TelagaPindi Curry: తెలగపిండి కూర ఇలా వండారంటే దీని ముందు ఏ కూరైనా దిగదుడుపే, రెసిపీ తెలుసుకోండి
TelagaPindi Curry: చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తినాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మేము తెలగపిండి కూర రెసిపీ ఇచ్చాము. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇది మీకు ఎంతో నచ్చుతుంది.
తెలగపిండి కూర తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల వారికి పరిచయం. తెలగపిండిని కొన్ని జిల్లాల్లోనే అధికంగా వాడతారు. నువ్వుల్ని గానుగులో వేసి నూనె తీసాక మిగిలే పిప్పినే తెలగపిండి అంటారు. దీనిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అందుకే తెలగపిండిని కూడా తిరిగి ఆహారంలో వినియోగిస్తారు. తెలగపిండితో కూర వండితే దాని ముందు చికెన్ కూర అయినా తేలిపోవాల్సిందే. ఈ తెలగపిండి కూర రెసిపీ తెలుసుకోండి.
తెలగపిండి కూర రెసిపీకి కావాల్సిన పదార్థాలు
తెలగపిండి - ఒక కప్పు
నూనె - మూడు స్పూన్లు
ఆవాలు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
పచ్చి శనగపప్పు - ఒక స్పూను
ఎండుమిర్చి - నాలుగు
ఉల్లిపాయ తరుగు - గుప్పెడు
వెల్లుల్లి రెబ్బల తరుగు - రెండు స్పూన్లు
పసుపు - అర స్పూను
కారం - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - ఒక కప్పు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
తెలగపిండి కూర రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
2. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి వేయించాలి.
3. ఆ తర్వాత ఎండు మిర్చి, కరివేపాకులు కూడా వేసి వేయించుకోవాలి.
4. అవి వేగాక ఉల్లిపాయల తరుగును వేసి వేయించుకోవాలి.
5. ఉల్లిపాయలు రంగు మారేవరకు వేయించాక వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వేయించాలి.
6. ఆ తర్వాత పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి.
7. ఇప్పుడు ఒక కప్పు నీటిని వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి.
8. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.
9. నీళ్లు సరిపోకపోతే మరికొన్ని వేసుకోవచ్చు.
10. నీళ్లు సలసలా మరుగుతున్నప్పుడు తెలగపిండిని అందులో వేసి ఉండలు కట్టకుండా గరిటతో కలుపుతూ ఉండాలి.
11. ఇలా తెలగపిండిని వేసాక చిన్న మంట మీదే ఉంచి గరిటతో కలుపుతూ ఉండాలి.
12. నీరంతా ఇంకిపోయి దగ్గరగా అయ్యేవరకు అలా ఉంచాలి. మూత పెట్టి కాసేపు ఉడికించాలి.
13. తర్వాత మళ్లీ మూత తీసి కలుపుతూ ఉండాలి. ఈ మొత్తం మీరు ఇంకిపోయి దగ్గరగా అయినప్పుడు కొత్తిమీర తరుగును చల్లుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి.
14. ఇది కొంచెం పొడిపొడిగా వచ్చే వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ తెలగపిండి కూర రెడీ అయినట్టే. దీన్ని ఒక్కసారి తిని చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది. నువ్వుల్లో ఉండే పోషకాలు కూడా తెలగపిండిలో ఉంటాయి.
తెలగపిండి ఉపయోగాలు
తెలగపిండిలో ఉన్న పోషకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇది అచ్చుల రూపంలో బయట దొరుకుతుంది. నువ్వులను గానుగులో వేసి గట్టిగా నొక్కి నూనెను తీస్తారు. ఆ మిగతా పొట్టు తెలగపిండిగా మారిపోతుంది. ఇది చూడడానికి నలుపుగా ఉంటుంది. అదే తెల్లని నువ్వుల నుంచి తీసినట్లైతే కాస్త తెలుపు రంగులో ఉంటుంది. దీన్ని వడియాలుగానో, కూరగానో, నువ్వుల పొడిగాను మార్చుకుంటారు. పశువుల దాణా కోసం కూడా ఉపయోగిస్తారు. తెలగపిండిని ఎంత తింటే అంత మంచిది. బాలింతలకు పాలు అధికంగా ఉత్పత్తి కావాలంటే తెలగపిండిని తినిపిస్తారు. ఇప్పటికీ గ్రామాల్లో అనేక చోట్ల తెలగపిండిని వినియోగిస్తూనే ఉన్నారు. తెలగపిండి వడియాలు ఎంతో ఫేమస్. ఆస్తమా రోగులకు తెలగపిండి ఎంతో మంచిది. బలాన్ని, శరీరానికి పుష్టిని కలిగిస్తుంది. వీలైనంతవరకు తెలగపిండిని ఆహారంలో భాగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మేము చెప్పిన తెలగపిండి కూరను ఎవరైనా ఒక్కసారి వండుకొని చూడండి మీకు కచ్చితంగా నచ్చుతుంది.
టాపిక్