Ilaiyaraaja temple controversy:తమిళనాడు ఆలయ వివాదంపై స్పందించిన ఇళయరాజా
Ilaiyaraaja temple controversy: ఇళయరాజా తమిళనాడులోని ఓ ఆలయంలో గర్భగుడిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన జీయర్లు.. ఇళయరాజాను బయటికి వెళ్లాల్సిందిగా సూచించారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో..
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తనకి తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో అవమానం జరిగినట్లు వస్తున్న వార్తలపై ఎట్టకేలకి స్పందించారు. ఆ ఆలయంలోని గర్భగుడి వద్దకు వెళ్లేందుకు ఇళయారాజా ప్రయత్నించగా.. అర్చకులు అందుకు అనుమతిని నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఇళయరాజాను అడ్డుకుంటున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వివాదంపై ఎట్టకేలకు ఇళయరాజా స్పందించారు.
ఇళయరాజాకి అనుమతి నిరాకరణ
శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయ గర్భగుడి ముందు ఉన్న అర్థ మండపం వద్దకు వెళ్లేందుకు ఇళయరాజా ప్రయత్నించగా.. అదే సమయంలో జీయర్లు అక్కడికి వచ్చారు. ఆ మండపం ద్వారా గర్భగుడిలోకి కేవలం జీయర్లకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేసిన జీయర్లు.. ఇళయారాజాను అనుమతించేందుకు నిరాకరించారు. దాంతో అక్కడే ఉన్న సిబ్బంది ఆలయ నిబంధనలను ఇళయరాజాకు సవివరంగా చెప్పడం కనిపించింది. దాంతో బయటకు వెళ్లి అక్కడి నుంచే పూజలు చేశారు.
తనను ఆలయ గర్భగుడి పరిసరాల నుంచి బయటకు వెళ్లిపోవాలని జీయర్లు చెప్పినట్లు వచ్చిన వార్తలను ఇళయరాజా ఖండించారు. ‘‘నా చుట్టూ కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నేను ఏ సమయంలోనైనా.. ఏ ప్రదేశంలోనైనా నా ఆత్మగౌరవం విషయంలో రాజీపడే వ్యక్తిని కాదు. జరగని విషయాన్ని కూడా జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నారు. అభిమానులు, ప్రజలు ఈ రూమర్స్ నమ్మవద్దు’’ అని సోషల్ మీడియాలో ఇళయరాజా క్లారిటీ ఇచ్చారు.
వాస్తవానికి ఇళయరాజా వెంట శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీ ఆండాళ్ జీయర్ మఠానికి చెందిన సదగోప రామానుజ అయ్యర్, సడగోప రామానుజ జీయర్ ఉన్నారు. అయితే ఈ ముగ్గురూ గర్భగుడి వద్దకు చేరుకోగానే అక్కడ జీయర్లు వారిని నిలువరించారు. పూజల అనంతరం అధికారులు ఆండాళ్ పూలదండలు, పట్టువస్త్రాలు ఇచ్చి ఇళయరాజాను సత్కరించారు.
ఇళయరాజా సంగీతం అందించిన ‘విడుదల 2’ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకి వెట్రిమారన్ దర్శకత్వం వహించారు.