Allu Arjun: వద్దన్నారు.. అందుకే కలవలేదు: గాయపడిన చిన్నారిని కలవకపోవడంపై అల్లు అర్జున్ వివరణ
Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్, తర్వాత పరామర్శలు.. వీటి నేపథ్యంలో తాను సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన చిన్నారిని ఎందుకు కలవలేదో వివరణ ఇచ్చాడు. ఆదివారం (డిసెంబర్ 15) రాత్రి బన్నీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Allu Arjun: పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో గాయపడిన చిన్నారిని పరామర్శించకపోవడంపై అల్లు అర్జున్ పై ఎన్నో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాను ఇప్పటి వరకూ కలవకపోవడానికి కారణమేంటో అతడు ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వివరించాడు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు.
అల్లు అర్జున్ వివరణ ఇదీ..
సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయి, చంచల్‌గూడ జైలులో ఒక రాత్రి గడిపిన అల్లు అర్జున్ తర్వాత బెయిల్ పై రిలీజైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఘటనలో గాయపడిన చిన్నారి గురించి అతడు ఓ పోస్ట్ ద్వారా స్పందించాడు. ఆ చిన్నారి ఇప్పటికీ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగానే ఉంది. అయితే ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నందున ఆ చిన్నారిని కలవద్దని తనకు సూచించినట్లు బన్నీ ఈ పోస్టులో వెల్లడించాడు.
"చిన్నారి శ్రీ తేజ్ ఆ దురదృష్టకర ఘటనలో గాయపడి చికిత్స పొందుతూనే ఉన్నాడు. అతని గురించి నేను ఆందోళనగానే ఉన్నాను. ప్రస్తుతం జరుగుతున్న న్యాయ ప్రక్రియ వల్ల అతడు, అతని కుటుంబాన్ని కలవద్దని నాకు సూచించారు. వాళ్ల కోసం నేను ప్రార్థిస్తూనే ఉంటాను. చికిత్స ఖర్చు, కుటుంబ అవసరాలు తీర్చడానికి నేను కట్టుబడి ఉన్నాను. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. సాధ్యమైనంత త్వరగా అతనితోపాటు అతని కుటుంబాన్ని కలవాలని భావిస్తున్నాను" అని అల్లు అర్జున్ ఆ పోస్టులో చెప్పాడు.
అల్లు అర్జున్‌పై విమర్శలు
సంధ్య థియేటర్ ఘటన, అరెస్టు, బెయిలుపై విడుదల తర్వాత శని, ఆదివారాల్లో అల్లు అర్జున్ కు పరామర్శలు ఎక్కువైపోయాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అతని ఇంటికి క్యూ కట్టారు. మరోవైపు బన్నీ కూడా చిరంజీవి, నాగబాబు ఇళ్లకు వెళ్లి తనకు మద్దతుగా నిలిచినందుకు థ్యాంక్స్ చెప్పాడు. అయితే ఘటనలో గాయపడిన చిన్నారిని కలవడానికి మాత్రం నీకు టైమ్ లేదా అంటూ అల్లు అర్జున్ ను సోషల్ మీడియాలో చాలా మంది నిలదీశారు.
దీనిపైనే అతడు తాజాగా తన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా వివరణ ఇచ్చాడు. పుష్ప 2 రిలీజ్ కు ముందు డిసెంబర్ 4న సంధ్య థియేటర్లో ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. దీనికి అల్లు అర్జున్ కూడా బాధ్యుడే అంటూ అతనిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం (డిసెంబర్ 13) ఉదయం అరెస్టు చేయగా.. రాత్రి వరకు బెయిల్ వచ్చింది. శనివారం ఉదయం అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.
టాపిక్