Zakir Hussain: ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మరణానికి కారణం ఈ ఆరోగ్య సమస్యే, రాకుండా ఉండాలంటే ఈ అలవాట్లను మార్చుకోవాలి
Zakir Hussain: ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మరణించారు. అధికారిక సమాచారం ప్రకారం అతను ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ సమస్యతో బాధపడి మరణించినట్టు తెలుస్తోంది. ఈ సమస్య ఏమిటో తెలుసుకోండి.
ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ అకస్మాత్తుగా కన్నుమూశారు. మరణానికి ముందు మూడు వారాల నుంచి ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. ఐసీయూలో ఉంచి చికిత్స చేసినా కూడా ఎలాంటి ఫలితం లేదు. అయితే ఆయన ఊపిరితిత్తుల సమస్యతో మరణించినట్టు అధికారికంగా కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆ సమస్య పేరు ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అని చెప్పారు.
ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ వల్ల జాకీర్ హుస్సేన్ పరిస్థితి విషమించింది. ఈ వ్యాధి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అలాగే కొన్ని అలవాట్ల వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటే ఏమిటి?
ఇదొక ఊపిరితిత్తుల వ్యాధి. ఇందులో ఊపిరితిత్తుల కణజాలంలో ఫైబ్రోసిస్ (గాయం లాంటి మచ్చలు) ఏర్పడుతుంది. దీని వల్ల ఊపిరితిత్తుల గోడ మందంగా మారి ఆక్సిజన్ అందుకోవడంలో సమస్య ఏర్పడుతుంది. క్రమంగా ఆక్సిజన్ తీసుకునే ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుంది. ఈ వ్యాధికి ఇంకా చికిత్స లేదు. కేవలం కొన్ని రకాల మందుల ద్వారా ఆయుష్షును పెంచేందుకు ప్రయత్నిస్తారు. ఈ వ్యాధి ముఖ్యంగా యాభై ఏళ్ల వయసు దాటిన వారిలోనే వస్తుంది.
లక్షణాలు
ఈ వ్యాధి వచ్చాక పరిస్థితి క్రమంగా క్షీణిస్తుంది. తిరిగి ఆరోగ్యంగా మారడం కష్టం. ఉన్నంతలో మందులు వాడుతూ కొన్నిరోజులు లేదా నెలలు జీవించడమే. ఈ వ్యాధి సోకిన వారిలో మొదట పొడి దగ్గు కనిపిస్తుంది. వ్యాధి పెరుగుతున్న కొద్దీ, కష్టపడి పని చేసేటప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోగులు తీవ్రంగా అలసిపోతారు. ఈ వ్యాధి సోకిన వారిలో చేతి గోళ్లు మందంగా మారిపాయి. దీన్ని నెయిల్ క్లబ్బింగ్ అని పిలుస్తారు.
ఈ వ్యాధి ఎందుకు వస్తుంది?
ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ సమస్య రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో ఏ అలవాటు ఉన్నా భవిష్యత్తులో ఇలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం పెరిగిపోతుంది.
- ధూమపానం చేసే అలవాటు ఉన్నవారిలో
2. కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే ఆ కుటుంబ వారసులకు రావచ్చు.
3. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వారికి కూడా ఈ వ్యాధి రావచ్చు.
4. వైరల్ ఇన్ఫెక్షన్లు ఉన్న వారికి ఈ వ్యాధి రావచ్చు.
5. వయస్సు 60 నుండి 70 సంవత్సరాల వయస్సులో ఉన్నవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఈ ప్రాణాంతక వ్యాధి రాకుండా ఉండాలంటే మీ జీవనశైలిని మార్చుకోవాలి. మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేసేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తినేందుకు ప్రయత్నించండి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)