Pushpa 2 Box Office Collection: బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 రూల్.. 11 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?-pushpa 2 worldwide box office collection day 11 allu arjun film earns rs 1322 cr ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Box Office Collection: బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 రూల్.. 11 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

Pushpa 2 Box Office Collection: బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 రూల్.. 11 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

Galeti Rajendra HT Telugu
Dec 16, 2024 05:06 PM IST

Pushpa 2 Box Office Collection: పుష్ప 2 రూల్ బాక్సాఫీస్ వద్ద 11 రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది. రెండు భాషల్లో వసూళ్లు తగ్గినా.. హిందీలో భారీగా పెరగడంతో సరికొత్త రికార్డులను పుష్ప2 మూవీ నెలకొల్పింది.

బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 జోరు
బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 జోరు (instagram)

బాక్సాఫీస్ వద్ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీ ఆధిపత్యం కొనసాగుతోంది. డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో రిలీజైన పుష్ప 2 మూవీ.. విడుదలైన రోజు నుంచి వరుసగా రికార్డులను బద్ధలుకొడుతూ ఎవరూ ఊహించని కలెక్షన్లని రాబడుతోంది. ఆదివారం (డిసెంబరు 15) కూడా పుష్ప 2 మూవీ రూ.100 కోట్లుపైగా వసూళ్లని రాబట్టడం గమనార్హం.

తెలుగు కంటే హిందీలోనే

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించగా.. ఫహాద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ తదితరులు నటించారు. శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, బెంగాలీ, హిందీ భాషల్లో రిలీజైన పుష్ప మూవీ.. తెలుగులో కంటే హిందీలోనే భారీగా వసూళ్లని రాబడుతోంది.

పుష్ప 2 మూవీ 11 రోజుల్లో రూ.1,322 కోట్లు వసూళ్లు రాబట్టగా.. ఓవరాల్‌గా 61.29% థియేటర్ ఆక్యుపెన్సీతో కొనసాగుతోంది. డిసెంబరులో పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో.. పుష్ప 2 మరింతగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

నార్త్‌లో పుష్ప 2 జోరు

సూరత్‌లో 76.50% ఆక్యుపెన్సీతో పుష్ప 2 ఆధిపత్యం చెలాయిస్తుండగా.. అహ్మదాబాద్, పుణె, జైపూర్‌, ముంబయిలోనూ పుష్ప 2 థియేటర్ ఆక్యూపెన్సీ 70%కి చేరువగా ఉండటం గమనార్హం. ఇప్పటికే వసూళ్లలో ఆర్‌ఆర్‌ఆర్, బాహుబలి-1 రికార్డులను బద్ధలు కొట్టేసిన పుష్ఫ 2 మూవీ.. బాహుబలి -2 , దంగల్ రికార్డులపై కన్నేసింది.

కన్నడ, మలయాళంలో డ్రాప్

2024లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఇప్పటికే రికార్డ్ నెలకొల్పిన పుష్ప 2 మూవీ.. హిందీలో 10 రోజుల్లోనే రూ.507 కోట్లు నెట్ రాబట్టి మూవీగా నిలిచింది. హిందీ, తెలుగు, తమిళంలో పుష్ప 2కి బాగానే వసూళ్లు వస్తున్నా.. కన్నడ, మలయాళంలో మాత్రం రోజురోజుకీ దారుణంగా పడిపోతున్నాయి. మలయాళం హీరో ఫహాద్ ఫాజిల్‌ క్యారెక్టర్‌ను పుష్ప2 లో మరీ సిల్లీగా చూపించడం కూడా మలయాళంలొ వసూళ్లు తగ్గడానికి ఓ కారణంగా కనిపిస్తోంది.

వార్తల్లో నిలిచిన అల్లు అర్జున్

గత వారం హైదరాబాద్‌లో అల్లు అర్జున్ అరెస్ట్.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల ప్రభావం పుష్ప2కి కలిసొచ్చింది. అల్లు అర్జున్ గురించి మరోసారి దేశ వ్యాప్తంగా చర్చ జరగడంతో.. పుష్ప2 మూవీ కలెక్షన్లు పెరిగినట్లు కనిపిస్తోంది. శుక్రవారం అల్లు అర్జున్ అరెస్ట్ అవగా.. శనివారం ఉదయం బెయిల్‌పై విడుదల అయ్యారు. దాంతో శనివారం సెలెబ్రిటీలు చాలా మంది అతడ్ని పరామర్శించారు. ఆ తర్వాత ఆదివారం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు.

Whats_app_banner