Minister Narayana: ఆర్-5 జోన్ లో పట్టాలు పొందిన వారికి సొంత జిల్లాల్లో స్థలాలు, 9నెలల్లోఅమరావతిలో అధికారులకు ఇళ్లు రెడీ
Minister Narayana: అమరావతి మాస్టర్ ప్లాన్ ను గతంలో చెప్పిన విధంగానే అమలు చేస్తామని, వచ్చే 9 తొమ్మిది నెలల్లో అధికారులు అమరావతిలో ఉండేలా వారికి నివాసాలు సిద్దం చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. నీరుకొండలో భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
Minister Narayana: అమరావతిలోని ఆర్ - 5 జోన్ లో పట్టాలు పొందిన వారికి గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో స్థలాలు కేటాయించనున్నట్టు మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు.గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఇష్టానుసారంగా వ్యవహరించిందని త్వరలోనే అమరావతి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
మంగళగిరి మండలం నీరుకొండలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. మంగళగిరిలో ఎయిమ్స్ ను గత టీడీపీ ప్రభుత్వంలోనే ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నామని...రాబోయే రోజుల్లో ప్రఖ్యాత వైద్య సంస్థలు అమరావతికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తొమ్మిది నెలల్లో అమరావతిలో అధికారులకు నివాసాలు సిద్దం చేస్తాం
రాజధాని కోసం భూములిచ్చిన రైతులను గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టిందని మంత్రి నారాయణ ఆరోపించారు. గత ప్రభుత్వం అమరావతి పనులు చేయలేదని...కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లించలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లతో గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసి ఇంజినీర్ల కమిటీ నివేదిక ఆధారంగా ముందుకెళ్తున్నామన్నారు
ఈ ప్రక్రియ జరగడానికే ఆరు నెలల సమయం పట్టిందన్నారు. అయితే ఇప్పటికే రాజధానిలో 20 వేల కోట్లకు పైగా పనులకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.నాలుగైదు రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు.
ఏడాదిన్నర లోగా రోడ్లు పూర్తి చేస్తామని రాబోయే 9 నెలల్లో అధికారుల నివాసాలు కూడా సిద్దం చేస్తామన్నారు. గతంలో చెప్పిన విధంగానే రాజధానిని తూ.చ తప్పకుండా పూర్తి చేస్తామని... మూడేళ్లలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.రాజధాని గ్రామం నీరుకొండలో భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుచేయాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు మంత్రి చెప్పారు. త్వరలోనే విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. రాజధానిలో రైతుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వివరించారు.
సంబంధిత కథనం