Mohanlal in Kannappa: కన్నప్ప నుంచి మోహన్ లాల్ ఫస్ట్ లుక్ రిలీజ్.. కిరాటగా పరిచయం చేసిన మంచు విష్ణు
Mohanlal in Kannappa: కన్నప్పలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానున్న ఈ సినిమా నుంచి విష్ణు మంచు మరో అప్‌డేట్ ఇచ్చారు.
మంచు విష్ణు కన్నప్ప నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. మలయాళం సీనియర్ హీరో మోహన్ లాల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. సోమవారం అతని లుక్‌కి సంబంధించి ఒక పోస్టర్‌ను మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
కిరాటగా మోహన్ లాల్
పోస్టర్‌లో మోహన్ లాల్ గిరిజన నాయకుడి అవతారంలో కనిపిస్తున్నారు. చేతిలో కత్తితో ముఖానికి నల్లరంగు పూసి, భారీ గడ్డం, పొడవాటి జుట్టుతో భీకరంగా మోహన్ లాల్ కనిపిస్తున్నాడు. "పశుపతాస్త్రంలో నిష్ణాతుడు.. విజేతపై విజయం సాధించే కిరాట’’ అంటూ ఆ పోస్టర్‌పై రాసి ఉంది.
తన కాలపు గొప్ప నటుడైన మోహన్ లాల్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అరుదైన గౌరవం తనకి దక్కిందని.. ఈ సీక్వెన్స్ మొత్తం బ్లాస్టింగ్‌గా ఉంటుందని మంచు విష్ణు రాసుకొచ్చాడు.
మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. అలానే పరుచూరి గోపాలకృష్ణ, ఈశ్వర్ రెడ్డి, జి.నాగేశ్వరరెడ్డి, తోట ప్రసాద్ తదితరులు కథ అందించిన ఈ చిత్రానికి విష్ణు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. 2025 ఏప్రిల్ 25న కన్నప్ప మూవీ థియేటర్లలో విడుదల కానుంది.
వివాదంలో మంచు ఫ్యామిలీ
మంచు ఫ్యామిలీలో గత వారం రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య తొలుత గొడవ జరగగా.. ఆ కోపంలో ఓ రిపోర్టర్‌పై మోహన్ బాబు దాడి చేసి కేసులో ఇరుక్కున్నారు.
బౌన్సర్లను మోహరించడం ద్వారా జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద భయానక వాతావరణం సృష్టించడంతో మంచు విష్ణు, మంచు మనోజ్‌పై పోలీసులు బైండోవర్ చేశారు.
ప్రమోషన్స్ మళ్లీ మొదలెట్టిన విష్ణు
గత వారం వరకూ కన్నప్ప పోస్ట్ ప్రొడెక్షన్ వర్క్‌లోనే మంచు విష్ణు బిజీగా ఉన్నాడు. అయితే.. ఈ గొడవల నేపథ్యంలో.. కొన్ని రోజులు ఫ్యామిలీకి సమయం కేటాయించిన విష్ణు.. మళ్లీ ఈరోజు నుంచి మూవీ ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.