Allu Arjun Stampede Case: అల్లు అర్జున్‌కి పర్మీషన్ ఇవ్వలేదు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు ట్విస్ట్
Allu Arjun Stampede Case: పుష్ప 2 ప్రీమియర్ కోసం సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చేందుకు తాము అనుమతి ఇవ్వలేదని.. ఈ మేరకు లేఖ ద్వారా సమాచారం కూడా ఇచ్చామని చిక్కడపల్లి పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు.
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. పుష్ప 2 ప్రీమియర్ షో కోసం డిసెంబరు 4న రాత్రి సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప 2 చిత్ర యూనిట్ వెళ్లింది. అయితే.. అక్కడ అల్లు అర్జున్‌ను చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది.
థియేటర్ వెర్షన్ కరెక్టే కానీ?
ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ తొక్కిసలాటపై కేసు నమోదు చేసిన పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌పై విడుదల అయ్యారు.
వాస్తవానికి పుష్ప2 ప్రీమియర్ సందర్భంగా సెలెబ్రిటీలు వచ్చే అవకాశం ఉండటంతో భద్రత కల్పించాలని కోరుతూ ఓ లేఖ ద్వారా సంధ్య థియేటర్ యాజమాన్యం కోరినట్లు మాత్రమే ఇప్పటి వరకూ వెలుగులోకి వచ్చింది.
ట్విస్ట్ ఇచ్చిన చిక్కడపల్లి పోలీసులు
అల్లు అర్జున్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా థియేటర్ వద్దకు వచ్చాడని.. దాంతో తొక్కిసలాట జరిగిందనే వాదనని తొలుత పోలీసులు వినిపించారు. కానీ.. థియేటర్ లేఖ బయటికి రావడంతో అల్లు అర్జున్‌ది తప్పులేదని అతని అభిమానులు వాదిస్తూ వస్తున్నారు.
కానీ.. చిక్కడపల్లి పోలీసులు కూడా సంధ్య థియేటర్‌కి రాతపూర్వకంగా పుష్ప 2 చిత్ర యూనిట్‌ను అక్కడికి రావొద్దని చెప్పాలంటూ సూచించారు. ఈ మేరకు ఒక లెటర్ కూడా బయటికి వచ్చింది. దాంతో తాము పుష్ప2 చిత్ర యూనిట్ థియేటర్ వద్దకు వచ్చేందుకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు వాదిస్తున్నారు. ఈ లెక్కన అనుమతి లేకుండానే అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రావడం.. అలానే మూవీ చూసి వెళ్లిపోయే సమయంలో అనుమతి లేకుండానే ర్యాలీ చేపట్టినట్లు పోలీసులు చెప్తున్నారు.
బెయిల్‌పై విడుదలైన అల్లు అర్జున్
ఈ కేసులో అల్లు అర్జున్‌ను గత శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేయగా.. నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కూడా విధించింది. కానీ.. శుక్రవారం రాత్రి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో శనివారం ఉదయం చంచలగూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల అయ్యారు. రేవతి మృతి తర్వాత కేసు పెట్టిన ఆమె భర్త.. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత కేసుని వెనక్కి తీసుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే.