AP Registration Charges: ఏపీలో మళ్లీ రిజిస్ట్రేషన్ బాదుడుకు రెడీ, రెండేళ్లుగా తిరోగమనంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు
AP Registration Charges: ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ విలువల సవరణకు ప్రభుత్వం రెడీ అవుతోంది. జనవరి 1 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. ఫలితంగా ప్రజలపై రిజిస్ట్రేషన్ భారం పెరగనుంది. 2022లో చివరిసారిగా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలను ప్రభుత్వం సవరించింది.
AP Registration Charges: మూలిగే నక్క మీద తాటికాయలా అసలే అంతంత మాత్రంగా ఉంటోన్న ఏపీ రియల్ ఎస్టేట్ లావాదేవీలపై మరో భారం పడనుంది. 1నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. వైసీపీ హయంలో 2022లో రిజిస్ట్రేషన్ విలువలను భారీగా పెంచేశారు. మార్కెట్ విలువకు, బహిరంగ మార్కెట్ ధరలకు పెద్దగా వ్యత్యాసం లేనంతగా ఈ ధరలు చేరుకున్నాయి.దీంతో గత రెండున్నరేళ్లుగా రియల్ ఎస్టేట్ లావాదేవీలు తగ్గిపోయాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయాన్ని ఆర్జించే శాఖల విషయంలో గత ప్రభుత్వ బాటలోనే సాగుతోంది. రిజిస్ట్రేషన్ విలువల సవరణ కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లా శాఖల నుంచి ప్రతిపాదనలు సేకరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ విలువ పెంచాలని శాఖాపరమైన సమావేశాల్లో ప్రకటించారు. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాజా నిర్ణయంతో ఈ ఏడాది డిసెంబర్‌లోగా రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
ప్రభుత్వ నిర్ణయంతో జనవరి 1వ తేదీ నుంచి ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమ ల్లోకి రాబోతున్నాయి.ఈ దఫా పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి కొత్త విలువలు అమల్లోకి తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల అభివృద్ధి, ఇతర అంశాల ప్రాతిపదికగా ప్రసుత్తం ఉన్న దానిపై 10% నుంచి 15% వరకు విలువలు పెరిగే అవకాశం ఉంది.
పెద్ద తేడా ఏమి లేదు..
సాధారణంగా ప్రభుత్వ లెక్కల్లో ఉండే భూమి విలువకు బహిరంగ మార్కెట్‌లో ఉండే విలువకు వ్యత్యాసం ఉంటుంది. ఈ విధానంలో భూమి కొనుగోలు చేసే వారికి తక్కువ ధరకు నివాస భూమి లభించడంతో పాటు అమ్మే వారికి లాభసాటిగా ఉండేది. ఈ విధానంలో ఆదాయాన్ని కోల్పోతున్నామని గుర్తించిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువలను పెంచుకుంటూ పోతోంది. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి బహిరంగ మార్కెట్ విలువలతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ విలువను ప్రభుత్వాలు పెంచుకుంటూ వచ్చాయి. దీని వల్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య మాటెలా ఉన్నా ప్రభుత్వానికి మాత్రం భారీగా ఆదాయం సమకూరింది.
అపార్ట్‌మెంట్‌లకైతే భూమి విలువతో పాటు చదరపు అడుగుల్లో నిర్మాణ విలువను కూడా లెక్కిస్తారు. ఈ విధానంలో ఫ్లాట్ల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. అన్‌డివైడెడ్ షేర్‌లో కొనుగోలు దారుడికి లభించే వాటాతో పాటు నిర్మాణం జరిగిన భూమికి కూడా రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి. ఉదాహరణకు విజయవాడలో 2వేల చదరపు అడుగుల ఫ్లాట్‌కు ప్రభుత్వ లెక్కల్లో రూ.75లక్షల నుంచి కోటి రుపాయల ఖరీదు చేస్తే అందులో దాదాపు రూ.6 నుంచి రూ.10 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్‌లో సదరు ఫ్లాట్ విలువ కోటి నుంచి కోటిన్నర వరకు ఉండొచ్చు.
సౌకర్యాలతో సంబంధం లేకుండా ధరలు…
మౌలిక సదుపాయాలు, అభివృద్ధితో సంబంధం లేకుండా ఎడాపెడా ధరలను ఖరారు చేసే విధానాలు రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. దీని వల్ల ఏపీలో రియల్ ఎస్టేట్ మార్కెట్‌లు డీలా పడుతున్నాయి. జిల్లాల వారీగా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో భూముల ధరల్ని ఖరారు చేసేలా మార్గదర్శకాలు జారీ చేశారు.
విలువల సవరణ ప్రతిపాదనలకు జిల్లా కమిటీల ఆమోదం తెలిపిన తర్వాత ఈ నెల 20న సబ్-రిజి స్ట్రార్ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో కొత్త ధరల ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఈ నెల 24వ వరకు అభ్యంతరాలు/సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. అభ్యంతరాల పరిశీలన ఈ నెల 27వ తేదీ వరకు జరుగుతుంది.
2025 జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలు చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్లను ఆదేశిస్తూ రాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ శేషగిరిబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకా లకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. తాజా నిర్ణయంతో ప్రస్తుత ధరలపై 10 నుంచి 15శాతం వరకు ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.