Punugulu: రేషన్ బియ్యంతో అప్పటికప్పుడు క్రిస్పీగా ఇలా పునుగులు చేసేయండి, రుచి అదిరిపోతుంది-crispy punugulu with ration rice know the recipe in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Punugulu: రేషన్ బియ్యంతో అప్పటికప్పుడు క్రిస్పీగా ఇలా పునుగులు చేసేయండి, రుచి అదిరిపోతుంది

Punugulu: రేషన్ బియ్యంతో అప్పటికప్పుడు క్రిస్పీగా ఇలా పునుగులు చేసేయండి, రుచి అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Dec 16, 2024 03:30 PM IST

Punugulu: సాయంత్రం పూట వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తోందా? అయితే పునుగులు ట్రై చేయండి. అది కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. రేషన్ బియ్యంతో పునుగుల రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

పునుగులు రెసిపీ
పునుగులు రెసిపీ (Youtube)

రేషన్ బియ్యం కాస్త మందంగా ఉంటాయి. అందుకే ఎక్కువ మంది వాటిని వండుకొని తినేందుకు ఇష్టపడరు. వాటిని బయట వారికి ఇచ్చేస్తూ ఉంటారు. అలా ఇవ్వాల్సిన అవసరం లేకుండా రేషన్ బియ్యంతోనే అప్పటికప్పుడు క్రిస్పీగా పునుగులు తయారు చేసుకోవచ్చు. సాయంత్రం వేళ చలికాలంలో ఏదైనా తినాలనిపిస్తే ఈ పునుగులు ప్రయత్నించండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి.

పునుగులు రెసిపీకి కావలసిన పదార్థాలు

రేషన్ బియ్యం - ఒక కప్పు

వేడి నీళ్లు - రెండు కప్పులు

పచ్చిమిర్చి - రెండు

ఉల్లిపాయలు - ఒకటి

బంగాళదుంపలు - రెండు

అల్లం తరుగు - ఒక స్పూను

కరివేపాకుల తరుగు - రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు

జీలకర్ర - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

వంటసోడా - చిటికెడు

రేషన్ బియ్యంతో పునుగులు రెసిపీ

1. రేషన్ బియ్యాన్ని పరిశుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.

2. మరిగించిన వేడి నీటిని అందులో వేసి ఒక గంట పాటు వదిలేయాలి. గంట తర్వాత అవి బాగా మెత్తగా అయిపోతాయి.

3. ఈ లోపు బంగాళదుంపలను కూడా ఉడికించి రెడీగా పెట్టుకోవాలి.

4. ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యాన్ని, ఉడికించి పొట్టు తీసిన బంగాళదుంప ముక్కలను వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

5. ఆ మొత్తం రుబ్బుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి.

6. ఆ పిండిలోనే సన్నగా తరిగిన అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకులు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి.

7. జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలపాలి.

8. చిటికెడు వంటసోడాను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

9. మరీ గట్టిగా కాకుండా అలా అని పలుచగా కాకుండా పునుగులకు వేయడానికి వీలుగా ఈ పిండిని కలుపుకోవాలి.

10. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేయాలి.

11. ఈ పిండిలోంచి చిన్న చిన్న ముద్దలను తీసి పునుగుల్లా వేసుకొని అన్నివైపులా రంగు మారేవరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.

12. అంతే టేస్టీ పునుగులు రెడీ అయినట్టే.

పునుగులు చేయడానికి బియ్యాన్ని నాలుగు నుంచి ఐదు గంటల పాటు ముందే నానబెడతారు. మేము చేసిన పద్ధతిలో చేస్తే గంటపాటు నానబెడితే సరిపోతుంది. దీనికి ఈ పునుగులను కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీతో తింటే రుచిగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి మీకు కూడా నచ్చుతుంది.

ఎక్కువమంది పునుగులను బయట నుంచి కొని తెచ్చుకోవడానికి ఇష్టపడతారు. దాని బదులు మీరు ఇంట్లోనే చేసుకుంటే ఎక్కువ పునుగులను తినే అవకాశం ఉంటుంది. అలాగే రేషన్ బియ్యంతో చేసే ఈ పునుగులు క్రిస్పీగా కూడా వస్తాయి. రేషన్ బియ్యాన్ని ఎలా వాడాలి అని ఆలోచిస్తున్న వారికి పునుగులు ఇడ్లీ, దోశ వంటివి చేసుకొని తినడం బెటర్. ఆరోగ్యానికి కూడా ఇవి మేలు చేస్తాయి.

Whats_app_banner