Weight loss Teas: చలికాలంలో బరువు తగ్గేందుకు సహకరించే 5 రకాల టీలు .. వెచ్చదనం కూడా..
Weight loss Teas: శరీరంలో కొవ్వు తగ్గించుకునేందుకు కొన్ని రకాల టీలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇవి చాలా సహకరిస్తాయి. చలికాలంలో ఈ టీలు శరీరానికి మంచి వెచ్చదనాన్ని కూడా అందిస్తాయి. ఇవి చేసుకోవడం కూడా ఈజీనే.
వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం రకరకాల డైట్‍లు, వర్కౌట్లు పాటిస్తుంటారు. బరువు తగ్గేందుకు తపిస్తుంటారు . అయితే, కొన్ని రకాల టీలు తాగడం వల్ల బరువు తగ్గే ప్రయత్నానికి తోడ్పాటు లభిస్తుంది. సాధారణంగా చలికాలంలో వెచ్చదనం కోసం టీలు ఎక్కువగా తాగాలనిపిస్తుంది. ఈ టీలు తాగడం వల్ల బరువు తగ్గేందుకు కూడా మేలు జరుగుతుంది. శరీరానికి వెచ్చదనంతో పాటు కొవ్వు కరిగేందుకు, జీవక్రియ మెరుగయ్యేందుకు ఈ టీలు ఉపయోగపడతాయి. అవేవంటే..
అల్లం టీ
అల్లంలో ఔషధ గుణాలతో పాటు కొవ్వును కరిగించే లక్షణాలు కూడా ఉంటాయి. అల్లం టీ తాగడం వల్ల శరీరంలో కొవ్వు కరిగేందుకు సహకరిస్తుంది. జీవక్రియ రేటు పెంచుతుంది. బరువు తగ్గేందుకు అల్లం టీ బాగా ఉపయోగపడుతుంది. అయితే, పాలు, చెక్కెర లేకుండా ఈ టీ చేసుకుంటే మేలు. నీటిలో అల్లాన్ని బాగా మరిగించి.. తేనె వేసుకొని తాగితే బాగుంటుంది. నిమ్మరసం కూడా పిండుకోవచ్చు.
పుదీన టీ
బరువు తగ్గాలనుకునే వారికి పుదీన టీ కూడా సూటవుతుంది. ఆకలిని ఈ టీ తగ్గిస్తుంది. కడుపుకు సంతృప్తి ఫీలింగ్ ఇస్తుంది. ఎక్కువ ఆహారం తీసుకోకుండా చేయయగలదు. దీంతో బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. కప్పు నీటిలో ఐదారు ఎండబెట్టిన లేదా తాజా పుదీన ఆకులను వేసి మరిగించుకోవాలి. దాన్ని వడగట్టి సరిడా తేనే వేసుకొని తాగేయవచ్చు.
మిరియాల టీ
మిరియాల టీ కూడా బరువు తగ్గేందుకు మంచి ఆప్షన్. ఈ టీ తాగడం వల్ల శరీరంలో జీవక్రియ బాగా మెరుగవుతుంది. ఘాటుగా ఉండే ఈ టీ కొవ్వు కరిగేందుకు బాగా ఉపయోగపడుతుంది. కచ్చాపచ్చగా దంచిన మిరియాలను, ఓ చిన్న ముక్క అల్లాన్ని ఓ కప్పు నీటిలో వేసి నాలుగైదు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వతా దాన్ని వడగట్టి తేనె లేదా నిమ్మరసం కలుపుకొని తాగాలి.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో ఉండే యాక్టివ్ కాంపౌండ్స్.. శరీరంలో కొవ్వు కరిగేందుకు తోడ్పడతాయి. ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్ల పనితీరును మెరుగుపరచగలదు. దీంతో బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. గ్రీన్ టీలో తేనె వేసుకొని తాగొచ్చు.
మందార టీ
బరువు తగ్గాలనుకునే వారికి మందార టీ కూడా మంచి ఆప్షన్‍గా ఉంటుంది. జీర్ణక్రియను ఈ టీ మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. కొవ్వు కరిగేందుకు బాగా ఉపయోగపడుతుంది. ముందుగా మందార పువ్వును ఎండబెట్టాలి. ఆ తర్వాత మరిగే నీటిలో ఎండిన మందార పువ్వు రెక్కలను వేయాలి. సుమారు 10 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత వడగట్టి టీ తాగొచ్చు. రుచికోసం కాస్త తేనె కలుపుకోవచ్చు.