Free JioCloud : జియో మరో విప్లవం! ఫ్రీగా 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్..
JioCloud free storage : జియో మరో విప్లవాత్మక నిర్ణయంతో ‘స్టోరేజ్’ కష్టాలకు ఇక చెక్! జియోక్లౌడ్‌లో 100 జీబీ స్టోరేజ్ వరకు ఉచితంగా పొందే అవకాశాన్ని మిస్ చేసుకోకండి. పూర్తి వివరాల్లోకి వెళితే..
‘క్లౌడ్ స్టోరేజ్’ స్పేస్‌లో గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలకు సవాలు విసురుతూ తమ కస్టమర్స్‌కి అదిరిపోయే వార్తను ఇచ్చింది దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. 100 జీబీ వరకు క్లౌడ్ స్టోరేజ్‌ని ఉచితంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
జియోక్లౌడ్‌లో ఫ్రీగా 100 జీబీ క్లౌడ్‌స్టోరేజ్..
" జియో ఏఐ క్లౌడ్ వెల్కమ్" ఆఫర్లో భాగంగా ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫీచర్‌ని కంపెనీ తన 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో మొదట ప్రకటించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ యూజర్లకు అందుబాటులో ఉన్న జియోక్లౌడ్ యాప్ ద్వారా జియో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లు ఈ ఉదారమైన స్టోరేజ్ ఆప్షన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఇంతకుముందు.. జియోక్లౌడ్ 5 జీబీ ఉచిత స్టోరేజ్‌ని మాత్రమే అందించింది. కానీ ఈ అప్డేట్తో వినియోగదారులు ఎటువంటి అదనపు రుసుము లేకుండా 100 జీబీ స్టోరేజ్ వరకు ఉచితంగా యాక్సెస్ పొందొచ్చు.
ఏదేమైనా, ఈ ఆఫర్ తాత్కాలికంగా మాత్రమే అందుబాటులో ఉండొచ్చని గమనించడం ముఖ్యం! భవిష్యత్తులో ఈ సేవను ఉపయోగించడాన్ని కొనసాగించడానికి వినియోగదారులు సబ్స్క్రిప్షన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. జియో సిమ్‌లను గతంలో ఫ్రీగా ఇచ్చిన సంస్థ ఆ తర్వాత ఛార్జీలను వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.
కానీ జియో నిర్ణయం క్లౌడ్ స్టోరేజ్ మార్కెట్లో ప్రధాన పోటీదారుల కంటే జియోక్లౌడ్‌ను ముందంజలో ఉంచింది. ఉదాహరణకు.. గూగుల్ డ్రైవ్ కేవలం 15 జీబీ ఉచిత స్టోరేజీని అందిస్తుంది. యాపిల్ ఐక్లౌడ్ 5 జీబీ మాత్రమే అందిస్తుంది. మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్ కూడా 5 జీబీ స్టోరేజ్ ఖాతాను అందిస్తుంది. 100 జీబీ స్టోరేజ్ కోరుకునేవారికి గూగుల్ నెలకు రూ.130 లేదా వార్షికంగా రూ.1,300 తీసుకుంటుంది. యాపిల్ 200 జీబీ స్టోరేజ్ ప్లాన్ కోసం నెలకు రూ.219 వసూలు చేస్తుంది.
100 జీబీ ఫ్రీ స్టోరేజ్ ఆఫర్‌ని ఇలా రిడీమ్ చేసుకోండి..
ముందుగా మీరు మైజియో యాప్ తాజా వెర్షన్‌ను ఇన్స్టాల్ చేసుకున్నారని నిర్ధారించుకోండి. యాప్ ఓపెన్ చేయగానే ఆఫర్‌ను హైలైట్ చేస్తూ పాప్-అప్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. లేదా యాప్‌లో '100 జీబీ క్లౌడ్ స్టోరేజ్' అనే బ్యానర్‌ని సులభంగా గుర్తించవచ్చు. దానిపై క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా జియోక్లౌడ్‌లో 100 జీబీ స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. క్లౌడ్ సర్వీస్ పూర్తి యాక్సెస్ కోసం వినియోగదారులు ఉచిత జియోక్లౌడ్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి.
జియోక్లౌడ్ ఇతర ప్రసిద్ధ క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ ఫామ్‌ల మాదిరిగానే పనిచేస్తుంది. ఫొటోలు, ఆడియో, వీడియోలు, డాక్యుమెంట్స్‌ని నిల్వ చేయడానికి వెసులుబాటు ఉంటుంది. ఇందులో డిజిలాకర్ ఇంటిగ్రేషన్ కూడా ఉంది! ఇక్కడ వినియోగదారులు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వం జారీ చేసిన ముఖ్యమైన పత్రాలను సేవ్ చేసుకోవచ్చు. ఇతర క్లౌడ్ సేవల మాదిరిగానే జియోక్లౌడ్‌లో స్టోర్ చేసిన ఫైళ్లను స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవచ్చు. వారికి సెక్యూర్డ్ యాక్సెస్‌ని ఇవ్వొచ్చు.
సంబంధిత కథనం