Aloo Bhujia: బంగాళదుంపలతో కారప్పూస ఇలా చేసేయండి, పిల్లలకు బాగా నచ్చుతుంది
Aloo Bhujia: కారప్పూస పేరు చెబితేనే నోరూరిపోతుంది. బంగాళదుంపలతో కూడా కారపూసను చేస్తారు. దీన్ని ఆలూ భుజియా అంటారు. దీని రెసిపీ ఎలా చేయాలో తెలుసుకోండి.
కారప్పూసను ఎక్కువగా శెనగపిండితో చేస్తూ ఉంటారు. బంగాళదుంపలతో చేసిన కారప్పూస కూడా మార్కెట్లో ఉంది. దీన్ని ఆలూ భుజియా అంటారు. దీన్ని ఎక్కువగా ప్యాకెట్ల రూపంలో అమ్ముతారు. వీటిలో ఉప్పును అధికంగా వేస్తారు. ఇలా ఉప్పు వేయడం వల్ల అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇలాంటి ఆహారాన్ని తినడం ఆరోగ్యానికి మంచిది కాదు, కాబట్టి బంగాళదుంపలతో కారప్పూసను సులువుగా ఇంట్లోనే చేసుకోండి. ఆలూ భుజియా రెసిపీని ఇక్కడ అందించాము. దీన్ని ఫాలో అయిపోతే టేస్టీ బంగాళదుంప కారప్పూస రెడీ అయిపోతుంది.
బంగాళదుంప కారప్పూస రెసిపీకి కావలసిన పదార్థాలు
శెనగపిండి - రెండు కప్పులు
బంగాళాదుంపలు - నాలుగు
బియ్యప్పిండి - అర కప్పు
ఆమ్చూర్ పౌడర్ - ఒక స్పూను
పుదీనా పొడి - ఒక స్పూను
నూనె - వేయించడానికి సరిపడా
చాట్ మసాలా - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
కారం - ఒక స్పూను
పసుపు - అర స్పూను
గరం మసాలా - అరస్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
శొంఠి పొడి - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
బంగాళదుంప కారప్పూస రెసిపీ
1. బంగాళదుంపలు ముందుగానే ఉడికించి పొట్టు తీయాలి.
2. పొట్టు తీశాక ఆ దుంపలను సన్నగా తురిమి పక్కన పెట్టాలి.
3. ఇప్పుడు ఒక గిన్నెలో శెనగపిండి, బియ్యం పిండి, ఆమ్చూర్ పౌడర్, పుదీనా పొడి, ధనియాల పొడి, కారం, పసుపు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఉప్పు వేసి కలపాలి.
4. ఆ మిశ్రమంలోనే సన్నగా తరిగిన బంగాళదుంపల మిశ్రమాన్ని కూడా వేసి చేతితోనే కలుపుకోవాలి.
5. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి పిండి గట్టిగా అయ్యేలా కలుపుకోవాలి.
6. జంతికల గొట్టాన్ని తీసుకొని అందులో కారప్పూసకు వాడే సన్నని రంధ్రాలు ఉన్న ప్లేటులో పెట్టాలి.
7. జంతికల గొట్టంలో ఈ మిశ్రమాన్ని పెట్టి స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
8. నూనె వేడెక్కాక జంతికల గొట్టంతో కారప్పూసను సన్నగా వేసుకోవాలి.
9. రెండు వైపులా వేయించాక తీసి పక్కన పెట్టుకోవాలి.
10. దాన్ని చేతితోనే నలిపేసుకుంటే కారప్పూస రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
ఆలూ భుజియా లేదా బంగాళదుంప కారప్పూసను ఇలా ఇంట్లోనే చేసుకుంటే సాయంత్రం స్నాక్ గా ఉపయోగపడుతుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఏదైనా తినేందుకు అడుగుతారు. అలాంటప్పుడు ఇంట్లో చేసిన ఈ బంగాళదుంప కారప్పూసను ఇవ్వండి. కచ్చితంగా వారికి నచ్చుతుంది. అయితే ఉప్పుని తక్కువగా వేసుకోవడం మంచిది. బంగాళదుంపలను బాగా మెత్తగా ఉడికించాల్సిన అవసరం ఉంది. అప్పుడు దానిలోని గ్లైసెమిక్ ఇండెక్స్ మరింతగా తగ్గుతుంది. కాబట్టి మధుమేహలు కూడా దీన్ని తినవచ్చు.
టాపిక్