పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం మరో కీలక అప్డేట్ ఇచ్చింది. పేర్ల నమోదుతో పాటు ఇతర వివరాల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించింది. ఇందుకు డిసెంబర్ 23వ తేదీని తుది గడువుగా పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.
వచ్చే మార్చిలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. మరోవైపు ఇందుకు సంబంధించిన ఫీజులను కూడా స్వీకరించింది. గడువుగా కూడా పూర్తి అయింది. విద్యార్థుల వివరాలన్ని కూడా ఆన్ లైన్ చేశారు. అయితే విద్యార్థి పేరులోనే కాని పుట్టిన తేదీ వివరాలు, చదివే మీడియం, తల్లిదండ్రుల పేర్ల విషయంలో ఏమైనా తప్పులు ఉన్నట్లు అయితే సవరణ చేసుకోవాలని పరీక్షల విభాగం సూచించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొంది. ఆన్ లైన్ లో ప్రధానోపాధ్యాయుడు సరి చేసే అవకాశం ఉందని తెలిపింది. ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించింది.
వచ్చే ఏడాది మార్చి 17 నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను ఏపీ విద్యాశాఖ ఇటీవలనే విడుదల చేసింది.
మరోవైపు ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. 2025 పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా విడుదల చేశారు. మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఒకేషనల్ విద్యార్థులకు కూడా ఇవే తేదీలలో పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని పరీక్షలు మార్చి 20వ తేదీతో పూర్తి కానున్నాయి.