Ind vs Aus 3rd Test Day 4: హమ్మయ్య.. ఫాలో ఆన్ తప్పించిన ఆ ముగ్గురు.. ఊపిరి పీల్చుకున్న టీమిండియా-ind vs aus 3rd test day 4 ravindra jadeja akash deep bumrah fight back saved team india from follow on ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus 3rd Test Day 4: హమ్మయ్య.. ఫాలో ఆన్ తప్పించిన ఆ ముగ్గురు.. ఊపిరి పీల్చుకున్న టీమిండియా

Ind vs Aus 3rd Test Day 4: హమ్మయ్య.. ఫాలో ఆన్ తప్పించిన ఆ ముగ్గురు.. ఊపిరి పీల్చుకున్న టీమిండియా

Hari Prasad S HT Telugu
Dec 17, 2024 01:46 PM IST

Ind vs Aus 3rd Test Day 4: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు నాలుగో రోజు టీమిండియా కాస్త ఊపిరి పీల్చుకుంది. జడేజా, బుమ్రా, ఆకాశ్ దీప్ పోరాటంతో ఇండియన్ టీమ్ ఫాలో ఆన్ నుంచి తప్పించుకుంది. ఇక చివరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి.

హమ్మయ్య.. ఫాలో ఆన్ తప్పించిన ఆ ముగ్గురు.. ఊపిరి పీల్చుకున్న టీమిండియా
హమ్మయ్య.. ఫాలో ఆన్ తప్పించిన ఆ ముగ్గురు.. ఊపిరి పీల్చుకున్న టీమిండియా (AFP)

Ind vs Aus 3rd Test Day 4: బ్రిస్బేన్ టెస్టులో వర్షం.. కేఎల్ రాహుల్, జడేజా హాఫ్ సెంచరీలు.. చివరి వికెట్ పడకుండా బుమ్రా, ఆకాశ్ దీప్ పోరాటం టీమిండియాను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాయి. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే మరో 33 పరుగులు అవసరమైన వేళ 9వ వికెట్ పడినా.. చివరి వికెట్ కు బుమ్రా, ఆకాశ్ దీప్ అజేయంగా 39 పరుగులు జోడించడంతో టీమ్ ఊపిరి పీల్చుకుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 252 రన్స్ చేసింది.

ఫాలో ఆన్ తప్పించిన బుమ్రా, ఆకాశ్ దీప్

బ్రిస్బేన్ టెస్టులో ఒక దశలో టీమిండియాకు ఫాలో ఆన్ తప్పదనిపించింది. 44 పరుగులకే 4 వికెట్లు, 74 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో కేఎల్ రాహుల్ (84), రవీంద్ర జడేజా (77) పోరాటం టీమ్ ను ఆదుకుంది. ఆ తర్వాత ఈ గండం నుంచి గట్టెక్కిస్తాడనుకున్న జడేజా కీలకమైన సమయంలో ఔటైనా.. చివరి వికెట్ పడకుండా బుమ్రా, ఆకాశ్ దీప్ చేసిన పోరాటం అసామాన్యం అని చెప్పొచ్చు. వర్షం వల్ల తరచూ అంతరాయాలు కలుగుతున్న ఈ టెస్టులో టీమిండియాను కచ్చితంగా ఫాలో ఆన్ ఆడిస్తే గెలవచ్చని ఆస్ట్రేలియా భావించింది.

కానీ బుమ్రా, ఆకాశ్ దీప్ జోడీ ఆ అవకాశం ఇవ్వలేదు. ఊహకందని రీతిలో ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ ఇద్దరూ చివరి వికెట్ కు ఇప్పటికే 39 పరుగులు జోడించారు. ఇందులో ఆకాశ్ దీప్ చేసిన పరుగులే 27 కావడం విశేషం. అందులో రెండు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. బుమ్రా కూడా 10 పరుగులతో అజేయంగా ఉన్నాడు.

వీళ్లిద్దరూ వికెట్ కాపాడుకోవడంతో ఫాలో ఆన్ గండం గట్టెక్కడానికి కావాల్సిన 246 పరుగుల మార్క్ ను టీమిండియా అందుకుంది. ఆ స్కోరు దాటగానే ఆకాశ్ దీప్ ఓ భారీ సిక్స్ కూడా కొట్టాడు. ఆ సమయంలో వెలుతురు సరిగా లేదంటూ ఆటను నిలిపేశారు. దీంతో నాలుగో రోజు ముగిసే సమయానికి ఇండియన్ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 252 రన్స్ చేసింది. ఇంకా 193 పరుగులు వెనుకబడి ఉంది.

బ్రిస్బేన్ టెస్ట్ డ్రా ఖాయమేనా?

బ్రిస్బేన్ టెస్ట్ ఇక డ్రా అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ టెస్టు తొలి రోజు ఆట 90 శాతానికిపైగా తుడిచిపెట్టుకుపోయింది. తర్వాతి మూడు రోజులు కూడా వరుణుడు తరుచూ అడ్డుపడుతూనే ఉన్నాడు. దీంతో నాలుగు రోజులు కలిపి కేవలం 191 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. చివరి రోజు కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. దీనికితోడు టీమిండియా ఫాలో ఆన్ తప్పించుకోవడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఆడాల్సిందే.

చివరి రోజు ఇండియన్ టీమ్ చివరి వికెట్ ను త్వరగా తీసి.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో వేగంగా పరుగులు చేసి రోహిత్ సేనకు కంగారూలు సవాలు విసురుతారా లేక మ్యాచ్ డ్రా కోసమే ఆడతారా అన్నది చూడాలి. చివరి రోజు వర్షం ఆటంకం కలిగించకపోతే మాత్రం ఈ మ్యాచ్ లో ఫలితం కోసం ఆస్ట్రేలియా కచ్చితంగా ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు.

Whats_app_banner