Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై అతని అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఘటనలో తప్పెవరది అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజానికి సంధ్య 70 ఎంఎం థియేటర్లో ప్రీమియర్ షోకి, అల్లు అర్జున్ ఈ షోకి రావడానికి పోలీసులు అనుమతి ఇచ్చారంటూ ఆ లేఖను కూడా బయటపెడుతున్నారు. బన్నీకి క్రమంగా మద్దతు పెరుగుతోంది.
సంధ్య 70 ఎంఎం థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న తొక్కిసలాట జరిగిన రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలుసు కదా. దీనికి సంబంధించి థియేటర్ యాజమాన్యంతోపాటు అల్లు అర్జున్ పైనా కేసు నమోదు కావడంతో పోలీసులు శుక్రవారం (డిసెంబర్ 13) అతన్ని అరెస్ట్ చేశారు. అయితే అభిమాని మరణంలో బన్నీ తప్పేముందని, దీనికి అనుమతి ఇచ్చిన పోలీసుల వైఫల్యమే ఇది అంటూ సోషల్ మీడియాలో అభిమానులు అంటున్నారు.
ఆ రోజు ప్రీమియర్ షోతోపాటు తర్వాత షోలకు కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలంటూ డిసెంబర్ 2నే సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు లేఖ రాయగా.. దానికి అనుమతి ఇచ్చారు. ఇప్పుడా లేఖను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. పోలీసులు అనుమతి ఇచ్చారంటే ఈ ఘటనలో తప్పెవరిది అంటూ నిలదీస్తున్నారు. చాలా మంది ఈ లెటర్ ను ఇప్పుడు ఆయుధంగా వాడుతూ పోస్టులు చేస్తుండటం గమనార్హం.
అల్లు అర్జున్ కు అటు సెలబ్రిటీల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అతని తమ్ముడు నాగబాబు.. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఏపీ ఎన్నికల తర్వాత మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలన్న వార్తల నేపథ్యంలో వీళ్లు బన్నీ ఇంటికి వెళ్లడం ప్రముఖంగా వార్తల్లో నిలిచింది.
అటు బాలీవుడ్ నుంచి కూడా జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ లాంటి వాళ్లు అల్లు అర్జున్ కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులకు జాగ్రత్తగా ఉండాలని చెప్పగలం కానీ.. ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఒక్కరిని నిందించడం ఎంత వరకూ సబబు అని వరుణ్ ధావన్ ప్రశ్నించడం విశేషం. బన్నీ అరెస్ట్ చేసినప్పటి నుంచి ఎక్స్ లో #AlluArjunArrest హ్యాష్‌ట్యాగ్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఈ హ్యాష్ ట్యాగ్ వాడుతూ ఎంతో మంది అల్లు అర్జున్ కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు.