Maharaja: 40 వేల స్క్రీన్లలో మరోసారి రిలీజ్ అవుతున్న విజయ్ సేతుపతి బ్లాక్‌బస్టర్ మూవీ.. ఓటీటీలో చూశారా?
Maharaja: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీ ఏకంగా 40 వేల స్క్రీన్లలో మరోసారి రిలీజ్ కాబోతోంది. అది కూడా చైనాలో కావడం విశేషం. ఇప్పటికే ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
Maharaja: విజయ్ సేతుపతి కెరీర్లో 50వ సినిమాగా వచ్చి అతని కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది మహారాజా. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ తమిళ సినిమాల్లో అదీ ఒకటి. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ మూవీ ఇప్పుడు చైనాలో ఏకంగా 40 వేల స్క్రీన్లలో రిలీజ్ కానుండటం విశేషం. ఇండియన్ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించిన ఈ మూవీ.. ఇప్పుడు చైనాలో దుమ్ము రేపడానికి సిద్ధమవుతోంది.
చైనాలో మహారాజా
ఇండియాలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను చైనాలో రిలీజ్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈసారి మహారాజా మూవీని మాత్రం ఏకంగా 40 వేల స్క్రీన్లలో రిలీజ్ చేస్తుండటమే ఆశ్చర్యం కలిగిస్తోంది. నవంబర్ 29న చైనాలో మూవీ రిలీజ్ కాబోతోంది. యి షి ఫిల్మ్స్, అలీబాబా పిక్చర్స్ సంయుక్తంగా చైనాలో మహారాజా మూవీ రిలీజ్ చేస్తున్నాయి.
ఓ ఇండియన్ మూవీ చైనాలో ఇంత భారీగా రిలీజ్ కానుండటం మామూలు విషయం కాదు. ఇప్పటి వరకూ ఏ భారతీయ సినిమాకూ దక్కని ఘనత ఇది. చైనా ఆడియెన్స్ ఈ మూవీని ఎలా ఆదరిస్తారన్నది చూడాలి.
మహారాజా మూవీ ఎలా ఉందంటే?
మహారాజా కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.107 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఓ సింపుల్ రివేంజ్ స్టోరీకి ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులు ఇస్తూ మహారాజా మూవీని దర్శకుడు నిథిలన్ సామినాథన్ అద్భుతంగా తెరకెక్కించాడు.
ఈ సినిమాలో విలన్ గా నటించిన బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. అంతకుముందు మెర్రీ క్రిస్మస్ మూవీ ఇచ్చిన పరాజయాన్ని విజయ్ సేతుపతి.. ఈ మహారాజా ద్వారా భర్తీ చేయగలిగాడు.
మహారాజా మూవీ ఓ క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమాలో ఓ సాధారణ బార్బర్ గా నటించాడు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. తన ఇంట్లో ఓ దొంగతనం జరిగిందని, తమ జీవితాల్లో ఎంతో ముఖ్యమైన లక్ష్మిని ఎవరో ఎత్తుకెళ్లారని మహారాజా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాడు. అసలు ఆ లక్ష్మి ఎవరు అన్నది ఓ ట్విస్ట్ కాగా.. దాని చుట్టూ తిరిగే కథ, అందులో భాగంగా వచ్చే ట్విస్టులకు మైండ్ బ్లాంక్ అవుతుంది.
ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకుల ఊహకు అందని ట్విస్టులతో తీస్తే ఎలా ఉంటుందో ఈ మహారాజా మూవీ నిరూపిస్తోంది. మొదటి సీన్ నుంచి క్లైమ్యాక్స్ వరకు ప్రతి సీన్లోనూ సినిమా ఎంతో ఉత్కంఠ రేపుతోంది. తెలిసిన స్టోరీయేగా అని అనుకునే ప్రతిసారీ ఓ ట్విస్ట్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. ఇదే ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది.
ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా చాలా వారాల పాటు టాప్ ట్రెండింగ్ మూవీగా కొనసాగింది. ఇప్పుడు తమిళంతోపాటు తెలుగులోనూ మూవీ అందుబాటులో ఉంది.