Prithvi Shaw dropped:విజయ్ హజారే ట్రోఫీ నుంచి పృథ్వీ షా ఔట్.. యంగ్ బ్యాటర్ కెరీర్ ముగిసినట్లేనా?
Prithvi Shaw dropped: పృథ్వీ షా ఇటీవల ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకే ఓవర్‌లో వరుసగా 4,4,4,4,4,4 కొట్టగల సామర్థ్యం ఉన్నా…
టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షాకి బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో 25 ఏళ్ల పృథ్వీ షాను ఏ ఫ్రాంఛైజీ కనీసం కొనుగోలు చేయలేదు. ఒకే ఓవర్‌లో ఆరు బంతుల్నీ బౌండరీకి తరలించగల సామర్థ్యం ఉన్న పృథ్వీ షా.. వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఐపీఎల్‌కి దూరం
ఇప్పటికే టీమిండియాకి దూరమైన పృథ్వీ షా.. దేశవాళీ టోర్నీల్లో ఆడుతూ ఐపీఎల్‌లో ఇన్నాళ్లు మెరుస్తూ కనిపించాడు. అయితే.. నెల రోజుల వ్యవధిలోనే అటు ఐపీఎల్‌తో పాటు ఇటు దేశవాళీ టోర్నీలకి కూడా ఈ యంగ్ బ్యాటర్ దూరమైపోయాడు. వేలంలో అన్‌సోల్డ్‌గా మిగలడంతో ఐపీఎల్ 2025 సీజన్‌లోపృథ్వీ షా ఆడే అవకాశం లేదు.
దేశవాళీ క్రికెట్‌లో నో ఛాన్స్
ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ 2024-25 కోసం ప్రకటించిన ముంబయి జట్టులోనూ పృథ్వీ షాకి చోటు దక్కలేదు. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ముంబై టీమ్ ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా నిలిచినప్పుడు పృథ్వీ షా జట్టులో ఉన్నాడు.
రికార్డుల్ని పెట్టిన షా
విజయ్ హజారే ట్రోఫీ తొలి మూడు రౌండ్ల కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ముంబయి ప్రకటించింది. అయితే.. ఇందులో తన పేరు లేకపోవడంతో పృథ్వీ షా స్పందించాడు. ‘‘చెప్పు దేవుడా.. 65 ఇన్నింగ్స్‌లో 55.7 సగటుతో 126 స్ట్రైక్ రేట్‌తో 3,399 పరుగులు చేసినా సరిపోలేదా? నాపై నాకు విశ్వాసం ఉంది.. నేను తిరిగి జట్టులోకి రావడం ఖాయం. ఓం సాయి రామ్’’ అని పృథ్వీ షా రాసుకొచ్చాడు.
షా కెరీర్ ఎందుకిలా?
భారత్ తరఫున ఐదు టెస్టులు, ఆరు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన పృథ్వీ షా.. 2021లో చివరిగా తన అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఈ మూడేళ్లలో మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు. పృథ్వీ షా ఐపీఎల్ 2025 వేలంలో రూ.75 లక్షలకే వస్తున్నా ఏ ఫ్రాంఛైజీ పట్టించుకోలేదు. అతను సుదీర్ఘకాలం ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అతని కోసం బిడ్ వేయలేదు.
పృథ్వీ షా క్రమశిక్షణ రాహిత్యం అతని కెరీర్‌ను దెబ్బతీయగా.. పేలవ ఫిట్‌నెస్ అతని ఆటను గాడితప్పేలా చేసింది. కెరీర్ ఆరంభంలో సచిన్‌తో పృథ్వీ షాను పోల్చిన మాజీ క్రికెటర్లు.. ఇప్పుడు అనామకుడిలా విమర్శిస్తున్నారు.