AP Dy Speaker: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ, చీఫ్ విప్‌లుగా జీవీ.ఆంజనేయులు, అనురాధ..
AP Dy Speaker: రఘురామకృష్ణం రాజుకు కోరుకున్న పదవి దక్కింది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పేరును ఖరారు చేశారు. మరోవైపు శాసనసభ, మండలిలో విప్‌లను కూడా ఖరారు చేశారు. శాసనసభకు జీవీ ఆంజనేయులు, మండలికి అనురాధలను ఖరారు చేశారు.
AP Dy Speaker: మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుకు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. శాసనసభాపతి స్థానాన్ని ఆశించిన టీడీపీలో సీనియర్లు చాలామంది ఉండటంతో ఆ పదవి ఆయనకు దక్కలేదు. 2019లో వైసీపీ తరపున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జగన్‌కు కంట్లో నలుసులా తయారయ్యారు. నిత్యం విమర్శలతో ఆయనపై దాడి చేశారు. వైసీపీలో ఉంటూనే ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. రచ్చబండ పేరుతో దాదాపు మూడేళ్ల రచ్చ చేశారు. ఈ క్రమంలో ఏపీ సీఐడీ రఘురామను అరెస్ట్ కూడా చేసింది. ఈ వ్యవహారం కూడా తీవ్ర దుమారాన్ని రేపింది.
ఎన్నికల సమయంలో రఘురామ పోటీ చేయడంపై చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. ఏపీలో జనసేన, బీజేపీలతో కలిసి పోటీ చేయడంతో రఘురామ పోటీ విషయంలో చివరకు సస్పెన్స్ కొనసాగింది. ఓ దశలో ఆయనకు టిక్కెట్ రాదని కూడా ప్రచారం జరిగింది. రఘురామ బీజేపీ, టీడీపీలలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగింది. చివరకు ఉండి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. కొత్త శాసన సభ్యుల శిక్షణా కార్యక్రమాల సందర్భంగా రఘురామ పేరును డిప్యూటీ స్పీకర్ పదవికి ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్ ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉంది. ప్రస్తుతం సభలో వైసీపీ సభ్యులు 11మంది మాత్రమే కావడంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక లాంఛనం కావొచ్చు.
చీఫ్ విప్‌లుగా ఆంజనేయులు, అనురాధ…
ఏపీ అసెంబ్లీ, మండలిలో పెద్ద సంఖ్యలో సభ్యులకు చీఫ్ విప్, విప్ పదవులు దక్కాయి. శాసనసభలో చీఫ్ విప్ సహా 16మంది పదవులు దక్కగా మండలిలో చీఫ్ విప్‌తో పాటు నలుగురిని నియమించారు. ఇంతమందిని విప్‌లుగా నియమించిన దాఖలాలు గతంలో లేవు. ప్రస్తుతం శాసనసభలో కూటమికి 164మంది సభ్యుల బలం ఉండటంతో విప్‌ల సంఖ్యను గణనీయంగా పెంచారు. అన్ని పార్టీలకు తగిన ప్రాధాన్యత కల్పించడంతో పాటు సీనియార్టీని కూడా పరిగణలోకి తీసుకున్నారు.
అసెంబ్లీ చీఫ్ విప్‌గా వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల వెంకట శివ సీతారామాంజనేయులు (జీవీ ఆంజనేయులు) పేరును ఖరారు చేశారు. శాసన మం డలిలో చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. శాసనభలో 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు జనసేన సభ్యులు, ఒక బీజేపీ ఎమ్మెల్యేను, మండలిలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు, ఒక జనసేన ఎమ్మెల్సీకి విప్‌లుగా ప్రకటించారు.
శాసనసభలో విప్‌లుగా ఖరారైన వారిలో సి.ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు, బీజే పీ), అరవ శ్రీధర్(రైల్వే కోడూరు, జనసేన), బొలిశెట్టి శ్రీనివాస్(తాడేపల్లిగూడెం, జనసేన), బొమ్మిడి నారాయణ నాయకర్(నరసాపురం, జనసేన)లతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్(ఇచ్చాపురం), బొండా ఉమామహేశ్వరరావు (విజయవాడ సెంట్రల్), దాట్ల సుబ్బరాజు (ముమ్మిడివరం), యనమల దివ్య (తుని), వి.ఎం.థామస్ (గంగాధర నెల్లూరు), తోయక జగదీశ్వరి (కురుపాం), కాల్వ శ్రీనివాసులు (రాయదుర్గం), రెడ్డప్పగారి మాధవి (కడప), పీజీవీఆర్ నాయుడు-గణబాబు (విశాఖపట్నం పశ్చిమ), తంగిరాల సౌమ్య (నందిగామ), యార్లగడ్డ వెంకట్రావు (గన్నవరం) ఉన్నారు.
శాసనసభ చీఫ్ విప్ పదవిని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఇస్తారని ప్రచారం జరిగింది. ఆ పదవికి ఆయన సుముఖత వ్యక్తం చేయకపోవడంతో జీవీ ఆంజనేయులును ఎంపిక చేశారు. విప్‌లలో నలుగురు రాయలసీమ, ముగ్గురు ఉత్తరాంధ్ర, 9 మంది కోస్తాంధ్ర ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. శాసనమండలి చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధను , విప్‌లుగా వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్(టీడీపీ), పిడుగు హరిప్రసాద్(జనసేన)లను ప్రకటించారు.