Manjummel Boys vs Ilaiyaraja: మంజుమ్మెల్ బాయ్స్, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మధ్య లీగల్ వార్ ముగిసినట్లే కనిపిస్తోంది. తన పాట కమ్మనీ నీ ప్రేమ లేఖలే పాటను అనుమతి లేకుండా వాడుకున్నారంటూ ఆ మూవీ టీమ్ పై ఇళయరాజా న్యాయపోరాటానికి దిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రూ.60 లక్షలు నష్ట పరిహారంగా చెల్లించి ఈ విషయాన్ని సెటిల్ చేసుకున్నట్లు మనీ కంట్రోల్ రిపోర్టు వెల్లడించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మంజుమ్మెల్ బాయ్స్ సినిమా విడుదలైన తర్వాత సంగీత దర్శకుడు ఇళయరాజా నిర్మాతలకు లీగల్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తన పాట కమ్మనీ నీ ప్రేమ లేఖలేను అనుమతి లేకుండా వాడుకున్నారని ఆయన ఆరోపించారు. రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేయగా, రూ.60 లక్షలకు సెటిల్ అయినట్లు మనీకంట్రోల్ తెలిపింది.
లీగల్ నోటీసులు అందుకున్న మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీలు ఇళయరాజాను వ్యక్తిగతంగా కలిశారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు ఈ పాటను సినిమాలో విరివిగా వాడుకోవడంతో ఇళయరాజా రూ.2 కోట్ల పరిహారం డిమాండ్ చేశారు.
అయినా చివరకు రూ.60 లక్షలకు సెటిల్ అయినట్లు సమాచారం. ఈ డిమాండ్ చాలా ఎక్కువగా ఉందంటూ నిర్మాతలు భావించడంతో సెటిల్ మెంట్ కు ముందు పెద్ద ఎత్తున చర్చలు జరిగాయని చెబుతున్నారు. చివరకు ఇరు పార్టీలు రాజీకి వచ్చాయి. ఈ కమ్మనీ నీ ప్రేమ లేఖలే అనే పాట 1991లో కమల్ హాసన్ నటించిన గుణ చిత్రంలోనిది. ఆ మూవీ నుంచే ఆ గుహలకు కూడా గుణ కేవ్స్ అనే పేరు వచ్చిన విషయం తెలిసిందే.
ఇళయరాజా గత కొంతకాలంగా తన సంగీతంపై హక్కుల కోసం పోరాడుతున్నారు. 2017లో ప్రపంచ పర్యటనలో అనుమతి లేకుండా తన పాటలను పాడినందుకు గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంపై ఆయన కేసు పెట్టారు. 1983లో వచ్చిన 'తంగ మగన్' సినిమాలోని వా వా పక్కామ్ వా పాటను తన అనుమతి లేకుండా ప్రమోషనల్ వీడియో కోసం వాడుకున్నందుకు రజినీకాంత్ నటించిన కూలీ చిత్ర నిర్మాతలకు ఆయన ఇటీవల లీగల్ నోటీసులు పంపారు.
1970వ దశకం చివర్లో, 1980వ దశకం ప్రారంభంలో తాను కంపోజ్ చేసిన పాటలపై మద్రాస్ హైకోర్టులో ఇండియన్ రికార్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (ఇనర్కో)తో న్యాయపోరాటం చేస్తున్నారు. లిరిక్స్ మరొకరు రాసినందున ఇళయరాజా ఈ పాటను క్లెయిమ్ చేయగలరా అని కోర్టు ప్రశ్నించింది.
సౌబిన్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొడువల్, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్ కురియన్, ఖలీద్ రెహమాన్, షెబిన్ బెన్సన్ ప్రధాన తారాగణంగా చిదంబరం దర్శకత్వం వహించిన ఈ మంజుమ్మెల్ బాయ్స్ మూవీ 2006లో జరిగిన ఓ నిజ ఘటన ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా నిలిచింది.