Shimla Tour: కొత్త ఏడాదికి సిమ్లాలో సాహసం చేసేందుకు సిద్ధమైపోండి, వందేళ్ల చరిత్ర గల ఐస్ స్కేటింగ్ రింక్ ఓపెన్
Shimla Tour: సిమ్లా ఐస్ స్కేటింగ్ రింక్ రెడీ అయిపోయింది. కొత్త ఏడాదిని మీరు సాహసాలతో ప్రారంభించాలనుకుంటే అక్కడికి వెళ్లండి. ఇది స్థానికులను, పర్యాటకులను తీవ్రంగా ఆకర్షిస్తుంది.
సిమ్లాలోని ఐస్ స్కేటింగ్ ఎంతో మంది స్థానికులను, పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది. ఆసియాలోనే పురాతనమైన ఐస్ స్కేటింగ్ రింక్ ఇది. హిమాచల్ ప్రదేశ్ లోని చారిత్రాత్మక ప్రదేశం ఇది. దీన్ని నిర్మించి దాదాపు 104 సంవత్సరాలు పూర్తయింది. సిమ్లా ఐస్ స్కేటింగ్ రింక్ లో స్కేటింగ్ సీజన్ ప్రారంభం అయిపోయింది. 1920 లో నిర్మించిన ఈ ఓపెన్-ఎయిర్ రింక్, శీతాకాలంలో సాహసాలకు కేంద్రంగా మారుతుంది. పిల్లలు, పెద్దలకు ఇది ఒక ప్రత్యేకమైన వినోద అనుభవాన్ని అందిస్తుంది.
అనుకూల వాతావరణ పరిస్థితులు, నిర్మలమైన ఆకాశం కారణంగా ఈ ఏడాది స్కేటింగ్ సీజన్ ఎప్పటికన్నా ముందుగానే ప్రారంభమైంది. సిమ్లా ఐస్ స్కేటింగ్ క్లబ్ కార్యదర్శి మన్ప్రీత్ సింగ్ ఈ సీజన్ ప్రారంభంపై ఆశాభావం వ్యక్తం చేశారు. 'ఊహించిన దానికంటే ముందుగానే సీజన్ ప్రారంభించగలగడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం పాఠశాలలు మూతపడటంతో రిజిస్ట్రేషన్లు క్రమంగా పెరుగుతున్నాయి. డిసెంబర్ 25 నుంచి 31 వరకు జరిగే శీతాకాల కార్నివాల్ అందరినీ ఆకర్షిస్తాయని ఆయన చెప్పారు.
సిమ్లాలో ఆ అయిదు రోజులు
శీతాకాల కార్నివాల్ సీజన్ డిసెంబర్ 25 నుంచి 31 వరకు జరుగుతుంది. ఐస్ స్కేటింగ్ కు సంబంధించిన ఆటలు, ఈవెంట్‌లు ఉంటాయి. ప్రస్తుతం నెలకొన్న పొడి వాతావరణం ఈ ఏడాది స్కేటింగ్ సీజన్ పొడిగింపుపై ఆశలు పెంచుతోంది.
రింక్ చారిత్రక ప్రాముఖ్యత ఎంత చెప్పినా తక్కువే. లడఖ్ వంటి ప్రదేశాలలో కొత్త రింక్‌లు తెరిచినా కూడా సిమ్లా లోని ఈ రింక్ మాత్రం ప్రత్యేక ఆకర్షణను కలిగి ఉంది. డిసెంబర్ 20 తర్వాత పర్యాటకుల తాకిడి ఇక్కడికి విపరీతంగా పెరిగిపోతుంది. ఈ సిమ్లా రింక్ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఐస్ హాకీ కోసం రాబోయే ట్రయల్స్, జనవరిలో జరిగే ఖేలో ఇండియా కార్యక్రమానికి జాతీయ క్రీడాకారుల ఎంపిక కూడా ఉంటుంది. ఈ రింక్ కేవలం స్కేటింగ్ చేసే ప్రదేశం మాత్రమే కాదు, విలువైన జ్ఞాపకాలు మరియు వ్యక్తిగత ఎదుగుదలకు మూలస్తంభం.
యువ స్కేటర్ ఆర్యభట్ మాట్లాడుతూ "నాకు ఐదేళ్ల వయసు నుంచే స్కేటింగ్ అలవాటు. సెలవులు అంటే మాకు ఐస్ స్కేటింగ్ చేయడమే గుర్తొస్తుంది. పడిపోవడం, గాయపడటం, మళ్లీ లేవడం ఇవన్నీ సరదాలో భాగమే. మా సెలవుల్లో మేము ఎదురుచూసే ఏకైక కార్యక్రమం ఇది’ అని చెబుతున్నాడు.
డోగ్రా రింక్ వద్ద మౌలిక సదుపాయాల అభివృద్ధి లేకపోవడం వల్ల పర్యాటకులు ఎంతో మంది రావడానికి ఆలోచిస్తున్నారు. అదే సదుపాయాలు కల్పిస్తే దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ వర్కవుట్. ఒక సెషన్లో 800 కేలరీల వరకు బర్న్ చేయవచ్చు, ఇది అద్భుతమైన వ్యాయామం.
శీతాకాలపు కార్నివాల్, కార్యకలాపాలతో నిండిన సీజన్ కోసం రింక్ సిద్ధమైపోతోంది. కొత్త ఏడాదికి సిమ్లా వెళ్లాలనుకుంటే ఈ రింక్ కూడా ఓసారి సందర్శించండి.