబైలోనే ఖరీదైన సెలబ్రిటీ ఇల్లు
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఇల్లు ముంబైలోనే అత్యంత ఖరీదైన సెలబ్రిటీ ఇల్లుగా రికార్డు క్రియేట్ చేయడం విశేషం. దీనికోసం ఈ జంట ఏకంగా రూ.250 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటి వరకూ షారుక్ ఖాన్ మన్నత్, అమితాబ్ బచ్చన్ జల్సా ఇళ్ల రికార్డును ఇది బ్రేక్ చేసింది. ప్రస్తుతం వాస్తు అనే ఇంట్లో ఉంటున్న రణ్‌బీర్ ఫ్యామిలీ.. త్వరలోనే ఈ కొత్త ఇంట్లోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.