Onion Kurma: ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఉల్లిపాయ కుర్మా ఇలా చేసేయండి, రెసిపీ అదిరిపోతుంది
Onion Kurma: ఒక్కొక్కసారి ఇంట్లో కూరగాయలు ఉండవు. అలాంటప్పుడు ఉల్లిపాయ కుర్మా ప్రయత్నించండి. వేడివేడి అన్నంలో రుచి అదిరిపోతుంది.
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, నోరు చప్పగా అనిపించినప్పుడు ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో ఉల్లిపాయ కుర్మాను ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకుంటే రుచి అదిరిపోతుంది. దీన్ని స్పైసీగా చేసుకుంటే పెద్దవాళ్లకి తెగ నచ్చేస్తుంది. దీనిలో మనం ఉల్లిపాయలు, టమోటాలను వేస్తాము. కాబట్టి ఈ కుర్మా రుచి అందరికీ నచ్చడం ఖాయం. ఈ ఉల్లిపాయ కుర్మాలో మనము ఆరోగ్యానికి మేలు చేసేవే వేశాము. కాబట్టి దీన్ని తినడం వల్ల పోషకాలు కూడా అందుతాయి. ఇక ఉల్లిపాయ కుర్మా రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
ఉల్లిపాయ కుర్మా రెసిపీకి కావాల్సిన పదార్థాలు
ఉల్లిపాయలు - నాలుగు
నూనె - సరిపడినంత
ఎండు కొబ్బరి పొడి - మూడు స్పూన్లు
నువ్వులు - ఒక స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ - మూడు స్పూన్లు
కారం - ఒకటిన్నర స్పూను
జీలకర్ర పొడి - ఒక స్పూను
గరం మసాలా - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
పసుపు - అర స్పూను
టమోటోలు - మూడు
చింతపండు - ఉసిరికాయ సైజులో
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
ఉల్లిపాయ కుర్మా రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వెయ్యాలి.
2. ఆ నూనెలో ఉల్లిపాయలు తరుగును వేసి అది రంగు మారేవరకు వేయించాలి.
3. ఉల్లిపాయల రంగు మారాక కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి.
4. ఇప్పుడు నువ్వులు కూడా వేసి వేయించాలి.
5. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో వేసి కొంచెం నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టి నూనె వేయాలి.
7. ఆ నూనెలో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా వేయించుకోవాలి.
8. అందులోనే కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసి బాగా కలపాలి.
9. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.
10. ఈ మిశ్రమంలో టమోటాలను మెత్తగా రుబ్బుకుని ఆ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి.
11. దీన్ని మీడియం మంట మీద వేడి చేయాలి.
12. ఐదు నిమిషాల తర్వాత గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
13. చింతపండును నీటిలో వేసి నానబెట్టి పులుసును వేరు చేయాలి.
14. ఆ పులుసును కూడా కళాయిలోని మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి.
15. ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయ పేస్ట్ ను అందులో వేసి బాగా కలపాలి.
16. పైన మూత పెట్టి చిన్న మంట మీద పావుగంట సేపు ఉడికించాలి. నూనె పైకి తేలే వరకు అలా ఉంచాలి.
17. ఆ తర్వాత పైన కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి.
18. అంతే టేస్టీ ఉల్లిపాయ కుర్మా రెడీ అయినట్టే.
19. ఇది అన్నంతో తిన్నా రుచిగా ఉంటుంది లేదా చపాతి రోటీలతో తిన్నా కూడా బాగుంటుంది. ఒక్కసారి తిని చూడండి ఇది మీకు నచ్చడం ఖాయం.
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఉల్లిపాయ, టమాటా మాత్రమే ఉన్నప్పుడు ఈ కుర్మాను ప్రయత్నించండి. మీకు ఇది మంచి రుచిని అందిస్తుంది. కాస్త మసాలా, కారాన్ని దట్టించుకుంటే చలికాలంలో ఇంకా అదిరిపోతుంది.
టాపిక్