AP SSC Exams 2025: ఏపీలో మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు, మార్చి 1నుంచి ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారు
AP SSC Exams 2025: ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2025 మార్చి 17 నుంచి పరీక్షల్ని నిర్వహించేందుకు ఎస్సెస్సీ బోర్డు ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వానికిి పంపింది. మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
AP SSC Exams 2025: ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2025 మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఎస్సెస్సీ బోర్డు షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ అమోదించిన తర్వాత షెడ్యూల్‌ను ఖరారు చేస్తారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం ప్రతిపాదిత షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వ అమోదం కోసం ఇంటర్ బోర్డు పంపింది. ప్రభుత్వ అమోదం లభిస్తే 2025 మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఎన్విరాన్‌మెంట్ సైన్స్, మోరల్ వాల్యూస్ పరీక్షల్ని ఫిబ్రవరి 1, 3వ తేదీల్లో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ బోర్డు పరీక్షలు ముగియడానికి ఒకరోజు ముందు నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయి.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫీజుల చెల్లింపు గడువు ముగిసింది. ఫీజుల చెల్లింపు షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు గత నెలలో విడుదల చేసింది. నవంబర్ 21తో ఫీజుల చెల్లింపు గడువు ముగిసింది. ఇంటర్ మొదటి, ద్వితియ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులతో పాటు సప్లమెంటరీ విద్యార్థులు ఫీజులు చెల్లింపు తేదీలను ఖరారు చేశారు. హాజరు మినహాయింపు పొందిన అభ్యర్థులు కూడా వార్షిక పరీక్ష ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. వెయ్యి రుపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 5వ తేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లించడానికి అనుమతించారు. .
ఇంటర్ మొదటి, ద్వితియ సంవత్సరం వార్షిక ఫీజులతో పాటు గతంలో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు, ప్రైవేట్‌గా పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు వార్షిక పరీక్ష ఫీజులు చెల్లించాలని ఇంటర్ బోర్డు సూచించింది.
ఇంటర్మీడియట్ 2025 పరీక్ష ఫీజుల షెడ్యూల్ ఇలా...
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2025 మార్చి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఎలాంటి జరిమానా లేకుండా అక్టోబర్ 21 నుంచి నవంబర్ 11 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రూ.1000 జరిమానాతో నవంబర్ 12 నుంచి 20వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజుల చెల్లింపుకు ఎలాంటి గడువు పొడిగింపు ఉండదని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
పరీక్ష ఫీజు ఇలా...
ఇంటర్ మొదటి, ద్వితియ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు గ్రూపుతో సంబంధం లేకుండా విద్యార్థులు రూ.600 ఫీజు చెల్లించాలి.
ఇంటర్ జనరల్, ఒకేషనల్ కోర్సులు చదువుతున్న మొదటి, ద్వితియ సంవత్సరం విద్యార్థులు రూ.275 ప్రాక్టికల్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇంటర్ జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులు చదువుతున్న అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.165 చెల్లించాలి. బైపీసీ కోర్సులు చదివే విద్యార్థులు మ్యాథ్స్ బ్రిడ్సి కోర్సు కోసం కూడా ఫీజు చెల్లించాలి.
రెండో సంవత్సరం ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు ఫీజుగా రూ.165 చెల్లించాల్సి ఉంటుంది.
ఇంటర్ మొదటి, ద్వితియ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న జనరల్, ఒకేషనల్ విద్యార్థులు సబ్జెక్టులతో సంబంధం లేకుండా జనరల్, ఒకేషనల్ కోర్సులకు రూ.1200 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
సబ్జెక్టుల సంఖ్యతో సంబంధం లేకుండా మొదటి, ద్వితియ సంవత్సరం జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రూ.550 ఫీజు చెల్లించాలి.
రెండు సంవత్సరాల జనరల్, ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు సబ్జెక్టు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రూ.330 చెల్లించాలి.
ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, మార్కుల్లో పురోగతి కోసం మొదటి, ద్వితియ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార‌్థులు ఆర్ట్స్ గ్రూపులైతే రూ.1350, సైన్స్ గ్రూపులైతే రూ.1600 ఫీజు చెల్లించాలి.