Ragi Soup for Weight loss: బరువు తగ్గేందుకు ఈ రాగి సూప్ రోజుకో కప్పు తాగండి.. ఎలా తయారు చేసుకోవాలంటే..
Ragi Soup for Weight loss: బరువు తగ్గాలనుకునే వారికి రాగులు చాలా సహకరిస్తాయి. రాగి పిండితో చేసే సూప్ రెగ్యులర్‌గా తాగితే వెయిట్ లాస్ అయ్యేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ సూప్ ఎలా చేసుకోవాలంటే..
రాగుల్లో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ సహా మరిన్ని విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఆరోగ్యానికి రాగులు చాలా రకాలుగా మేలు చేస్తాయి. వీటి రుచి కూడా అదిరిపోతుంది. రాగులతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా పోషకాలతో నిండి ఉంటుంది. వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్న వారికి రాగులు ఎంతో ఉపయోగపడతాయి. రాగులతో సూప్ చేసుకొని రెగ్యులర్‌గా తాగితే బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. రుచికరంగా ఉండటంతో తాగేందుకు కూడా చాలా బాగుంటుంది. ఈ రాగి సూప్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
రాగి సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు
- అరకప్పు రాగిపిండి
- నాలుగు కప్పుల నీరు
- ఓ ఉల్లిపాయ (సన్నగా కట్ చేసుకోవాలి)
- ఓ ఇంచు దాల్చిన చెక్క ముక్క
- ఇంచు అల్లం తరుగు
- ఓ పచ్చిమిర్చి సన్నని తరుగు
- మోస్తరు సైజ్ ఉన్న రెండు క్యారెట్ల తరుగు
- ఐదు బీన్స్ తరుగు
- పది క్యాలిఫ్లవర్ ముక్కలు
- పావు కప్పు పచ్చి బఠానీలు
- పావు కప్పు పాలకూర తరుగు
- రెండు టేబుల్ స్పూన్‍ల పుదీన
- ఓ టేబుల్ స్పూన్ నూనె
- ఓ టీస్పూన్ జీలకర్ర
- తగినంత ఉప్పు
- అర టీ స్పూన్ మిరియాల పొడి
- టీస్పూన్ స్పూన్ నిమ్మరసం
రాగిసూప్ తయారీ విధానం
- ముందుగా ఓ గిన్నెలో రాగి పిండి వేసి.. దాంట్లో ఓ కప్పు నీరు పోయాలి. ఎలాంటి ఉండలు లేకుండా స్పూన్‍తో బాగా కలుపుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకోవాలి.
- స్టవ్‍పై ఓ కళాయి పెట్టుకొని నూనె పోయాలి. నూనె కాస్త వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి తరుగు వేసి వాసన వచ్చే వరకు వేపుకోవాలి.
- అవి వేగిన తర్వాత దాంట్లో క్యారెట్, ఉల్లిపాయ, బీన్స్, క్యాలిఫ్లవర్ ముక్కలు, పచ్చి బఠానీలు వేయాలి.
- ఆ కూరగాయల ముక్కలు ఉడికేందుకు ఓ రెండు కప్పుల నీరు పోయాలి. దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి.
- సుమారు ఐదు నిమిషాల పాటు కూరగాయల ముక్కలను బాగా ఉడికించుకోవాలి.
- అవన్నీ మగ్గాక అందులో పాలకూర, పుదీన వేసి కాసేపు ఫ్రై చేయాలి.
- ఆ తర్వాత అందులో నీరు కలిపి పెట్టున్న రాగి పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. సుమారు మూడు నిమిషాల పాటు మొత్తాన్ని ఉడికించుకోవాలి. చివర్లో నిమ్మరసం వేయాలి. అంతే రాగి సూప్ రెడీ అవుతుంది. ఒకవేళ సూప్ ఎక్కువ చిక్కగా ఉంటే కాస్త నీరు వేసి మరిగించుకోవచ్చు.
ఈ రాగిసూప్‍లో అందుబాటులో ఉన్న ఏ కూరగాయలైనా ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు. మంచి టేస్టుతో ఫ్లేవర్‌ఫుల్‍గా ఈ సూప్ ఉంటుంది. పోషకాలతో నిండిన ఈ సూప్‍ను ఎంతో ఇష్టంగా తాగాలనిపిస్తుంది.
బరువు తగ్గేందుకు..
రాగుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. అలాగే, కడుపు నిండిన ఫీలింగ్‍ను చాలాసేపు కలిగిస్తుంది. దీనివల్ల మాటిమాటికీ ఆకలి కాకుండా చేయగలదు. ఇతర ఆహారాలు ఎక్కువగా తినకుండా చేస్తుంది. క్యాలరీ తక్కువగా తీసుకునేలా చేసి బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. రాగుల్లో ఉండే పోలిఫెనోల్స్ కూడా బరువు పెరగకుండా చేయగలవు. రాగుల్లో గ్లుటెన్ అసలు ఉండదు. కొలెస్ట్రాల్‍ను కూడా రాగులు తగ్గిస్తాయి. అందుకే ఈ రాగి సూప్‍ను రోజుకు ఓ కప్ తాగితే బరువు తగ్గేందుకు సహకరించడంతో పాటు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు జరుగుతుంది.
సంబంధిత కథనం