Nuzivid TDP : ఒకే వేదికపై జోగి రమేష్, కొలుసు పార్థసారధి.. నారా లోకేష్ సీరియస్.. ఏం జరిగింది?-nara lokesh is serious about tdp leaders sharing the stage with jogi ramesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nuzivid Tdp : ఒకే వేదికపై జోగి రమేష్, కొలుసు పార్థసారధి.. నారా లోకేష్ సీరియస్.. ఏం జరిగింది?

Nuzivid TDP : ఒకే వేదికపై జోగి రమేష్, కొలుసు పార్థసారధి.. నారా లోకేష్ సీరియస్.. ఏం జరిగింది?

Basani Shiva Kumar HT Telugu
Dec 16, 2024 04:37 PM IST

Nuzivid TDP : జోగి రమేష్ వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్. టీడీపీ నేతలను విమర్శించాలన్న.. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయాలన్నా.. వైసీపీ జోగి రమేష్‌ను మీడియా ముందుకు పంపేదనే అభిప్రాయాలు ఉన్నాయి. అలాంటి లీడర్‌తో టీడీపీ మంత్రి, ఎమ్మెల్యే, ఇతర కీలక నేతలు వేదిక పంచుకున్నారు. దీనిపై నారా లోకేష్ సీరియస్ అయ్యారు.

జోగి రమేష్‌తో మంత్రి పార్థసారధి
జోగి రమేష్‌తో మంత్రి పార్థసారధి

మంత్రి కొలుసు పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీష, పార్టీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణపై.. మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. మాజీమంత్రి, వైసీపీ నేత జోగి రమేష్‌తో కలిసి వేదిక పంచుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని కొలుసు పార్థసారధిని లోకేష్ ఆదేశించారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఆంధ్రా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఏం జరిగింది..

ఉమ్మడి కృష్ణా జిల్లా, ప్రస్తుత ఏలూరు జిల్లాలోని నూజివీడులో గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారధి, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషను నిర్వాహకులు ఆహ్వానించారు. అలాగే టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. అదే సమయంలో.. మాజీమంత్రి, గౌడ సామాజికవర్గానికి చెందిన జోగి రమేష్‌ను కూడా నిర్వాహకులు ఆహ్వానించారు.

అయితే.. ఈ కార్యక్రమంలో జోగి రమేష్‌తో కలిసి టీడీపీ నేతలు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ వ్యవహారంపై గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లి, పొద్దున లేస్తే టీడీపీ నేతలను బూతులు తిట్టే జోగి రమేష్‌తో టీడీపీ నేతలు పాల్గొనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ లోకేష్ వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో లోకేష్ దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

జోగి రమేష్ ఎందుకు వెళ్లారు..

నూజివీడు నియోజకవర్గంలో గౌడ సామాజికవర్గం చాలా బలంగా ఉంటుంది. దాదాపు 30 వేల ఓట్లు ఉంటాయి. ఈ సామాజికవర్గం వారు అటు వైసీపీలో ఇటు టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే.. సంఘం ఆధ్వర్యంలో గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో టీడీపీకి సపోర్ట్ చేసేవారు టీడీపీ నేతలను ఆహ్వానించారు. వైసీపీకి సపోర్ట్ చేసేవారు.. జోగి రమేష్‌ను ఆహ్వానించారు.

ఈ కార్యక్రమానికి వారు ఆహ్వానించినట్టు టీడీపీ, వైసీపీ నేతలు హాజరయ్యారు. దీనిపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ.. టీడీపీ మాత్రం సీరియస్ అయ్యింది. ఒకవేళ ఆ కార్యక్రమానికి వెళ్లాల్సి వస్తే.. జోగి రమేష్ వెళ్లిపోయిన తర్వాతనో.. రాకముందో వెళ్లొచ్చు కదా అనే వాదనను స్థానిక టీడీపీ నాయకులు తెరపైకి తెస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల పార్టీకి నష్టం వస్తుందని.. బలమైన కేడర్ పార్టీకి దూరం అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

Whats_app_banner