Peanut Curd Chutney: ప్రోటీన్ పుష్కలంగా ఉండే వేరుశనగ చట్నీ.. తయారీ విధానం ఇదే.. బరువు తగ్గాలనుకునే వారికి కూడా బెస్ట్
Peanut Curd Chutney: వేరుశనగలు, పెరుగు కలిపి చేసే చట్నీని చపాతీలు, దోశలు, ఇడ్లీ ఇలా చాలా వాటితో తినొచ్చు. ఈ చట్నీలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా తినొచ్చు. ఈ వేరుశనగ పెరుగు చట్నీ ఎలా చేయాలంటే..
వేరుశనగలు, పెరుగులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు కలిపి ఓ రుచికరమైన చట్నీ తయారు చేసుకోవచ్చు. ఈ చట్నీని దోశలు, వడలు, ఇడ్లీ, చపాతీ, పకోడీలు ఇలా చాలా వాటిలో నంచుకోవచ్చు. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు డైట్‍లోనూ దీన్ని తీసుకోవచ్చు. వెయిట్ లాస్‍కు ప్రోటీన్ ఉపయోగపడుతుంది. కొత్తమీర దీనికి మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది. ఈ వేరుశనగ పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
వేరుశనగ పెరుగు చట్నీకి కావాల్సిన పదార్థాలు
- ఓ కప్పు వేయించిన వేరుశనగలు
- ఓ కప్పు పెరుగు
- ఓ గుప్పెడు తరిగిన కొత్తమీర
- ఓ టేబుల్ స్పూన్ అల్లం
- సరిపడా ఉప్పు
- ఓ టీస్పూన్ జీలకర్ర
వేరుశనగ పెరుగు చట్నీ తయారీ విధానం
- ముందుగా పొయ్యిపై ఓ ప్యాన్‍ను పెట్టి దాంట్లో వేరుశనగలను వేపుకోవాలి. కాస్త తక్కువ మంటపై వేపితే లోపలి వరకు బాగా కాలుతాయి. వేపిన తర్వాత చల్లార్చుకొని వేరుశనగల పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి.
- ఆ తర్వాత ఓ మిక్సీ జార్‌లో వేయించుకున్న వేరుశనగలు వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే పెరుగు వేయాలి.
- ఆ జార్‌లోనే తరిగిన మిరపకాయలు, కాస్త దంచిన అల్లం, జీలకర్ర, గుప్పెడు కొత్తమీర, తగినంత ఉప్పు వేయాలి.
- ఆ మొత్తాన్ని మిక్సీపై మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే టెస్టీగా ఉండే వేరుశనగ పెరుగు చట్నీ రెడీ అయిపోతుంది.
ఈ చట్నీకి పోపు లేకున్నా బాగానే ఉంటుంది. ఒకవేళ పోపు కావాలంటే కూడా తయారు చేసుకొని కలపొచ్చు. పోపు కోసం ముందుగా ఓ ప్యాన్‍లో.. ఓ టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనె వేసి, అందులో కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర, ఓ ఎండుమిర్చి, కాస్త కరివేకు వేసి కొన్ని సెకన్లు వేయించుకోవాలి. దాన్ని రెడీ చేసుకున్న పచ్చడిలో కలుపుకోవచ్చు.
బరువు తగ్గేందుకు ప్రోటీన్ ఇలా..
వేరుశనగలు, పెరుగు కలిపి చేసే ఈ చర్నీలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గేందుకు ప్రోటీన్ చాలా ఉపకరిస్తుంది. కడుపు నిండిన సంతృప్తిని ఎక్కువ సేపు ఉంచుతుంది. దీంతో చిటికీమాటికీ ఆహారం తినకుండా నిరోధిస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. దీంతో క్యాలరీలు తీసుకోవడం తగ్గుతుంది. ఇది బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. శరీరంలో జీవక్రియను కూడా ప్రోటీన్ మెరుగుపరుస్తుంది. కండరాలు పెరిగేందుకు కూడా ప్రోటీన్ ఉపసరిస్తుంది. మజిల్ లాస్‍ను నిరోధిస్తుంది.