Polavaram Project : ఏపీ జీవనాడి 'పోలవరం ప్రాజెక్టు' ఆలస్యానికి కారణమేంటి, నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది?-ap major irrigation project polavaram construction underway for decades reasons for delay ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Polavaram Project : ఏపీ జీవనాడి 'పోలవరం ప్రాజెక్టు' ఆలస్యానికి కారణమేంటి, నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది?

Polavaram Project : ఏపీ జీవనాడి 'పోలవరం ప్రాజెక్టు' ఆలస్యానికి కారణమేంటి, నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది?

Bandaru Satyaprasad HT Telugu
Dec 16, 2024 03:04 PM IST

Polavaram Project : 2004లో ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కి సాగుతోంది. ఏపీలో అధికారం చేపట్టిన కూటమి సర్కార్ 2027 నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతోంది. అసలు పోలవరం నిర్మాణం జాప్యానికి కారణాలేంటో తెలుసుకుందాం.

దశాబ్దాలుగా సాగుతోన్న 'పోలవరం ప్రాజెక్టు'-నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది, జాప్యానికి కారణాలేంటి?
దశాబ్దాలుగా సాగుతోన్న 'పోలవరం ప్రాజెక్టు'-నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది, జాప్యానికి కారణాలేంటి?

Polavaram Project : ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు. ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో నిర్మిస్తున్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. మొదట్లో రామపాద సాగర్ గా పిలిచిన ప్రాజెక్టును ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్టు అని పిలుస్తున్నారు.

1941లో ప్రతిపాదనలు

1941లో అప్పటి నీటిపారుదల ఇంజినీర్ ఎల్.వెంకటకృష్ణ అయ్యర్, పోలవరం సమీపంలో గోదావరిపై రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదన చేశారు.

ఈ ప్రతిపాదనలపై ఓ నివేదికను రూపొందించారు. మొదట్లో దీని వ్యయం రూ.129 కోట్లు. 2021 తాజా అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం రూ.55,548.87.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యంగా మూడు భాగాలున్నాయి. రిజర్వాయర్, స్పిల్‌వే, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. ప్రధాన రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు స్పిల్‌వే ఉపయోగపడుతుంది. పోలవరం వద్ద రెండు కొండల మధ్య 48 గేట్లుతో స్పిల్ వే నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయల్ రెండు కాలువలు(కుడి, ఎడమ) ఉంటాయి. ఈ ప్రాజెక్టులో మరో ముఖ్యమైన కట్టడం డయాఫ్రం వాల్. దీనిని గోదావరి నది మధ్యలో దాదాపు 300 అడుగుల లోతులో నిర్మిస్తున్న కాంక్రీటు గోడ. సుమారు 2.454 కిలోమీటర్లు పొడవులో దీనిని నిర్మిస్తున్నారు. డయా ఫ్రమ్ వాల్ కు ఇరువైపులా ఎర్త్ కమ్ రాక్ డ్యామ్ నిర్మిస్తున్నారు.

2004లో ప్రారంభం

పోలవరం ప్రధాన డ్యామ్ నిర్మాణంలో నీరు అడ్డుతగలకుండా తాత్కాలికంగా నిర్మించే కట్టడమే కాఫర్ డ్యాం అంటారు. పోలవరం ప్రాజెక్టులో రెండు కాఫర్ డ్యామ్ లను ప్రతిపాదించారు. ప్రాజెక్టు ఎగువన ఒకటి, ధవళేశ్వరం బ్యారేజీ బ్యాక్ వాటర్ రాకుండా దిగువున మరో కాఫర్ డ్యాం నిర్మించాలని నిర్ణయించారు. 2014 రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. 2013-14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ బడ్జెట్‌ రూ.58,319 కోట్లు. 2017 పోలవరం అంచనాలను ఏపీ సర్కార్ సీడబ్ల్యూసీకి సమర్పించింది.

2004లో ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టును...2014లో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. 2017 జూన్ నాటికి రిజర్వాయర్ లో మట్టిపని 68%, కరకట్ట 9%, కుడికాలవ పనిలో మట్టిపని 100%, లైనింగ్ 81%, ఎడమకాలవ పనిలో మట్టిపని 87%, లైనింగ్ 62% పూర్తి అయ్యాయి. 2021 మే నెల నాటికి 42.5 మీటర్ల ఎత్తులో కాపర్‌ డ్యాం నిర్మాణం పూర్తి చేశారు. స్పిల్‌వే లో 14 గేట్ల ద్వారా నీటి తరలింపునకు ఏర్పాట్లు చేశారు. పెరిగిన వ్యయాలతో పోలవరం వ్యయ అంచనాలు పెంచి, కొత్త ప్రతిపాదనలు ఆమోదం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది.

2027కు పూర్తి చేస్తాం?

2019లో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం...కాంట్రాక్టర్ ను మార్చింది. ఈ ప్రాజెక్టు పూర్తిపై మంత్రులు పలు సందర్భాల్లో భిన్న ప్రకటనలు చేశారు. అయితే 2024లో అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం...2027 నాటికల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించింది. ప్రతి నెలా ఓ సోమవారం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తూ...పనులు పురోగతిపై సమీక్షిస్తున్నారు. 2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కూటమి సర్కార్ అడుగులు వేస్తుంది. డయాఫ్రంవాల్‌ నిర్మాణంతోపాటు ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యాం పనులను వేగంగా పూర్తి చేయడాన్ని మొదటి ప్రాధాన్యంగా పెట్టుకుంది. వరదలతో కుంగిన గైడ్‌బండ్‌ను తిరిగి నిర్మించడానికి ప్రణాళిక చేస్తుంది. స్పిల్‌ ఛానల్‌, ఐకానిక్‌ వంతెన పనులు త్వరలో చేపట్టనున్నారు. గత టీడీపీ పాలనలో 72 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేసినట్లు నేతలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 17, ఇతర జిల్లాల్లోని 54 మండలాల్లో 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు.

పూర్తికాని ఆర్ అండ్ ఆర్

పోలవరం నిర్వాసితులకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 13 ప్రాంతాల్లో కాలనీలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే పోలవరం మండలంలోని 19 గ్రామాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేశారు. వీరికోసం ఒక్క ప్రాంతంలో కూడా పూర్తి సౌకర్యాలతో కాలనీలు ఏర్పాటు కాలేదు. డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం, రోడ్లు, ఆసుపత్రి, పాఠశాల, అంగన్‌వాడీ భవనాలు, ఇతర సౌకర్యాలు లేక నిర్వాసితులు అవస్థలు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పునరావాస కాలనీలు ప్రారంభించిన రూ.210 కోట్ల మేర బిల్లులను బకాయి పడ్డాయి. కూటమి ప్రభుత్వం తాజాగా పాత బకాయిలతో పాటు పునరావాసానికి మరో రూ.502 కోట్లు ప్రకటించింది. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 12 వేల ఎకరాల భూసేకరణ చేశారు. మరో 25 వేల కుటుంబాలను నిర్వాసితులుగా ప్రకటించారు. ఇందులో 41.15 కాంటూరు పరిధిలో 44 గ్రామాలు 10 వేల కుటుంబాలు ఉన్నాయి. పునరావాసం, పరిహారం విషయంలో నేటికీ 10-20 శాతం వరకే పూర్తైందనేది వాస్తవం.

పెరిగిన అంచనా వ్యయం

దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు రెండడుగులు ముందుకి, మూడడుగులు వెనక్కి అన్నట్లు ఉంది. పోలవరం నిర్మాణానికి వైఎస్ఆర్ ప్రభుత్వ హయంలో జలయజ్ఞం పేరిట కొంత కదలిక వచ్చింది. డ్యామ్ పనులతో పాటు కాలువల పనులు కొంతమేర జరిగాయి. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పూర్తి చేసేందుకు ప్రయత్నించినా ఆర్థిక వనరులు ప్రధాన అడ్డంకిగా మారాయి. 2016లో ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యతను తీసుకుంది. దీంతో కేంద్రం మెలికపెట్టింది. 2013 అంచనాల మేరకు మాత్రమే నిధులు సమకూరుస్తామని చెప్పింది. 2013 నాటి అంచనాల మేరకు రూ. 20,338 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని రూ. 55,657 కోట్లుగా ఇటీవల నిర్ణయించారు. దీనికి కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు ఆర్థిక వనరుల సమస్య అడ్డురావడంతో ప్రాజెక్టు ముందుకు సాగడంలేదు. నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్, ప్రాజెక్టు వ్యయం భారీగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కోసం కేంద్రం వైపు చూస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం