Supreme Court : వరకట్న వేధింపుల కేసుల్లో భర్త కుటుంబ సభ్యులను ఇరికించడంపై సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్
Supreme Court On Dowry Harassment Laws : వరకట్న వేధింపుల కేసుల్లో చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా కోర్టులు జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. భార్య డిమాండ్లను నెరవేర్చడానికి భర్తను ఇబ్బందిపెడుతూ సెక్షన్ 498A దుర్వినియోగం అయిందని సీరియస్ కామెంట్స్ చేసింది.
వరకట్న వేధింపుల కేసుల్లో చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా చూసుకోవాలని కిందిస్థాయి కోర్టులకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. భర్త బంధువులను ఇరికించే ధోరణితో అమాయక కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. భర్త వైపు బంధువులపై అనవసర వేధింపుల నుంచి కాపాడాలని సుప్రీంకోర్టు తెలిపింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య మీద దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న సమయంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
వైవాహిక వివాదం కారణంగా తలెత్తే క్రిమినల్ కేసులో భర్త వైపు కుటుంబ సభ్యుల ప్రమేయాన్ని సూచించే నిర్దిష్ట ఆరోపణలు లేకుండా పేర్లను పేర్కొనడాన్ని మొదట్లో నిలిపివేయాలని జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఎన్.కోటేశ్వర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. వైవాహిక వివాదాల విషయంలో భర్త కుటుంబ సభ్యులందరినీ ఇరికించే ధోరణి తరచూ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమేనని కోర్టు తెలిపింది. స్పష్టమైన సాక్ష్యాలు లేదా నిర్దిష్ట ఆరోపణలు లేకుండా క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు ఆధారం కాలేవని స్పష్టం చేసింది.
ఇలాంటి కేసుల్లో చట్టపరమైన నిబంధనలు, చట్ట ప్రక్రియ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని కోర్టులకు తెలిపింది. అంతేకాదు.. అమాయక కుటుంబ సభ్యులను అనవసర వేధింపుల నుంచి కాపాడేందుకు న్యాయస్థానాలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
భర్త, అతని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులపై ఓ మహిళ దాఖలు చేసిన వరకట్న వేధింపుల కేసును కొట్టివేయడాన్ని తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసు సుప్రీం కోర్టుకు వెళ్లింది. అయితే అత్యున్నత న్యాయస్థానం విచారణ తర్వాత ఈ కేసును కొట్టివేసింది. భర్త, అతని కుటుంబ సభ్యులపై వ్యక్తిగత కక్షలు, శత్రుత్వంతో భార్య ఈ ఫిర్యాదు చేసిందని కేసును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లో సెక్షన్ 498ఏను సవరణ ద్వారా చేర్చడం వెనక ఉద్దేశం ఒక మహిళపై ఆమె భర్త, ఆమె కుటుంబ సభ్యులు చేసే క్రూరత్వాన్ని నిరోధించడమేనని సుప్రీం కోర్టు పేర్కొంది. తద్వారా ప్రభుత్వం త్వరితగతిన జోక్యం చేసుకునేలా చూడాలని తెలిపింది.
'ఇటీవలి సంవత్సరాలలో దేశవ్యాప్తంగా వైవాహిక వివాదాలు గణనీయంగా పెరిగాయి. దీని ఫలితంగా సెక్షన్ 498ఏ (భార్యపై భర్త లేదా అతని బంధువులు క్రూరత్వం) వంటి ఐపీసీ నిబంధనలను దుర్వినియోగం చేసే ధోరణి కూడా పెరుగుతోంది.' అని ధర్మాసనం తెలిపింది.
వైవాహిక వివాదాల సమయంలో దర్యాప్తు సరిగా చేయకపోతే చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడానికి దారితీస్తుందని వ్యాఖ్యానించింది. భార్య, ఆమె కుటుంబం నుండి భర్త తరఫు వారికి ఒత్తిడి వ్యూహాలకు దారితీస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది.
'ఐపీసీ సెక్షన్ 498ఏ కింద క్రూరత్వానికి గురైన ఏ మహిళ అయినా మౌనంగా ఉండాలని, ఫిర్యాదు చేయకుండా, క్రిమినల్ చర్యలు తీసుకోకుండా సంయమనం పాటించాలని మేం చెప్పడం లేదు. తప్పుడు కేసులను ప్రోత్సహించొద్దని మాత్రమే చెబుతున్నాం.' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.