Polavaram Height: 45.72 మీటర్ల ఎత్తులోనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం.. ఎత్తుపై రాజీ లేదంటున్న ఏపీ సర్కార్-construction of polavaram project at a height of 45 72 meters ap government says there is no compromise on the height ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Polavaram Height: 45.72 మీటర్ల ఎత్తులోనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం.. ఎత్తుపై రాజీ లేదంటున్న ఏపీ సర్కార్

Polavaram Height: 45.72 మీటర్ల ఎత్తులోనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం.. ఎత్తుపై రాజీ లేదంటున్న ఏపీ సర్కార్

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 31, 2024 08:34 AM IST

Polavaram Height: పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో కూటమి ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని, గతంలో తాము ప్రతిపాదించినట్లుగా 150 అడుగుల మేర నీటి నిల్వ ఉండే విధంగా 45.72 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్టును నిర్మాణం జరుగుతుందని ఏపీ జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

పోలవరం ఫేజ్‌1,  ఫేజ్ 2గా పేర్కొన్న వివరాలు చూపుతున్న మంత్రి నిమ్మల
పోలవరం ఫేజ్‌1, ఫేజ్ 2గా పేర్కొన్న వివరాలు చూపుతున్న మంత్రి నిమ్మల

Polavaram Height: పోలవరం ప్రాజెక్టుకు రెండు ఫేజులు అంటూ పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు కుదించిన ఘనత గత ప్రభుత్వానిదే అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల తప్పుపట్టారు. పోలవరం ప్రాజెక్టును రెండు ఫేజుల్లో నిర్మిస్తామంటూ ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పలు మార్లు ప్రతిపాదనలు పంపిన గత ప్రభుత్వం, ఆ బురదను తమ ప్రభుత్వంపై రుద్దే విధంగా దుష్ప్రచారం చేయడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు.

2022 జనవరిలో పోలవరం ప్రాజెక్టు ఫేజ్-I&II అంటూ 41.15 మీటర్ల ఎత్తున ప్రతిపాదిస్తూ అప్పటి స్పెషల్ సి.ఎస్. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సి.ఇ.ఓ.కు లేఖ రాస్తూ రూ.10,911.15 కోట్ల మేర నిధులు రావాలంటూ అడిగారని చెప్పారు. తర్వాత జలవనరుల శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ, సి.ఇ. తదితరులు కూడా పల మార్లు లేఖలు రాశారని వాటిలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లు అంటూ ప్రత్యేకంగా మెన్షన్ చేశారన్నారు.

2014-19 మద్య కాలంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ పోలవరం ప్రాజెక్టును ఫేజ్-I & II అంటూ ఎప్పుడూ విభజించలేదని, సుప్రీమ్ కోర్టు, గోదావరి ట్రిబ్యునల్ అనుమతించిన మేరకు 150 అడుగుల మేర నీటిని నిల్వ చేసే విధంగా 45.72 మీటర్ల ఎత్తున ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.55,545 కోట్లకు టెక్నికల్ ఎడ్వైజరీ కమిటీ ఆమోదాన్ని కూడా పొందాయన్నారు.

ఎత్తుపై రాజీలేదు.. ఆర్‌ అండ్‌ ఆర్‌ మాత్రం…

కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో ఏమాత్రం రాజీ పడదని, నూటికి నూరు శాతం 45.72 మీటర్ల ఎత్తున ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అయితే గత ప్రభుత్వం ఫేజ్-I లో పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు ప్రతిపాదించిన విధంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ క్రింద నిధులు విడుదల అవుతాయన్నారు. కానీ ఫేజ్-II లో మాత్రం 45.72 మీటర్ల మేర ప్రాజెక్టు ఎత్తుకు అనుగుణంగా రూ.30 వేల కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు అవసరం అవుతాయని ప్రతిపాదించామన్నారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే 2020 లో వచ్చిన వరదల వల్ల డయాప్రమ్ వాల్ దెబ్బతిందని హైదరాబాద్‌ ఐ.ఐ.టి. నిపుణుల బృందం నిర్థారించినట్లు తెలిపారు. 2014-19 మద్య కాలంలో తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికై రూ.11,762 కోట్లు ఖర్చు చేస్తే కేవలం రూ.6,764 కోట్లు మాత్రమే కేంద్రం నుండి రియింబర్స్‌మెంట్‌ రూపేణా వచ్చాయన్నారు.

గత ప్రభుత్వం కేవలం రూ.4,167 కోట్లను మాత్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వెచ్చించిందని, కేంద్రం నుండి రూ.8,382 కోట్లను రీ‍యింబర్స్‌మెంట్‌ రూపేణా నిధులు వస్తే అందులో రూ.3,385 కోట్లను గత ప్రభుత్వం డైవర్టు చేసిందన్నారు. గత ప్రభుత్వం ఫేజ్-I‌లో ప్రతిపాదించిన విధంగా కేంద్రం నుండి రూ.12,250 కోట్ల నిధులు ఈ మద్య అందాయని, గత ప్రభుత్వ హయాంలో అందితే ఈ నిధులను కూడా మ‌ళ్ళించేవారని ఆరోపించారు.

Whats_app_banner